Updated : 06/10/2021 20:47 IST

అందుకే ఈమె ‘సూపర్‌ మామ్’!

(Photo: Facebook)

భర్తకు గుండె పోటు సమస్యలు... బైపాస్‌ సర్జరీ కూడా అయింది. కూతురికేమో ‘జువెనైల్ డెర్మటోమయోసైటిస్’ అనే అరుదైన వ్యాధి సోకింది. ఇవి చాలవన్నట్లు ఆమెకు వెన్నెముక నొప్పి. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరైనా భయపడిపోతారు. కానీ తమిళనాడుకు చెందిన షిమీ శంకర్‌ అధైర్యపడలేదు. ఎలాగైనా సరే నల్లకోటు ధరించాలన్న లక్ష్యంతో నాలుగు పదుల వయసులోనూ పట్టుదలతో చదివింది. కేరళ లా ఎంట్రన్స్‌ ఎగ్జామ్ (KLEE) ఫలితాల్లో 23వ ర్యాంక్‌ తెచ్చుకుంది.

అడుగడుగునా అడ్డంకులే!

కేరళలోని త్రిస్సూర్‌ పట్టణానికి చెందిన షిమీ శంకర్‌ ప్రస్తుతం కోర్టులో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త సతీశ్‌ ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. కూతురు ఐవాంజలి 5వ తరగతి చదువుతోంది. ఎప్పటినుంచో లాయర్‌ కావాలని కలలు కంటున్న షిమీకి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఆమెను అనారోగ్య పరిస్థితులు చుట్టుముట్టాయి. ఆ తర్వాత భర్త గుండెపోటు బారిన పడ్డాడు. ఆ వెనువెంటనే ఓ అరుదైన వ్యాధి కూతురిని ఆస్పత్రి పాల్జేసింది.

లాయర్‌ అవ్వాలని ఆశ ఉండేది!

‘నేను మొదటిసారి జబ్బు పడినప్పుడు నా కూతురు వయసు మూడున్నరేళ్లు. ఆ సమయంలోనే కొన్ని వ్యక్తిగత సమస్యలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. ఉన్న ఇంటిని వదిలిపెట్టి కుటుంబంతో సహా త్రిస్సూర్‌కు వెళ్లిపోయాం. అక్కడే ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాం. నాకు ఎప్పటినుంచో లాయర్‌ కావాలని ఉంది. అయితే న్యాయవాద విద్యను అభ్యసించేటంత ఆర్థిక స్థోమత ఉండేది కాదు. దీంతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (PGDCA) కోర్సు పూర్తి చేసి కోర్టులో క్లర్క్గా చేరాను..’

ఆఫీసులోనే కుప్పకూలిపోయాడు!

‘సొంత ఇంటిని వదిలి త్రిస్సూర్‌కు వచ్చినప్పుడు మొదటిసారిగా మా వారికి గుండె పోటు వచ్చింది. తను పనిచేస్తున్న ఆఫీసులోనే కుప్పకూలిపోయాడు. సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పటికప్పుడు కోలుకున్నా సమస్య మళ్లీ తిరగబెట్టింది. మూడోసారి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పుడు మా ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. రెండు వారాలకు మించి బతకడని వైద్యులు చేతులెత్తేశారు. అయితే నేను మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఎంత ఖర్చైనా మా వారిని కాపాడుకోవాలనుకున్నాను. అప్పుడే నాకు తెలిసిన వైద్యులు, స్నేహితులు లిసీ ఛారిటబుల్‌ ఆస్పత్రి గురించి చెప్పారు. అందులో ఆయనను చేర్పించి బైపాస్‌ సర్జరీ చేయించాం. దీంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.’

ఆక్సిజన్‌ బెడ్‌పై చికిత్స అందించాం!

‘మా వారు ఇంకా ఆస్పత్రిలో ఉండగానే మా అమ్మాయి కూడా జబ్బు పడింది. డాక్టర్లు పరీక్షించి ‘జువెనైల్ డెర్మటోమయోసైటిస్’ అనే వ్యాధి ఉందన్నారు. ఇదొక అరుదైన ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. కండరాలు, చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొందరి పిల్లల్లో అయితే అంతర్గత అవయవాలు కూడా దెబ్బతింటాయని వైద్యులు చెప్పారు. దీంతో వెంటనే తనను ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించాం. మొదట్లో చికిత్సకు తన శరీరం బాగానే సహకరించింది. అయితే నాలుగు నెలల తర్వాత తన ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కాలేయం పనితీరు కూడా మందగించింది. దీంతో చాలా రోజుల పాటు ఆక్సిజన్‌ బెడ్‌పై చికిత్స అందించాల్సి వచ్చింది. ఇలా ఓ వైపు మా వారు...మరోవైపు నా కూతురును చూసుకోవడానికి కొన్ని నెలల పాటు రెండు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. నా స్నేహితులు, తెలిసిన వైద్యుల సహకారంతో ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించాను. ఇక గతేడాదే నాకు కూడా వెన్నెముక సర్జరీ జరిగింది.’

కరెంట్‌ అఫైర్స్‌ను ఫాలో అయ్యేదాన్ని!

‘ఇక లా పరీక్ష విషయానికొస్తే... కేపీఎస్‌సీ పరీక్షకు ప్రిపేరవుతున్నప్పుడు కరెంట్‌ అఫైర్స్‌ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేదాన్ని. రివిజన్‌ కోసం వాటిని ఓ నోట్‌బుక్‌లో రాసుకునేదాన్ని. దీంతో పాటు లాకు సంబంధించిన పుస్తకాలను క్షుణ్ణంగా చదివాను’ అని తన విజయగాథను వివరించిందీ సూపర్‌ మామ్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని