అందుకోసం ఈత నేర్చుకుంది.. ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది!

అధిక బరువును తగ్గించుకోవాలని ఏడేళ్ల వయసులో ఈత కొలనులోకి దిగింది. దాన్నే కెరీర్‌గా మార్చుకొని, అంచెలంచెలుగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండించింది. ఇక ఒలింపిక్సే తరువాయి అన్న తరుణంలో దురదృష్టవశాత్తూ వరుస గాయాలు, లాక్‌డౌన్‌ అడ్డంకులతో రెండేళ్ల పాటు ఆటకు దూరమైంది. కానీ ఒలింపిక్స్‌ కలను నెరవేర్చుకునేందుకు ఈ ఏడాది మళ్లీ పూల్‌లోకి అడుగుపెట్టింది. విరామం వచ్చినా తనలో వాడి తగ్గలేదని నిరూపించుకుంది.

Updated : 03 Jul 2021 20:06 IST

Photo: Instagram

అధిక బరువును తగ్గించుకోవాలని ఏడేళ్ల వయసులో ఈత కొలనులోకి దిగింది. దాన్నే కెరీర్‌గా మార్చుకొని, అంచెలంచెలుగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండించింది. ఇక ఒలింపిక్సే తరువాయి అన్న తరుణంలో దురదృష్టవశాత్తూ వరుస గాయాలు, లాక్‌డౌన్‌ అడ్డంకులతో రెండేళ్ల పాటు ఆటకు దూరమైంది. కానీ ఒలింపిక్స్‌ కలను నెరవేర్చుకునేందుకు ఈ ఏడాది మళ్లీ పూల్‌లోకి అడుగుపెట్టింది. విరామం వచ్చినా తనలో వాడి తగ్గలేదని నిరూపించుకుంది. టోక్యో బెర్తును ఖరారు చేసుకుని.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమే అహ్మదాబాద్‌కు చెందిన 21 ఏళ్ల మానా పటేల్.

ఆ కోటాలో టోక్యో బెర్తు!

ఒలింపిక్స్‌.. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొనాలని, కనీసం ఒక్క పతకమైనా సాధించాలని ప్రపంచంలోని క్రీడాకారులందరూ కోరుకుంటారు. అందుకోసం రాత్రింబవళ్లు పట్టు వదలకుండా ప్రయత్నిస్తారు. అలా ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ కావాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకునే ప్రయాణంలో మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేసింది మానా పటేల్‌. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఈ బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మర్.. Universality quota (ఒక దేశం నుంచి ఒక ఆడ, ఒక మగ పోటీదారుల్ని ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమతించడం)లో ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి మహిళా స్విమ్మర్‌గా చరిత్రకెక్కిందీ అహ్మదాబాద్‌ అమ్మాయి.

ఊబకాయాన్ని అధిగమించేందుకు!

తనకున్న ఊబకాయాన్ని అధిగమించేందుకు ఏడేళ్ల వయసులోనే ఈతపై ఆసక్తి పెంచుకుంది మానా పటేల్‌. ఆ తర్వాత ఇదే క్రీడను కెరీర్‌గా ఎంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్ (ఆనర్స్)లో డిగ్రీ పట్టా పొందిన ఆమె ఇంట్లోకి తొంగిచూస్తే.. అంతా పతకాలు, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలతోనే నిండి ఉంటుంది.. చిన్న వయసులోనే జాతీయ క్రీడల్లో భాగంగా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన ఘనత మానా పటేల్‌ సొంతం. ఇక 2015 నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లోనూ పసిడి గెలుచుకొని అప్పటివరకు ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్ట్టింది. 2018లో జరిగిన 72వ సీనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ మూడు బంగారు పతకాలు సాధించింది. అదే ఏడాది తిరువనంతపురంలో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో మూడు బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్లను కైవసం చేసుకుందీ యువ స్విమ్మర్.

వరుస గాయాలు వెక్కిరించినా..!

2017లో జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురైంది మానా పటేల్‌. అప్పటి నుంచే భుజం నొప్పి వేధించడం ప్రారంభించింది. కెరీర్‌ పరంగానూ కొన్ని వైఫల్యాలు ఎదురయ్యాయి. ఇక 2019లో చీలమండ గాయంతో ఆట నుంచి తాత్కాలిక విరామం తీసుకుంది. అయితే ఒలింపిక్స్‌ లక్ష్యంతో మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో ఈత కొలనులోకి దిగింది. యూరోపియన్‌ పోటీల్లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌ వేదికగా జరిగిన ఈత పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. అంతకుముందు బెల్‌గ్రేడ్‌ మీట్‌లోనూ జాతీయ రికార్డు నెలకొల్పింది. సెర్బియా, ఇటలీ మీట్స్‌లోనూ సత్తా చాటి తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. ఈ అద్భుత ప్రదర్శనే ఆమెను టోక్యో ఫ్లైట్‌ ఎక్కేలా చేసింది.

పోటీలు టీవీలో చూసేదాన్ని!

యూరోపియన్‌ పోటీల్లో ఆమె ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్న స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మానా పటేల్‌ను Universality quota లో ఒలింపిక్స్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. ‘టీవీల్లో ఒలింపిక్స్‌ పోటీలు చూస్తూ పెరిగాను. అలాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఇప్పుడు నా దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం నాకు దక్కింది. టోక్యో ఫ్లైట్‌ ఎక్కబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ స్విమ్మర్లతో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఆనందపడిపోతోందీ యంగ్‌ సెన్సేషన్.

ప్రాక్టీస్‌ లేక ఇబ్బంది పడ్డా!

తన ఒలింపిక్స్‌ ప్రయాణంలో గాయాలకు తోడు లాక్‌డౌన్‌ బాగా ఇబ్బంది పెట్టిందంటోంది మానా పటేల్‌. ‘లాక్‌డౌన్‌ కారణంగా నాలాంటి ఎంతోమంది స్విమ్మర్లు నష్టపోయారు. కొన్ని నెలల పాటు శాశ్వతంగా స్విమ్మింగ్‌ పూల్స్ మూసివేయడంతో వాటి నిర్వహణ ప్రశ్నార్థకమైపోయింది. ఇంట్లో సాధన చేసేందుకు ఎలాంటి వసతులు లేవు. దీంతో ఈ ఖాళీ సమయాన్ని శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచుకునేందుకు వినియోగించుకున్నా. లాక్‌డౌన్‌లో సడలింపులు మొదలైన తర్వాత బెంగళూరు నేషనల్‌ క్యాంప్‌కు వెళ్లాను. అక్కడే మళ్లీ స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాను’ అని లాక్‌డౌన్‌ రోజులను గుర్తుకు తెచ్చుకుందీ యంగ్‌ స్విమ్మర్.

నేను పూర్తి శాకాహారిని!

ఇక తన ఒలింపిక్స్‌ సన్నద్ధత గురించి మాట్లాడుతూ.. ‘నేను రోజూ 5 గంటలు స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తాను. ఉదయం రెండు గంటలు, మధ్యాహ్నం గంట, సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తాను. దీంతో పాటు గంట పాటు జిమ్‌లో గడుపుతాను. మానసికంగా దృఢంగా ఉండేందుకు కొన్ని రకాల వ్యాయామాలు చేస్తాను. ఇక నేను పూర్తి శాకాహారిని. ఆహారం విషయంలో కచ్చితత్వం పాటిస్తా..’ అంటోంది మానా.

తాజాగా ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న మానాపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో సహా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఒలింపిక్స్‌ పతకంతో తిరిగి రావాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్