ఫ్యాషన్‌ అంటే ఇష్టం.. సేవతో మమేకం!

మెట్‌ గాలా.. అంతర్జాతీయంగా జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ఇది. ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఈషా అంబానీ, నటాషా పూనావాలా.. వంటి ప్రముఖులు ఈ రెడ్‌ కార్పెట్‌పై మెరిసి మురిశారు. అయితే ఈసారి ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి.

Updated : 15 Sep 2021 18:04 IST

(Photo: Instagram)

మెట్‌ గాలా.. అంతర్జాతీయంగా జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ఇది. ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఈషా అంబానీ, నటాషా పూనావాలా.. వంటి ప్రముఖులు ఈ రెడ్‌ కార్పెట్‌పై మెరిసి మురిశారు. అయితే ఈసారి ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి. ఫ్యాషన్‌పై మక్కువ ఉన్న ఆమె.. పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. ఇటు పిల్లలు, మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారు. అయితే ఈసారి మెట్‌ గాలా నుంచి ఆహ్వానం అందుకొని అంతర్జాతీయ వేదిక పైనా భారతీయ ఫ్యాషన్‌ పరిమళాలు పూయించారు. ఇక ఈసారి మెట్‌ గాలాకు వెళ్లిన ఏకైక భారతీయురాలిగా, హైదరాబాద్‌ నుంచి ఈ ఈవెంట్లో పాల్గొన్న తొలి సినిమాయేతర వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు సుధ. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

సుధా రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణా రెడ్డి సతీమణిగానే కాకుండా.. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (MEIL) సంస్థ డైరెక్టర్‌గా, సమాజ సేవకురాలిగా కూడా ఆమె పలువురికీ సుపరిచితమే! ఫ్యాషన్‌, కళలు.. వంటి అంశాలపై మక్కువ చూపే ఆమె.. వివిధ ఈవెంట్లలో ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతుంటారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలే ఇందుకు తార్కాణం. ఫ్యాషన్‌, కళలపై ఆమెకున్న ఇష్టమేంటో ఆమె ఇన్‌స్టా బయో చూస్తేనే అర్థమైపోతుంది. అంతేకాదు.. తనకు షాపింగ్‌ చేయడమంటే ఎంతో ఇష్టమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు సుధ. ఇలా ఫ్యాషన్‌ అంటే ప్రాణం పెట్టే ఆమె ఈసారి అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదిక మెట్‌ గాలా నుంచి ఆహ్వానం అందుకున్నారు. వారి పిలుపు మేరకు ఆ వేదికపై ఓ అందమైన అవుట్‌ఫిట్‌లో తళుక్కుమన్నారు.

అమెరికా థీమ్‌కు భారత హంగులు!

‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’ పేరుతో ఈసారి మెట్‌ గాలా ఈవెంట్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా జాతీయ పతాకం, అందులోని రంగుల్ని ప్రధానంగా తీసుకొని ఓ అందమైన గౌన్‌ని రూపొందించారు భారతీయ డిజైనర్లు ఫల్గుణీ షేన్‌ పీకాక్‌. దీనిపై బంగారు, ఎరుపు, నేవీ బ్లూ రంగుల.. స్వరోస్కీ క్రిస్టల్స్‌, బీడ్స్‌, సీక్విన్స్‌తో హంగులద్దారు. అమెరికా జాతీయ పతాకంలోని స్టార్స్‌ని గౌన్‌ వెయిల్‌పై అందంగా తీర్చిదిద్దారు డిజైనర్లు. ఇక 18 క్యారెట్ల గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ, 35 క్యారట్ల వజ్రాలతో వన్నెలద్దిన ఈ అవుట్‌ఫిట్‌ చూపు తిప్పుకోనివ్వట్లేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని రూపొందించడానికి సుమారు 250 పని గంటల సమయం పట్టిందట! ఇలా తన అవుట్‌ఫిట్‌కు జతగా బన్‌ హెయిర్‌స్టైల్‌, స్టైలిష్‌ ఇయర్‌ కఫ్‌తో మెరుపులు మెరిపించారు సుధ. ఫరా అలీ ఖాన్‌ రూపొందించిన వజ్రాభరణాలను ధరించారు. ఇక చేతిలో తాను పట్టుకున్న గణపతి రూపాన్ని పోలిన క్లచ్‌ ఆమె లుక్‌లో మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

డయానా స్ఫూర్తితో..!

తన భర్త కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించడమే కాదు.. ‘సుధా రెడ్డి ఫౌండేషన్‌’ను నెలకొల్పి ఆ వేదికగా పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారామె. ఆరోగ్యం, విద్యను అందరికీ చేరువ చేస్తున్నారు. ముఖ్యంగా పేద చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతోన్న పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు సుధ. ఈ నేపథ్యంలోనే పిల్లల ఆరోగ్యం గురించి అమెరికన్‌ తార ఎవా లాంగోరియాతో మమేకమై పనిచేస్తున్నారామె. మరోవైపు.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెంచే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే బ్రిటిష్‌ నటి ఎలిజబెత్‌ హర్లేతో కలిసి పనిచేస్తున్నారామె. తన సేవా కార్యక్రమాలకు ప్రిన్సెస్‌ డయానానే స్ఫూర్తి అని చెప్పే సుధ.. ‘ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా లక్ష్యం.. అందుకోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తా’ అంటున్నారు. ఇలా తన సేవలకు గుర్తింపుగా ‘యంగ్‌ ఇండియన్‌ విమెన్‌ అఛీవర్స్‌ అండర్‌ 45’ అవార్డును అందుకున్నారీ హైదరాబాదీ.

నాకు ఇదో గొప్ప బహుమతి!

దేశ కీర్తిని ఖండాంతరాలు దాటించే అరుదైన అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప బహుమతి అంటారు సుధ. ‘ఈ మధురానుభూతిని, సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. ఇంతటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో మన దేశం తరఫున నేను భాగమైనందుకు గర్వంగా ఉంది. ఇది నాకు దక్కిన ఓ గొప్ప బహుమతి. భవిష్యత్తులో నా ఫౌండేషన్‌ సేవలు మరింత విస్తృతం చేయడానికి.. అక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి మాట్లాడే అవకాశం నాకు దక్కింది. నా ఈ జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!’ అంటూ చెప్పుకొచ్చారామె.

‘ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు.. వేళ్లూనుకుపోయిన మూసధోరణుల్ని బద్దలుకొడుతున్నారు.. ఎన్నో అంశాల్లో అగ్రగాములుగా నిలుస్తున్నారు.. ఇదిలాగే కొనసాగాలం’టూ తన మాటగా అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు సుధ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్