ఆక్సిజన్‌ లేకుండా ఆ ‘కిల్లర్‌ మౌంటెయిన్‌’ను అధిరోహించింది!

అరబ్‌ దేశాల్లో ఆడవాళ్లపై ఎలాంటి ఆంక్షలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి మూస ధోరణులను అధిగమించి క్రీడలు, పర్వతారోహణపై ఆసక్తి పెంచుకుంది షేఖా ఆస్మా అల్ థాని. ఖతార్‌కు చెందిన ఈ మహిళ ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది.

Published : 30 Sep 2021 16:26 IST

(Photo: Instagram)

అరబ్‌ దేశాల్లో ఆడవాళ్లపై ఎలాంటి ఆంక్షలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి మూస ధోరణులను అధిగమించి క్రీడలు, పర్వతారోహణపై ఆసక్తి పెంచుకుంది షేఖా ఆస్మా అల్ థాని. ఖతార్‌కు చెందిన ఈ మహిళ ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా నేపాల్‌ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ‘మనస్లూ’ శిఖరంపై కూడా ఖతార్‌ జాతీయ జెండాను రెపరెపలాడించింది. ఈ క్రమంలో అతి ప్రమాదకరమైన ఈ ‘కిల్లర్‌ మౌంటెయిన్’ను అధిరోహించిన మొదటి అరబ్‌ మహిళగా చరిత్ర సృష్టించింది.

అడ్వెంచర్లంటే ఆమెకు చాలా ఆసక్తి!

31 ఏళ్ల ఆస్మాకు క్రీడలన్నా, అడ్వెంచర్లన్నా ఎంతో ఇష్టం. ఖతార్‌ ఒలింపిక్‌ కమిటీ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్ విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె పర్వతారోహణలో ఖతార్‌ దేశం తరఫున ఎన్నో రికార్డులు సృష్టించింది. 2014లో ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం ‘కిలిమంజారో’ను అధిరోహించిన ఆమె 2018లో ఉత్తర ధ్రువానికి చేరుకుని ఈ ఘనత సాధించిన మొదటి ఖతార్‌ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2019లో అమెరికాలో అత్యంత ఎత్తైన ‘అకాన్‌గువా’ శిఖరాన్ని అధిరోహించింది. అదే ఏడాది ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపును చేరుకున్న మొదటి అరబ్‌ మహిళగా రికార్డు సృష్టించింది. ఇక ఈ ఏడాది ఆగస్టులో యూరప్‌లో అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ శిఖరంపై కూడా తన జాతీయ జెండాను రెపరెపలాడించింది.

ఆక్సిజన్‌ అవసరం లేకుండా!

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో మౌంట్‌ మనస్లూది ఎనిమిదో స్థానం. నేపాల్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ శిఖరం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 8,163 అడుగుల ఎత్తులో ఉండే ఈ శిఖరాన్ని అక్కడి స్థానికులు ‘కిల్లర్‌ మౌంటెయిన్‌’ అని పిలుస్తుంటారు. ఈ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో చాలామంది పర్వతారోహకులు మధ్యలోనే ప్రాణాలొదిలేయడమే దీనికి కారణం. అలాంటి ప్రమాదకరమైన శిఖరాన్ని ఆక్సిజన్‌ అవసరం లేకుండానే అధిరోహించింది ఆస్మా.

ఇప్పుడు నా కలలు మరింత విస్తృతమయ్యాయి!

మౌంట్‌ మనస్లూపై మొదటిసారిగా తన దేశ జాతీయ జెండాను ప్రతిష్టించిన ఆస్మా తన సంతోషాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ‘ఈ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నదని తెలుసు. అయితే ప్రతి దశలోనూ నేను నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి ముందుకు అడుగేశాను. మనస్లూను అధిరోహించేందుకు ముందే మానసికంగా సిద్ధమయ్యాను. నాకు ప్రత్యేక శిక్షణ అందించి నా ప్రయాణంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నా కలలు మరింత పెద్దవిగా మారిపోయాయి. అడ్డంకులు, అసమానతలను దాటి వాటిని అందుకోవడానికి నా శక్తిమేర ప్రయత్నిస్తాను. ‘లక్ష్య సాధనలో మీరు బాగా అలసిపోయినా ... ప్రయాణంలో తోడెవరూ లేకపోయినా...మనం ముందుకే అడుగేయాలి. అడ్డంకులున్నాయని మన కలలను పక్కకు నెట్టేయద్దు’ అని స్ఫూర్తిని పంచిందీ డేరింగ్‌ వుమన్.

అదే నా లక్ష్యం!

టెన్నిస్‌ క్రీడలో ‘గ్రాండ్‌ స్లామ్‌’ ఉన్నట్లే పర్వతారోహణలో కూడా ‘గ్రాండ్ స్లామ్‌’ అని ఒక టార్గెట్‌ ఉంది. ప్రపంచంలోని పర్వతారోహకులందరూ ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకుంటారు. అదేంటంటే.. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాల (సెవెన్‌ సమ్మిట్స్‌)తో పాటు ఉత్తర, దక్షిణ ధ్రువాలను చేరుకోవడం. ప్రస్తుతం ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఆస్మా.

‘నాకు చిన్నప్పటి నుంచి పర్వతారోహణపై ఆసక్తి ఉంది. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని కలలు కనేదాన్ని. క్రీడారంగంలో అడుగుపెట్టాక ఆ ఆకాంక్ష మరింత బలపడింది. ఎందుకంటే అక్కడ నేను ఎంతోమంది క్రీడాకారులను దగ్గరి నుంచి గమనించాను. వారు ఆట మధ్యలో పడిపోయినా లేచి ముందుకు సాగుతారు. ఒకవేళ ఓడిపోయినా మరింత బలంగా తయారై మైదానంలోకి అడుగుపెడతారు. ఇదే నన్ను నేను మెరుగుపర్చుకునేలా చేసింది. పర్వతారోహణలో అద్భుతాలు సృష్టించేలా స్ఫూర్తినిచ్చింది. పర్వతారోహకులందరూ కోరుకున్నట్లే నాకూ గ్రాండ్‌స్లామ్‌ పూర్తి చేయాలని ఉంది. ఇప్పటికే సెవెన్‌ సమ్మిట్స్‌లో నాలుగు శిఖరాలను అధిరోహించాను. త్వరలోనే మరో శిఖరంపై మా జాతీయ జెండాను ప్రతిష్ఠిస్తాను’ అని తన ప్రణాళికల గురించి వివరించింది ఆస్మా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్