Published : 06/09/2021 19:09 IST

చిన్నప్పటి కల.. అలా సాధించేసింది!

(Image for Representation)

చిన్నప్పుడు డ్రైవింగ్‌ నేర్చుకుంటానంటే  ‘ఇది ఆడవాళ్లు చేయాల్సిన పని కాదమ్మా’ అని తండ్రి వెనక్కు లాగడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ముందుకే అడుగేసింది. తండ్రిని ఒప్పించి తన కలల ప్రయాణం కొనసాగించింది. ఇప్పుడు ఏకంగా బస్సు స్టీరింగ్‌ పట్టుకునే స్థాయికి చేరుకుంది. ఆమే మధ్యప్రదేశ్‌ మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌గా పలువురి మన్ననలు అందుకుంటున్న 35 ఏళ్ల రితూ నర్వాల్.

మొదటి మహిళా బస్ డ్రైవర్!

దేశంలో కోటి జనాభా దాటిన నగరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పింక్‌ సిటీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగానే మధ్యప్రదేశ్‌ వాణిజ్య రాజధానిగా పేరు పొందిన ఇండోర్‌లో గతేడాది ఫిబ్రవరి 4 నుంచి రెండు పింక్‌ బస్సులు తిరుగుతున్నాయి. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లో మొన్నటి వరకు ప్రయాణికులు, కండక్టర్ అందరూ మహిళలే ఉన్నా....డ్రైవర్‌ సీట్లో మాత్రం మగవారే కనిపించేవారు. డ్రైవింగ్ లో అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన మహిళలు లేకపోవడమే దీనికి కారణం. అయితే ఇప్పుడు ఆ బస్సుల స్టీరింగ్‌ కూడా మహిళలే పట్టుకోనున్నారు.

ఇప్పుడు డ్రైవర్‌ సీట్లో కూడా తనే!

పింక్‌ బస్సులను నడిపేందుకు కొద్ది రోజుల క్రితం ప్రత్యేకంగా ఇద్దరు మహిళా డ్రైవర్లను ఎంపిక చేసింది అటల్‌ ఇండోర్‌ సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌ లిమిటెడ్ (ఏఐసీటీసీఎల్‌). వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. ఇటీవల ఆ మహిళా డ్రైవర్లతోనే ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. వారి డ్రైవింగ్‌ స్కిల్స్‌ బాగుండడంతో బస్సు డ్రైవర్లుగా ఖరారు చేసింది. అందులో ఒకరే 35 ఏళ్ల రితూ నర్వాల్‌. ఇండోర్‌లోని పత్నిపురాలో నివాసముంటోన్న ఆమె 2015 నుంచి డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. మొదట స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేసింది. ఆ తర్వాత హెవీ వెహికల్ డ్రైవింగ్‌ లైసెన్స్ సంపాదించి కొన్ని స్టార్‌ హోటళ్లలో క్యాబ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తించింది. అయితే బస్సుల్లాంటి భారీ వాహనాలను నడపాలన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది.

భయపడ్డాను... నాన్న ధైర్యం చెప్పాడు!

‘పింక్‌ సిటీ బస్సులు నడపడానికి మహిళా డ్రైవర్లు కావాలని కొద్ది రోజుల క్రితం పేపర్లో ప్రకటన చూశాను. వెంటనే దరఖాస్తు చేశాను. తగిన అర్హతలు ఉండడంతో 15 రోజుల ట్రైనింగ్‌ కోసం పిలిచారు. శిక్షణలో భాగంగా రోజూ రెండుగంటల పాటు అది కూడా తెల్లవారుజామున 3-5 గంటల మధ్య ఖాళీ రోడ్లపై బస్సు నడపాలి. మొదట బస్సు స్టీరింగ్‌ పట్టుకోవడానికి భయపడ్డాను. కానీ నాన్న తోడుగా వచ్చి ‘నీకేం కాదు.. నువ్వు నడపగలవు’ అంటూ నాలో ధైర్యం నింపాడు.

నగరంలో అత్యంత రద్దీగా ఉండే బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ కారిడార్‌(బీఆర్‌టీస్) మార్గాన్ని నాకు కేటాయించారు. సిటీలోని మిగతా రూట్లతో పోల్చుకుంటే ఈ మార్గంలో స్పీడ్‌ బ్రేకర్లు ఎక్కువగా ఉంటాయి. ఇక బస్‌ స్టాపులు వచ్చినప్పుడు రైలింగ్ లోపలే బస్సు ఆపాలి. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. అందుకే వీటితో పాటు బస్సులో యంత్రాల నిర్వహణకు సంబంధించి మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బస్సులు, లారీలు, ట్రక్కుల్లాంటి భారీ వాహనాలను నడపాలన్న కల నాకు చిన్నప్పటి నుంచీ ఉండేది. ఇప్పుడది నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని అంటోందీ మహిళా డ్రైవర్.

మరికొందరు ముందుకు వస్తారు!

‘రితూకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. సవాళ్లను స్వీకరిస్తుంది. ఈ లక్షణాలే ఆమెకు మధ్యప్రదేశ్‌ మొదటి మహిళా బస్సు డ్రైవర్‌గా గుర్తింపును తెచ్చాయి. ఆమెను చూసి మరికొంతమంది ఆడవారు ముందుకు వస్తారు’ అని ఏఐసీటీసీఎల్‌ సీఈవో అంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని