Published : 07/10/2021 20:11 IST

బ్యాంకు ఉద్యోగం వదిలి ఆ పిల్లల బాధ్యతలను స్వీకరించింది!

(Photos: Facebook)

పిల్లలతో సరదాగా ఆడుకోవడమన్నా, వారితో గడపడమన్నా ఆమెకు చాలా ఇష్టం. అందుకే బ్యాంక్‌ ఉద్యోగాన్ని వదిలి మరీ శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యం గల పిల్లల బాధ్యతలను భుజానకెత్తుకుంది. ప్రత్యేకంగా ఓ పునరావాస కేంద్రం (రీహ్యాబిలిటేషన్‌ ఇనిస్టిట్యూట్‌) నెలకొల్పి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది.

శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యం వంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను బడిలో చేర్చుకోవడానికి చాలామంది అంగీకరించరు. డబ్బులున్న వారైతే తమ పిల్లలను ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో చేర్పించి వారికి వివిధ రకాల పద్ధతుల్లో చదువు చెప్పిస్తారు, ఇతర అంశాల్లో తర్ఫీదు అందిస్తారు. మరి పేదలు, వెనకబడిన వర్గాల సంగతేంటి? వారి పిల్లలు విద్యకు దూరం కావల్సిందేనా అంటే...అలాంటి పరిస్థితి రానీయనంటోంది చెన్నైకు చెందిన సుగన్య కందసామి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ట్రిప్లికేన్‌ కేంద్రంగా ఓ ప్రత్యేక రీహ్యాబిలిటేషన్‌ ఇనిస్టిట్యూట్‌ నడుపుతోందామె. ఇందులో భాగంగా పిల్లలకు స్పీచ్‌ థెరపీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, సైకాలజీ, ఆడియాలజీ సెషన్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ సెషన్లు నిర్వహిస్తోంది.

వారి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోను!

‘పిల్లలతో ఆడుకోవడమన్నా, సరదాగా గడపడమన్నా నాకెంతో ఇష్టం. కానీ మా నాన్న ఓ చేపల వ్యాపారి. అమ్మ ఓ సాధారణ గృహిణి. వారిని పోషించడానికి , ఇతర కుటుంబ అవసరాల కోసం బ్యాంక్‌ ఉద్యోగంలో చేరాను. అయితే ఆ జాబ్‌ నాకెందుకో సంతృప్తినివ్వలేదు. అందుకే 8 ఏళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాను. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపయోగపడేలా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, సైన్‌ లాంగ్వేజ్‌ తదితర కోర్సులు చేశాను. ఆ తర్వాత ఈ రీహ్యాబిలిటేషన్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుచేశాను. శారీరక వైకల్యం, బుద్ధిమాంద్యం తదితర సమస్యలతో బాధపడే పిల్లలు చాలావరకు ముభావంగా ఉంటారు. అసలు కమ్యూనికేషన్‌ ఉండదు. దురదృష్టవశాత్తూ చాలామంది తల్లిదండ్రులకు కూడా ఈ సమస్యపై అవగాహన ఉండదు. అయితే స్పీచ్ థెరపీ, ఆడియాలజీ తదితర సెషన్ల ద్వారా అలాంటి పిల్లల్లో క్రమంగా మార్పును తీసుకురావచ్చు. ప్రస్తుతం నా వద్ద ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 50మంది వరకు ఉంటారు. పేదలు, వెనకబడిన వర్గాల పిల్లల నుంచి ఎలాంటి డబ్బు తీసుకోను. ఇతరుల నుంచి మాత్రం సెషన్‌కు రూ. 200 చొప్పున తీసుకుంటాను. సాధారణంగా ఇతర ఇనిస్టిట్యూట్లలో అయితే సెషన్‌కు రూ.800-1200 చొప్పున తీసుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఫీజులు పెంచడం లేదు.’

అదే నా లక్ష్యం!

‘నాకు వస్తోన్న అరకొర ఆదాయంతోనే అమ్మను పోషిస్తున్నాను. ఇనిస్టిట్యూట్‌ను నడుపుతున్నాను. అయితే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల భవిష్యత్‌ గురించి వారి తల్లిదండ్రులు తీవ్రంగా మథనపడుతున్నారు. అందుకే నేను ఒకేషనల్‌ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ను కూడా ఏర్పాటుచేయాలనుకుంటున్నాను. దీని ద్వారా వృత్తిపరమైన శిక్షణ అందించి వారి ఉపాధికి ఓ మార్గం చూపించాలనుకుంటున్నాను’ అని అంటోంది సుగన్య.

రీహ్యాబిలిటేషన్‌ ఇనిస్టిట్యూట్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల తరఫున వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది సుగన్య. ఇందులో భాగంగా అవసరమైన వారికి ఆడియాలజీ, ఆక్యుపేషనల్‌ థెరపీ తదితర సేవలు అందిస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని