పేదరికాన్ని జయించిందీ పైలట్‌!

మగవారితో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆకాశాన్ని అవలీలగా అందుకునే శక్తి సామర్థ్యాలున్నాయి. అయితే వారికి కావాల్సిందల్లా కాసింత ప్రోత్సాహమే! అది తల్లిదండ్రుల రూపంలో అందితే అమ్మాయిలకు అసాధ్యమంటూ ఏదీ ఉండదు. సూరత్‌కు చెందిన 19 ఏళ్ల మైత్రి పటేల్‌ విషయంలో ఇది మరోసారి రుజువైంది.

Published : 13 Sep 2021 17:21 IST

(Photo: Twitter)

మగవారితో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆకాశాన్ని అవలీలగా అందుకునే శక్తి సామర్థ్యాలున్నాయి. అయితే వారికి కావాల్సిందల్లా కాసింత ప్రోత్సాహమే! అది తల్లిదండ్రుల రూపంలో అందితే అమ్మాయిలకు అసాధ్యమంటూ ఏదీ ఉండదు. సూరత్‌కు చెందిన 19 ఏళ్ల మైత్రి పటేల్‌ విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఆకాశంలోకి ఎగరాలనుకున్న ఆమె ఆశకు తండ్రి అండగా నిలిచాడు. పొలం అమ్మి మరీ తన కూతురి కలల ప్రయాణానికి పూల బాట పరిచాడు.

కమర్షియల్‌ పైలట్‌గా!

చిన్న వయసులో నింగిలో ఎగురుతున్న విమానం చూసి ఎప్పటికైనా తాను కూడా అలా ఆకాశంలోకి ఎగరాలనుకుంది మైత్రి. మధ్యలో పేదరికం అడ్డొచ్చింది. పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితేనేం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకే అడుగేసింది. కుటుంబానికి దూరంగా దేశం కాని దేశంలో శిక్షణ తీసుకుంది. ఆమె శ్రమకు తగ్గ ఫలితం లభించింది. కమర్షియల్‌ పైలట్‌గా మారి తన కలను సాకారం చేసుకుంది. దీంతో పాటు అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన అమ్మాయిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది మైత్రి.

పొలం అమ్మి అమెరికాకు పంపించాడు!

సూరత్‌లోని ఓల్పడ్‌ ప్రాంతానికి చెందిన కాంతిలాల్‌ పటేల్‌- రేఖా పటేల్‌ల ఒక్కగానొక్క ముద్దుల కూతురే మైత్రి పటేల్‌. కాంతిలాల్‌ ఓ సాధారణ రైతు. రేఖ గృహిణి. తన గ్రామంలోనే 12వ తరగతి వరకు చదువుకుంది మైత్రి. ఆ తర్వాత పైలట్‌ శిక్షణ కోసం అమెరికాకు వెళ్లిపోయింది. సాధారణంగా ఈ కోర్సు 18 నెలలు ఉంటుంది. అయితే 12 నెలల కాలంలోనే శిక్షణ పూర్తి చేసుకుని కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ను సాధించిందీ టీనేజర్‌. ‘నాన్న వ్యవసాయంతో పాటు పడవ కూడా నడిపేవారు. అప్పుడప్పుడు సూరత్ నుంచి ముంబయి ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులను అందులో తీసుకెళ్లేవారు. నేను కూడా ఆయనతో వెళ్లేదాన్ని. అప్పుడే విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ను దగ్గర్నుంచి గమనించా. అలా 8 ఏళ్ల వయసులోనే పైలట్‌గా మారాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. 12వ తరగతి తర్వాత అమెరికా వెళ్లి పైలట్‌ ట్రైనింగ్‌ కోర్సు చేద్దామనుకున్నాను. కానీ మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! అప్పు కోసం కాళ్లరిగేలా తిరిగారు నాన్న. అయినా డబ్బు దొరకలేదు. ఇక వేరే దారి లేక పొలం అమ్మి మరీ నన్ను అమెరికాకు పంపించారు. అదృష్టవశాత్తూ 12 నెలల్లోనే నా శిక్షణ పూర్తి చేయగలిగా..’

బోయింగ్‌ నడపాలన్నదే నా లక్ష్యం!

‘కోర్సు ముగిసిన తర్వాత నాన్నను అమెరికా రమ్మన్నాను. ఆయనను విమానంలో కూర్చోబెట్టుకొని 3500 అడుగుల ఎత్తు వరకు వెళ్లాను. ఆ క్షణం నా కల సాకారమైనట్లు అనిపించింది. ఇండియాలో కమర్షియల్‌ ప్లేన్లను నడపాలంటే మరింత శిక్షణ అవసరం. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. బోయింగ్‌ విమానాన్ని నడపాలన్నదే నా లక్ష్యం. అందుకు సంబంధించిన శిక్షణను కూడా త్వరలో ప్రారంభించబోతున్నాను’ అని చెప్పుకొచ్చిందీ టీనేజ్‌ సెన్సేషన్‌.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఇటీవలే మైత్రిని స్వయంగా తన కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్