World Cup: మన అమ్మాయిల ఒత్తిడిని చిత్తు చేస్తోందిలా!

అసలే క్రికెట్‌.. అందులోనూ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌.. ప్రతి మ్యాచ్‌ కీలకమే.. ఇలాంటి తరుణంలో ఎంతటి సీనియర్‌ ఆటగాళ్లైనా మైదానంలోకి దిగాక ఎంతో కొంత ఒత్తిడికి లోనవడం సహజమే! దీనికి తోడు ‘నేను రాణించగలనా?’ అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే మానసిక దృఢత్వం ప్రదర్శించాలంటున్నారు స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ ముగ్ధా ధమన్‌కార్‌ బావరే. క్రీడాకారుల్లో ఈ ఉత్సాహం నూరిపోయడానికే ప్రస్తుతం జరుగుతోన్న......

Updated : 22 Mar 2022 16:18 IST

అసలే క్రికెట్‌.. అందులోనూ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌.. ప్రతి మ్యాచ్‌ కీలకమే.. ఇలాంటి తరుణంలో ఎంతటి సీనియర్‌ ఆటగాళ్లైనా మైదానంలోకి దిగాక ఎంతో కొంత ఒత్తిడికి లోనవడం సహజమే! దీనికి తోడు ‘నేను రాణించగలనా?’ అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే మానసిక దృఢత్వం ప్రదర్శించాలంటున్నారు స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ ముగ్ధా ధమన్‌కార్‌ బావరే. క్రీడాకారుల్లో ఈ ఉత్సాహం నూరిపోయడానికే ప్రస్తుతం జరుగుతోన్న మహిళల ప్రపంచకప్లో భాగమయ్యారామె. ఇందులో భాగంగా భారత మహిళల జట్టుకు స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌గా వ్యవహరిస్తూ విశ్వ వేదికపై మన అమ్మాయిలు చక్కటి ప్రదర్శన చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. డ్రస్సింగ్‌ రూమ్‌లో తన స్ఫూర్తిదాయక మాటలతో, సరదా సంగతులతో టీమ్‌ను ఉత్సాహపరుస్తూ.. తద్వారా వారు మైదానంలో చురుగ్గా రాణించేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అందుకే బీసీసీఐ కూడా ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా ముగ్ధను మనందరికీ ప్రత్యేకంగా పరిచయం చేసి ఆమె సేవల్ని కొనియాడింది. ఈ నేపథ్యంలో ఈ మాటల మాంత్రికురాలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

క్రీడాకారులకు శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో.. మానసికంగా ప్రశాంతంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒత్తిడికి తలొగ్గక.. పాజిటివ్‌గా ఆలోచించినప్పుడే ఇది సాధ్యమవుతుందంటున్నారు ముగ్ధ. ముంబయికి చెందిన ఆమె.. కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌గా, స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న మహిళల ప్రపంచకప్‌లో భాగంగా మన మహిళా జట్టుకు స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారామె.

వెయ్యి పతకాలతో పట్టాభిషేకం!

ముంబయి యూనివర్సిటీ నుంచి కౌన్సెలింగ్‌ సైకాలజీలో ఉన్నత విద్యనభ్యసించిన ముగ్ధ.. కౌన్సెలర్‌గా మారక ముందు ఈతలో రాణించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా విభిన్న పోటీల్లో, వేర్వేరు వయసుల వారితో పోటీ పడ్డ ఆమె.. సుమారు వెయ్యి పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో 500 పసిడి, 300 రజత, 200 కాంస్య పతకాలున్నాయి. ఇలా క్రీడారంగంలో ఆమె సేవల్ని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం 1994-95 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి అత్యున్నత పురస్కారం ‘ఛత్రపతి అవార్డు’తో సత్కరించింది.

మనసును చదివి పరిష్కారం చెబుతోంది!

ఓవైపు స్విమ్మర్‌గా కెరీర్‌లో రాణిస్తూనే.. మరోవైపు స్పోర్ట్స్‌ సైకాలజీపై ఆసక్తి పెంచుకుంది ముగ్ధ. తోటి క్రీడాకారుల ఆకాంక్షలు, ఆశయాలు, లక్ష్యాలు, కోరికల్ని అర్థం చేసుకుంది.. ఓ క్రీడాకారిణిగా తమలో ఉండే భయాలు, ఆందోళనలు, అభద్రతా భావాల గురించి లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టింది. వీటిని జయించినప్పుడే మనసును ఆటపై పూర్తిగా కేంద్రీకరించచ్చన్న విషయం అర్థం చేసుకుంది. ఈ దిశగానే తన చదువును/సాధనను కొనసాగించింది. తన 19 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఆమెకు ఎదుటివారి మనసును చదివి, అర్థం చేసుకునే ఓర్పును, నేర్పును అందించిందంటోందామె. ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌గా కొనసాగుతోంది ముగ్ధ. అందుకే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలు జరిగినప్పుడల్లా స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌గా ఆమె పేరే వినిపిస్తుంది.. తెర వెనుక ఆమె కృషే కనిపిస్తుంది.

 

‘మైండ్‌ స్పోర్ట్స్‌’తో ఎంతోమందికి చేరువై..!

ముంబయిలోని మానసిక ఆరోగ్య కేంద్రం ‘దిశా కౌన్సెలింగ్‌ సెంటర్‌’కు వ్యవస్థాపక సభ్యురాలిగా కొనసాగుతోన్న ముగ్ధ.. ‘మైండ్‌ స్పోర్ట్స్‌’ అనే సంస్థను నెలకొల్పింది. క్రీడాకారుల్లో ఉన్న మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని దూరం చేసి.. వారిని పూర్తి స్థాయి మానసిక దృఢత్వంతో ఆయా క్రీడలకు సిద్ధం చేయడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగానే క్రికెట్‌, ఆర్చరీ, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, స్మిమ్మింగ్‌, చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌.. వంటి విభిన్న క్రీడాంశాలకు చెందిన క్రీడాకారులకు శిక్షణ ఇస్తోంది. అంతేకాదు.. ఒలింపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌, ప్రిమియర్‌ లీగ్స్‌.. వంటి దేశీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్లకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌గానూ పనిచేసిన అనుభవం ముగ్ధ సొంతం. అంతేకాదు.. గతంలో ఆటలకు సంబంధించిన పలు కాన్ఫరెన్సులు, సమావేశాల్లో పాల్గొని ఉపన్యాసాలు కూడా ఇచ్చిందీ స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్.

తెరపై వారు.. తెర వెనుక ఆమె..!

ప్రస్తుతం ‘ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌’, ‘ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌’, ‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌’.. వంటి పలు క్రీడా కంపెనీలతో కలిసి పనిచేస్తోన్న ముగ్ధకు.. ఇప్పుడు జరుగుతోన్న మహిళా ప్రపంచకప్‌లోనూ అవకాశం వచ్చింది. ఇందులో భాగంగానే మన మహిళా క్రికెటర్లలో ఉన్న ఒత్తిడిని చిత్తు చేస్తూ డ్రస్సింగ్‌ రూమ్‌లో ధైర్యాన్ని, ఉత్సాహాన్నీ నూరిపోస్తోంది. తద్వారా మైదానంలో వారు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు పరోక్షంగా సహకరిస్తోంది ముగ్ధ. అందుకే ఆమె సేవల్ని కొనియాడుతూ.. ఇటీవలే బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా ఆమె వీడియోను పోస్ట్‌ చేసింది. మరోవైపు మిథాలీ రాజ్‌, హర్మన్ ప్రీత్‌ కౌర్‌తో పాటు కోచ్‌ రమేశ్‌ పొవార్‌ కూడా.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ముగ్ధ లాంటి మెంటార్‌ తోడు అత్యవసరం అంటున్నారు.

 

ఆ భయాన్ని జయించాలంటే..!

ఓడిపోతామేమోనన్న భయమే మనల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుందని, దాన్ని జయిస్తే ఆటను ఆస్వాదించచ్చని చెబుతోంది ముగ్ధ. ‘మన మహిళా జట్టులో నాకు కనిపించిన సాధారణ విషయమేంటంటే.. ఓడిపోతామేమోనన్న భయం! ఇది దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నిజానికి ఇదే మనల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. గెలుపును మనకు దూరం చేస్తుంది. వాళ్ల బాడీ లాంగ్వేజ్‌, ప్రవర్తన, కొన్నిసార్లు వాళ్లు ప్రతిస్పందించే విధానంలోనూ నేను దీన్ని పసిగడతా! దీన్ని బట్టే వారికి నేను బృందంగా, లేదంటే వ్యక్తిగతంగా కౌన్సెలింగ్‌ సెషన్స్‌ నిర్వహిస్తుంటా.. ఈ క్రమంలో కొన్ని టెక్నిక్స్‌నీ వాళ్లకు నేర్పిస్తుంటా..’ అని చెబుతున్నారు ముగ్ధ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్