Rohit Sharma: నా భార్యే నా అదృష్ట దేవత!

క్రికెట్‌ చూసేటప్పుడు కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.. ఈ కుర్చీలో కూర్చొని చూస్తే ఇండియా గెలుస్తుందని.. నడిస్తే ప్రత్యర్థి జట్టు వికెట్‌ పడుతుందని.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో నమ్మకం ఉంటుంది. అలాగే తానూ ఓ సెంటిమెంట్‌ను నమ్ముతానంటోంది హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే.

Published : 05 Jul 2024 18:33 IST

(Photos: Instagram)

క్రికెట్‌ చూసేటప్పుడు కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.. ఈ కుర్చీలో కూర్చొని చూస్తే ఇండియా గెలుస్తుందని.. నడిస్తే ప్రత్యర్థి జట్టు వికెట్‌ పడుతుందని.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో నమ్మకం ఉంటుంది. అలాగే తానూ ఓ సెంటిమెంట్‌ను నమ్ముతానంటోంది హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే. గ్యాలరీలో కూర్చొని తన భర్తను అనుక్షణం ఛీర్‌ చేసే ఆమె.. ప్రతి మ్యాచ్‌లోనూ ‘ఫింగర్స్‌ క్రాస్‌డ్‌ (చూపుడు వేలు, మధ్య వేలిని క్రిస్క్రాస్‌గా పెట్టడం)’ పొజిషన్‌ పెడతానంటూ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘మ్యాచ్‌ ఆద్యంతం క్రాస్‌డ్‌ ఫింగర్స్‌తోనే కూర్చుంటుందని, ఇదే తనకు కలిసొస్తుంద’ని రోహిత్‌ కూడా తన భార్యను ఆకాశానికెత్తేశాడు. ఇలా ఈ ఒక్క విషయంలోనే కాదు.. అర్ధాంగిగా రోహిత్‌ జీవితంలో సగ భాగమైన రితిక.. తన పర్సనల్‌ మేనేజర్‌గా కెరీర్‌లోనూ సగ భాగమైంది.

యువీ కలిపాడు!

రోహిత్‌ శర్మ.. మైదానంలో హిట్‌మ్యాన్‌గానే మనకు తెలుసు! సైలెంట్‌గా సిక్సులు, ఫోర్లు బాదే కూల్‌ కెప్టెన్‌గానే మనం ఇతడిని చూశాం. కానీ తెర వెనుక తన భర్త ఓ రొమాంటిక్‌ ప్రేమికుడు అంటోంది రితిక. పెళ్లికి ముందు నుంచే ఓ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నడుపుతోన్న ఆమె.. యువరాజ్‌ సింగ్, విరాట్‌ కోహ్లీ.. వంటి క్రికెటర్లకు మేనేజర్‌గానూ వ్యవహరించింది. ఇలా యువీకి మేనేజర్‌గా వ్యవహరిస్తోన్న సమయంలోనే రోహిత్‌ను కలుసుకున్నట్లు ఓ సందర్భంలో పంచుకుందీ మిసెస్‌ రోహిత్.

‘యువీకి మేనేజర్‌గా వ్యవహరించే సమయంలో ఇద్దరం కలిసి పలు మీటింగ్‌లకు హాజరయ్యే వాళ్లం. తను నన్ను ఓ సోదరిలా భావించేవాడు. అలా ఓ ఈవెంట్లో పాల్గొన్న మాకు రోహిత్‌ కలిశాడు. అప్పుడు యువీ.. ‘తను రితిక.. నా సోదరి.. దూరంగా ఉండు..!’ అంటూ సరదాగా అన్నాడు. అప్పుడే నేను, రోహిత్‌ ఒకరినొకరం చూసుకున్నాం.. ఆపై తనకు మేనేజర్‌గా మారాను.. క్రమంగా మా మధ్య అనుబంధం బలపడింది. ఒకరి మనసులో ఒకరం ఉన్నామని తెలుసుకున్నాక.. ఒకరినొకరం విడిచి ఉండలేకపోయాం. ముంబయిలోని ఓ స్పోర్ట్స్‌ క్లబ్‌లో రోహిత్‌ నాకు రొమాంటిక్‌గా ప్రపోజ్‌ చేసిన ఆ క్షణం నేను మర్చిపోలేను.. ఇక మా ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడవడంతో 2015లో మా పెళ్లి జరిగింది..’ అంటూ తన క్యూట్‌ ప్రేమకథను పంచుకుంది రితిక. ఈ అందాల జంటకు ప్రస్తుతం సమైరా అనే ఐదేళ్ల పాప ఉంది.

భార్యగా.. మేనేజర్‌గా..!

క్రికెట్‌ అంటే ఎప్పుడూ ఏదో ఒక మ్యాచ్‌ ఉండనే ఉంటుంది.. మ్యాచ్‌ల కోసం దేశవిదేశాలకూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఇంటిని మిస్సవుతుంటారు చాలామంది క్రికెటర్లు. కానీ తాము ఇందుకు మినహాయింపు అంటున్నారు రోహిత్‌-రితిక. ఎందుకంటే భార్యగా రోహిత్‌ జీవితంలో సగ భాగమైన ఆమె.. అతడికి పర్సనల్‌ స్పోర్ట్స్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తూ కెరీర్‌లోనూ అర్ధాంగిగా మారింది. ఈ క్రమంలోనే రోహిత్‌కు సంబంధించిన క్రికెట్‌ వ్యవహారాలు, ప్రకటనలు, ఇతర విషయాలన్నీ రితికే దగ్గరుండి చూసుకుంటోంది. అందుకే తమ మధ్య ఉండే ప్రేమే కాదు.. కెరీర్‌ కూడా తమ అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుందంటున్నారీ లవ్లీ కపుల్.

తనే నా లక్కీ ఛార్మ్!

ఇక ఎక్కడ మ్యాచ్‌ జరిగినా తన భర్తతో కలిసి అక్కడ వాలిపోతూ.. గ్యాలరీలో కూర్చొని తన భర్తను ఛీర్‌ చేస్తుంటుందీ మిసెస్‌ రోహిత్‌. అంతేకాదు.. తన భర్త ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాలని, జట్టు గెలవాలని కోరుకుంటూ.. ఓ సెంటిమెంట్‌ను కూడా ఫాలో అయిపోతుందట రితిక. ఇటీవలే ‘కపిల్‌ శర్మ షో’లో పాల్గొన్న రోహిత్‌ తన భార్య సెంటిమెంట్ గురించి మరోసారి చెప్పుకొచ్చాడు.

‘సిక్సులు కొడుతూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్‌ చేయొద్దని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పుడప్పుడూ అడుగుతుంటారు.. అవును.. ఇలాంటి సరదా విషయాలు కూడా అప్పుడప్పుడూ మా డ్రస్సింగ్‌ రూమ్‌లో చర్చకొస్తాయి.. ఆ సమయంలో వాళ్లతో నేను ఒక్కటే చెప్తా.. నేను కొట్టే ప్రతి షాట్‌ వెనుక నా భార్య రితిక ప్రోత్సాహం, స్ఫూర్తి ఉన్నాయి. నేను రాణించాలని, భారత్‌ గెలవాలనే తాను ఎప్పుడూ కోరుకుంటుంది. అందుకే మ్యాచ్‌ ఆద్యంతం ఫింగర్స్‌ క్రాస్‌ పెట్టి కూర్చుంటుంది.. తనే నా అదృష్ట దేవత..’ అంటూ తన భార్యను ఆకాశానికెత్తేశాడీ హిట్‌మ్యాన్‌. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సమయంలోనూ.. తన భర్తను ఛీర్‌ చేసిన ఈ క్రికెట్‌ లవర్‌.. ఆ మ్యాచ్‌లోనూ రితిక చేతివేళ్లు క్రిస్‌ క్రాస్‌గా పెట్టి కూర్చుందని, అందువల్లే టీమిండియా విజయం సాధించిందంటూ ఫ్యాన్స్‌ అంతా ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నారు.

రో.. నిన్ను చూసి గర్వపడుతున్నా!

ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉన్నట్లే.. మన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఆయన ఇష్టసఖి రితిక.. తన భర్త కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ రావడంతో ఉప్పొంగిపోతోంది. ఆ క్షణం భావోద్వేగంతో నిండిపోయిన రోహిత్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమె.. గర్వంగా ఉందంటూ మురిసిపోయింది.
‘రో.. ఈ కప్‌ నీకు ఎంత విలువైందో నాకు తెలుసు! ఈ ఫార్మాట్‌, కప్‌, జట్టు.. వీటన్నింటి కోసం నువ్వెంత పరితపించావో నేను చూశాను. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా నువ్వు పడ్డ శ్రమకు ప్రతిఫలమిది! ఆఖరికి నువ్వు కన్న కల ఇలా సాక్షాత్కారమవుతుంటే అది చూసి నా మనసు ఉప్పొంగింది.. నీ జర్నీ స్ఫూర్తిదాయకం! నువ్వు సాధించిన విజయాలు చూసి ఓ భార్యగా గర్వపడుతున్నా. అదే సమయంలో టీ20 ఫార్మాట్ నుంచి రిటైరవడం అంతే బాధగా ఉంది.. లవ్యూ సో మచ్‌ డియర్‌!’ అంటూ ఎమోషనల్‌ అయింది రితిక. ప్రపంచకప్‌ మ్యాచ్‌ ముగిశాక స్టేడియంలో తన భార్య రితిక, కూతురు సమైరాతో కలిసి సరదాగా గడిపాడు రోహిత్‌. ఆ ఫొటోలు, వీడియోలు కూడా ఈ జంట అన్యోన్య దాంపత్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయని చెప్పచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్