‘ఆడపిల్లవి.. నీకెందుకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌?’ అన్నారు!

ఇటీవల ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ రూపొందించిన ‘వీఎస్‌ఎస్ యూనిటీ-22’ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది తెలుగమ్మాయి బండ్ల శిరీష. ఇప్పుడు దీనికి పోటీగా అపర కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ ఈనెల 20న అంతరిక్షయానం చేయనున్నారు. తన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన ఓ రాకెట్‌ ద్వారా అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. అయితే ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’లో శిరీష కీలక పాత్ర పోషించినట్లే.. బ్లూ ఆరిజిన్‌ స్పేస్‌ రాకెట్‌ వెనుక ఓ భారతీయ సంతతి మహిళ కృషి దాగుంది. ఆమే.. 30 ఏళ్ల సంజల్‌ గవాండే.

Updated : 20 Jul 2021 18:21 IST

Photo: Facebook

ఇటీవల ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ రూపొందించిన ‘వీఎస్‌ఎస్ యూనిటీ-22’ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది తెలుగమ్మాయి బండ్ల శిరీష. ఇప్పుడు దీనికి పోటీగా అపర కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ ఈనెల 20న అంతరిక్షయానం చేయనున్నారు. తన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన ఓ రాకెట్‌ ద్వారా అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. అయితే ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’లో శిరీష కీలక పాత్ర పోషించినట్లే.. బ్లూ ఆరిజిన్‌ స్పేస్‌ రాకెట్‌ వెనుక ఓ భారతీయ సంతతి మహిళ కృషి దాగుంది. ఆమే.. 30 ఏళ్ల సంజల్‌ గవాండే.

‘ఆడపిల్లవి’ అంటూ చిన్న చూపు చూశారు!

ముంబయికి చెందిన సంజల్‌ ఇంజినీరింగ్‌లో ‘మెకానికల్‌’ సబ్జెక్టును ఎంచుకున్నప్పుడు ‘ఆడపిల్లవి.. నీకెందుకు ఈ సబ్జెక్ట్‌?!’ అని చాలామంది వెనక్కి లాగేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు కూడా ‘నీకెందుకే తల్లీ’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ సంజల్‌ మాత్రం తన మనసు చెప్పిన మాటే విన్నది. ఆ ఆసక్తితోనే అంతరిక్ష రంగంలో కూడా అద్భుతాలు సృష్టించాలనుకుంది. ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థలో సిస్టమ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు ఆ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష యాత్రలోనూ ప్రముఖ పాత్ర పోషించిందీ సూపర్‌ వుమన్‌. ఇందులో భాగంగా ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌ నిర్మాణంలో ఇంజినీర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించింది సంజల్‌.

అంతరిక్షంపై ఆసక్తితో!

ముంబయిలోని కల్యాణ్‌ ప్రాంతంలో పుట్టి పెరిగింది సంజల్‌. తల్లి సురేఖ MTNL లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తండ్రి అశోక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. కల్యాణ్‌లోనే పన్నెండో తరగతి వరకు చదివిన సంజల్‌ ముంబయి యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. 2011 తర్వాత అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడి మిచిగాన్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌లో పట్టా అందుకుంది. చదువు పూర్తైన వెంటనే విస్కాన్సిన్‌లోని మెర్క్యురీ మెరైన్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించింది. అక్కడ మూడేళ్ల పాటు పనిచేసిన తర్వాత క్యాలిఫోర్నియాలో టొయోటా రేసింగ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలో చేరింది. అక్కడ పనిచేస్తుండగానే అంతరిక్షయానంపై ఆసక్తి పెంచుకుంది సంజల్‌. ఈ క్రమంలో పైలట్‌గా శిక్షణ తీసుకోవడమే కాకుండా లైసెన్స్‌ కూడా సంపాదించింది.

‘నాసా’లో నిరాశే ఎదురైనా!

అంతరిక్ష రంగంలో పనిచేయాలనే సంకల్పంతో ప్రతిష్ఠాత్మక ‘నాసా’లో ఇంజినీర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది సంజల్‌. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆ ఉద్యోగానికి అర్హత సాధించలేకపోయింది. అయితే నిరాశ పడకుండా జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థలో సిస్టమ్స్‌ ఇంజినీర్‌గా అవకాశం దక్కించుకుంది. తాజాగా ఆ సంస్థ చేపట్టిన రోదసీ యాత్రలోనూ భాగస్వామురాలైందామె. బెజోస్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణించనున్న ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌ నిర్మాణంలో ఇంజినీర్‌గా కీలక పాత్ర పోషించిందీ ముంబయి లేడీ. ‘అంతరిక్ష రంగంలో పనిచేయాలన్నది నా చిన్ననాటి కల. అది సాకారమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బ్లూ ఆరిజిన్‌ సంస్థ చేపట్టిన ప్రయోగంలో భాగమైనందుకు గర్వపడుతున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ యువ ఇంజినీర్‌.

మమ్మల్ని గర్వపడేలా చేసింది!

ఈ సందర్భంగా సంజల్‌ తల్లి సురేఖ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి నా కూతురు నెమ్మదస్తురాలు.. కానీ చదువులో మాత్రం చాలా చురుగ్గా ఉండేది. తనకు డ్రాయింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకుంది. ఈ నైపుణ్యాలే తను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టు ఎంచుకున్నప్పుడు కూడా ఉపయోగపడ్డాయి. అయితే ఆ సమయంలో ‘అమ్మాయిలకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఎందుక’ని చాలామంది తనను నిరుత్సాహ పరిచారు. ‘ఈ రంగంలో ఉండే శ్రమను భరించగలిగే శక్తి నా కూతురుకు ఉందా?’ అని నేను కూడా చాలాసార్లు ఆలోచించాను. అయినా మా అమ్మాయి ధైర్యంగా ముందుకు అడుగేసింది. ఏరోస్పేస్‌ రాకెట్లు డిజైన్‌ చేయాలన్నది తన చిరకాల కోరిక. ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌తో ఆ కలను సాకారం చేసుకుంది. మా కుటుంబ సభ్యులందరినీ గర్వపడేలా చేసింది’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్