వాళ్ల కోసమే ఈ 'జీవితం'!

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంది... అదీ సాధ్యపడకపోతే డాక్టరై కనీసం ప్రజలకైనా సాయపడదామనుకుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. బీఎస్సీ నర్సింగ్ చదివి లెక్చరర్‌ అయ్యింది. అయితేనేం... తన కలను పక్కన పెట్టినా సేవా గుణాన్ని మాత్రం వదల్లేదు. తన జీతంలో చాలా భాగాన్ని మానసిక రోగుల బాగుకే వెచ్చిస్తోంది.

Updated : 18 Aug 2021 19:09 IST

(Photo: Instagram)

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంది... అదీ సాధ్యపడకపోతే డాక్టరై కనీసం ప్రజలకైనా సాయపడదామనుకుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. బీఎస్సీ నర్సింగ్ చదివి లెక్చరర్‌ అయ్యింది. అయితేనేం... తన కలను పక్కన పెట్టినా సేవా గుణాన్ని మాత్రం వదల్లేదు. తన జీతంలో చాలా భాగాన్ని మానసిక రోగుల బాగుకే వెచ్చిస్తోంది. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వారి జీవితాలను అందంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలా సేవ చేస్తోన్న తనది మరీ పెద్ద వయసేమీ కాదు. కేవలం 24 ఏళ్లే... పేరు మనీషా కృష్ణస్వామి. తమిళనాడులోని ఈరోడ్‌ ఆమె సొంతూరు.

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మనీషా కళ్లెదుట కష్టం ఉంటే తట్టుకోలేదు. అందుకే చిన్నప్పుడు తండ్రి ఒంటరిగా మటన్‌ కొట్టులో కష్టపడుతుంటే అతనికి చేదోడువాదోడుగా నిలిచింది. ఇంటి పనుల్లో తల్లికీ సహాయమందించింది. ఈ క్రమంలోనే సైనికురాలిగా మారి సరిహద్దుల్లో దేశ సేవ చేయాలనుకుంది...లేకపోతే వైద్యురాలిగా మారి కనీసం పేద ప్రజలకైనా ఉపయోగపడాలనుకుంది. అయితే అంతంతమాత్రంగానే ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలను నెరవేరనీయలేదు. దీంతో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఈరోడ్‌లోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరింది.

జీతం డబ్బులు వెచ్చిస్తూ!

ఉద్యోగంలో చేరిన మొదట్లో తనకొచ్చిన జీతంలో కొంచెం కుటుంబానికి అందిస్తూనే... మిగతా భాగం పేదల అవసరాలకే వెచ్చించింది మనీషా. ఫుట్‌పాత్‌పై ఉన్న అనాథలు, వృద్ధుల ఆకలిని కూడా తీర్చింది. అయితే ఈ సహాయం ఆమెకు సంతృప్తినివ్వలేదు. వారికి ఆవాసంతో పాటు మూడుపూటలా వారి కడుపు నిండేలా ఏదైనా చేయాలనుకుంది. ఇందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపింది. ప్లాంటేషన్‌ డ్రైవ్స్‌, రిహ్యాబిలిటేషన్‌ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించింది. అయితే ఇది క్రమంగా ఆ ఎన్‌జీవోల మధ్య పోటీ తత్వానికి దారి తీసింది. సంస్థల్లోని కొందరు మగవారు ఆమెపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. తన పనులను సక్రమంగా చేయనియ్యలేదు. దీంతో సొంతంగా ఫౌండేషన్‌ను స్థాపించాలనుకుందీ యంగ్‌ గర్ల్.

అదే నా ఫౌండేషన్‌కు పునాది!

‘ఈ ప్రయత్నాల్లో ఉండగానే నాకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు కనిపించింది. ఓ 80 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధుడు బాగా చిక్కిపోయి రోడ్డు పక్కన పడి ఉన్నాడని ఆ పోస్టు సారాంశం. ఆ పోస్టు పెట్టిన యూజర్లను అడిగి వెంటనే తిరుచ్చి నుంచి తంజావూరుకు బయలుదేరాను. సంఘటనా స్థలానికి వెళ్లి చూడగానే నా మనసు తరుక్కుపోయింది. అతను పోషకాహార లోపంతో బాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. తిండి తిని చాలా రోజులైంది. వెంటనే తంజావూరులోని వృద్ధుల ఆశ్రమంలో అతడిని చేర్పించాను. అతనొక్కడే కాదు... రోడ్డుపై వెళుతుంటే చాలామంది వృద్ధులు ఇలాగే కనిపించారు. అందులో కొందరు మానసిక రోగులు కాగా... మరికొందరు మాదక ద్రవ్యాలకు బానిసైన వారు. వీరికి ఏదైనా మంచి చేయాలన్న ఆకాంక్షే నా ‘జీవితం ఫౌండేషన్‌’ కు పునాది వేసింది. 

అదే మా ప్రధాన లక్ష్యం!

‘ఈ ఫౌండేషన్‌ ప్రధాన లక్ష్యం... అనాథలైన వృద్ధులు, మానసిక రోగులకు పునరావాసం కల్పించడం... మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని మామూలు మనుషులుగా మార్చడం. ఇందులో భాగంగా మొదట ఆహారం, దుస్తులతో పాటు ఇతర ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తాం. వారితో మమేకమై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. కుటుంబ సభ్యులెవరైనా ఉంటే వారికి సమాచారమందిస్తాం. లేకపోతే ఈరోడ్‌లోని మా కేర్‌ ఫెసిలిటీ సెంటర్‌లోనే వారికి అన్ని సదుపాయాలు అందజేస్తాం. ఏదైనా పనిచేసే సామర్థ్యముంటే వారి కాళ్లపై వారు నిలబడేలా ఉపాధి కూడా కల్పిస్తున్నాం’..

అదొక్కటే నాకు బాధ కలిగిస్తోంది!

2018లో ప్రారంభమైన ‘జీవితం ఫౌండేషన్’ ద్వారా ఇప్పటివరకు సుమారు 340 మందికి పైగా వృద్ధులు, మానసిక రోగులను అక్కున చేర్చుకుంది మనీషా. కొవిడ్‌ సమయంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మన్ననలు అందుకుంది.
‘నా స్నేహితులతో పాటు క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విరాళాలు సేకరిస్తూ ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ నాకు సొంతిల్లు లేదు. పెద్దగా డబ్బులు కూడా లేవు. అయితేనేం... ఎంతో సంతృప్తిగా ఉంటోంది. అయితే ఈ పని చేయడం నా తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదు. మూడేళ్లుగా వారు నాకు దూరంగా ఉంటున్నారు. ఇదొక్కటే నాకు చాలా బాధ కలిగిస్తోంది’ అని అంటోంది మనీషా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్