Leela Bordia: గులాబీ నగరానికి నీలాల నగిషీలు చెక్కారు!

గులాబీ నగరం జయపుర పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవి బ్లూపాటరీనే. అయితే, వాటి గురించి మాట్లాడటం మొదలుపెడితే... కచ్చితంగా  లీలా బోర్డియా గురించి కూడా చెప్పుకోవాలి.

Published : 03 Apr 2023 00:29 IST

గులాబీ నగరం జయపుర పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవి బ్లూపాటరీనే. అయితే, వాటి గురించి మాట్లాడటం మొదలుపెడితే... కచ్చితంగా  లీలా బోర్డియా గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అవసాన దశలో ఉన్న ఈ కళకు పునరుజ్జీవం ఇచ్చింది ఆవిడే మరి. ఆ కథ ఏంటో తెలుసుకుందామా!
నలుగురికి ప్రయోజనం చేకూరే విషయం అయితే చాలు...అందుకోసం నాలుగు రోజులు కష్టపడినా పరవాలేదు అనుకునే తత్వం లీలా బోర్డియాది.  కోల్‌కతాకు చెందిన ఆమె తండ్రి కార్ల ఫ్యాక్టరీలో ఎగ్జిక్యూటివ్‌. తల్లి సామాజిక సేవకురాలు. మదర్‌ థెరిసాతో కలిసి మురికివాడల్లో తిరుగుతూ ఆవిడ పేదలకోసం పనిచేసిన సందర్భాలు లీలపై ఎంతగానో ప్రభావం చూపించాయి. అందుకే, ఎక్కడ ఏ సేవాకార్యక్రమం నిర్వహిస్తోన్నా తనదే ముందడుగయ్యేది. రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ పూర్తి చేశారు లీల. జయపురకి చెందిన ఇంజినీర్‌ కమల్‌ బోర్డియాను పెళ్లి చేసుకుని ఆ నగరంలోనే స్థిరపడ్డారు.

వారికోసం ఏదైనా చేయాలని...

లీల మాంటిస్సోరి స్కూల్‌లో టీచర్‌గానూ కొన్నాళ్లు పనిచేశారు. నిత్యం ఏదో తెలుసుకోవాలి? ఏదో చేయాలన్న తపన కలిగిన ఆమె ఆ సమయంలో జయపుర చుట్టుపక్కల గ్రామాలను చూడటానికి వెళ్లారు. అక్కడ బ్లూపాటరీ(నీలిరంగు సెరామిక్‌ వస్తువుల) తయారీని చూసి ముచ్చటపడ్డారు. వారితో మాట్లాడితే.. ఆ కళ అవసాన దశకు చేరకున్నదన్న సంగతి తెలిసి ఆవేదన చెందారు. ఉపాధి దొరక్క వలసెళ్ల్లిపోతోన్న కళాకారులకు తానేదైనా చేయాలనుకున్నారు. ముందు వారికి దగ్గరయ్యేందుకు కొన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఆ ఉత్పత్తులను తానే అమ్మిపెట్టాలనుకొని కొన్ని ప్రయత్నాలు చేశారు. కొనడానికి ఎవరూ అంత తొందరగా ముందుకు రాలేదు. పట్టువదలకుండా ప్రయత్నిస్తే...ఆర్నెల్ల తర్వాత కొంత విజయం సాధించగలిగారు. ఆ ఉత్పత్తులకు దేశవిదేశాల్లో మరింత ఆదరణ కల్పించేందుకు 1980లో ‘నీర్జా ఇంటర్నేషనల్‌’ పేరుతో సంస్థను స్థాపించారు. ఈ కళకోసం లీల కష్టపడటం చూసిన వారంతా మునిగిపోయే పడవ మీద ప్రయాణిస్తున్నావని హెచ్చరించారు. అయినా సరే ‘నేను చేస్తోన్న పని వల్ల ఎన్నో జీవితాలు బాగుపడతాయన్న ఆలోచన... కష్టనష్టాల గురించి ఆలోచించనివ్వలేదు’ అంటారామె.

మార్పులెన్నో చేశారు...

నిజానికి లీలకు అప్పటివరకూ ఈ కళ గురించి ఏమీ తెలియదు. వీటి తయారీలో ఎటువంటి అనుభవమూ లేదు. అయితేనేం! మనసు పెట్టి ఆలోచించి మార్పులెన్నో తెచ్చారు. పురాతన కళకు పునరుజ్జీవనం కల్పించాలని సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక శైలిని అద్ది కొత్త రకాల ఉత్పత్తులెన్నో తీసుకువచ్చారు. పెద్ద పెద్ద కుండీలూ, కుండలు వంటి సంప్రదాయ రకాలతో పాటు డోర్‌నాబ్‌లు, పూసలూ, క్యాండిల్‌ స్టాండ్‌లు, లాంతర్లు, కోస్టర్లు, పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు...ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల్ని డిజైన్‌ చేశారు. క్రమంగా వినియోగదారుల అవసరాలూ, అభిరుచులకు అనుగుణంగా చేసిన ఈ మార్పులు ఎంతో ఆదరణ పొందాయి 500 ప్రత్యేక డిజైన్లతో... సుమారు వెయ్యిరకాల ఉత్పత్తులను వీరు తయారు చేస్తున్నారు. వేలమంది హస్తకళాకారులకు ఉపాధినందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బ్లూ పాటరీ ఉత్పత్తిదారీ సంస్థ నీర్జా ఇంటర్నేషనల్‌. ఈ సంస్థ అతిపెద్ద ప్లేట్‌ (30 అంగుళాలు) తయారు చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించుకుంది. బ్లూపాటరీ మీద కాఫీ టేబుల్‌ బుక్‌ రాసిన మొదటి సెరామిస్ట్‌గా లీల గుర్తింపు పొందారు. ఇంతేనా! ఈ సంస్థ మీద దేశ, విదేశీ సంస్థలెన్నో అధ్యయనాలు చేశాయి. జర్నల్స్‌ ప్రచురించాయి. సీబీఎస్‌సీ బ్లూపాటరీ కళను పాఠ్యాంశంగానూ చేర్చింది. ఇలా గులాబీ నగరానికి నీలాల నగిషీలతో వెలుగులెన్నో తెచ్చారు లీలాబోర్డియా. అందుకే ఆమెను అక్కడివారంతా ‘బ్లూపాటరీ క్వీన్‌’గా పిలుస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్