Kelly Haston : ఆ అరుణ గ్రహంపై ఆమె!

అంతరిక్షంలోని ఆయా గ్రహాలపై జీవుల మనుగడ గురించి తెలుసుకోవడానికి దశాబ్దాల తరబడి పరిశోధనలు కొనసాగిస్తున్నారు శాస్త్రవేత్తలు. మార్స్‌పై మనుగడ సాధ్యమా? కాదా? అన్నదీ ఇందులో ఓ భాగమే! ఈ క్రమంలోనే 2030 వరకు అంగారక గ్రహంపైకి....

Published : 27 May 2023 19:03 IST

(Photo: LinkedIn)

అంతరిక్షంలోని ఆయా గ్రహాలపై జీవుల మనుగడ గురించి తెలుసుకోవడానికి దశాబ్దాల తరబడి పరిశోధనలు కొనసాగిస్తున్నారు శాస్త్రవేత్తలు. మార్స్‌పై మనుగడ సాధ్యమా? కాదా? అన్నదీ ఇందులో ఓ భాగమే! ఈ క్రమంలోనే 2030 వరకు అంగారక గ్రహంపైకి మనుషుల్ని పంపాలన్న యోచన చేస్తోంది నాసా. అయితే ప్రాథమికంగా అక్కడి వాతావరణాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్తలు.. అచ్చంగా అలాంటి వాతావరణాన్నే భూమిపై సృష్టించారు. ఈ పరిస్థితుల్ని మనిషి ఎంత వరకు తట్టుకోగలరని పరీక్షించేందుకు ఓ ప్రయోగాత్మక మిషన్‌ను సిద్ధం చేశారు. ఇందులో ఏడాది పాటు గడిపే అవకాశాన్ని సొంతం చేసుకుంది కెనడాకు చెందిన జీవ శాస్త్రవేత్త కెల్లీ హాస్టన్‌. ‘ఇదో పెద్ద సవాలే అయినా.. మార్స్‌ వాతావరణంలోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నానంటో’న్న ఈ బయాలజిస్ట్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

నాసా చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో, సాహసోపేతమైన ప్రయోగాల్లో కొంతమంది మహిళలు చోటుదక్కించుకోవడం మనం చూస్తుంటాం. ఇటీవల అలాంటి అరుదైన అవకాశమే అందుకుంది కెనడాకు చెందిన జీవ శాస్త్రవేత్త కెల్లీ హాస్టన్‌. అరుణ గ్రహంపై జీవుల మనుగడను అంచనా వేసేందుకు.. ‘CHAPEA (Crew Health and Performance Exploration Analog)’ పేరుతో ఓ మిషన్‌ను ప్రారంభించింది నాసా.

ఇంతకీ ఏంటీ ప్రయోగం?

ఇందులో భాగంగా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో ‘మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫా’ పేరుతో త్రీడీ ప్రింటెడ్‌ తరహాలో.. 1700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ నివాస స్థలాన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రదేశంలో అంగారక గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితుల్నే కల్పించారు. ఇందులో పడకగదులు, జిమ్‌, లివింగ్‌ ఏరియా, పంటలు పండించుకోవడానికి అనువైన స్థలం.. వంటి సౌకర్యాలున్నాయి. ఈ మూసి ఉన్న ప్రదేశం నుంచి బయటికొచ్చి స్పేస్‌వాక్‌ చేయడానికి కావాల్సిన సదుపాయాలూ కల్పించారు. అయితే ఇలా స్పేస్‌వాక్‌ చేసే క్రమంలో స్పేస్‌ సూట్‌ ధరించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రయోగంలో భాగంగా.. పరిమిత నీటి వనరుల్ని ఎదుర్కొంటూ మనిషి ఎలా జీవించగలుగుతాడు?, ఆ ప్రదేశంలో సామగ్రి వైఫల్యాలను ఎలా ఎదుర్కోగలుగుతాడు?, భూమి, అంగారక గ్రహాల మధ్య జీవన వ్యత్యాసం.. ఇలాంటి అంశాలన్నీ పరిశీలిస్తారు. ఇలా ఈ క్రమంలో సేకరించే సమాచారం, విశ్లేషణలు.. రాబోయే కాలంలో చేపట్టబోయే మార్స్‌ ప్రయోగానికి కీలకం కానున్నాయంటోంది నాసా.

ఏడాది పాటు మార్స్‌పైనే..!

నాసా చేపట్టబోయే ఈ ప్రయోగానికి కెల్లీ నాయకత్వం వహించనుంది. ఆమెతో పాటు మరో నలుగురు వలంటీర్లు, ఇంజినీర్‌, డాక్టర్‌, నర్సుతో కూడిన బృందం ఏడాది పాటు భూమిపై సృష్టించిన ఈ అరుణ గ్రహంలో ఐసొలేట్‌ కానున్నారు. జూన్‌ చివర్లో ప్రారంభం కానున్న ఈ ప్రయోగం సరిగ్గా ఏడాది పాటు కొనసాగుతుంది. ఇక ఈ నివాస స్థలంలోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి పార్టిసిపెంట్స్‌కు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

ఒకవేళ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా మాట్లాడాలనిపించినా.. ఈ-మెయిల్‌ ద్వారా సందేశాలు పంపడం, ముందుగానే చిత్రీకరించిన వీడియో కాల్స్‌ పంపించడం.. తప్ప మరో ఆప్షన్‌ లేదు. ప్రస్తుతం మార్స్‌ వాతావరణానికి అలవాటు పడేందుకు శిక్షణ తీసుకుంటోన్న కెల్లీ.. ఏడాది పాటు కుటుంబానికి దూరంగా ఉండడం సవాలే అయినా.. ఈ ప్రయోగంలో భాగమయ్యేందుకు చాలా ఆతృతగా ఉన్నానంటోంది.

సవాలే.. కానీ ఆతృతగా ఉంది!

‘ఈ ప్రయోగం కోసం గతేడాదే పార్టిసిపెంట్స్‌ను ఎంపిక చేశారు. దీనికి నేతృత్వం వహించడానికి నన్ను సెలక్ట్‌ చేయడం సంతోషంగా ఉంది. ఏడాది పాటు కుటుంబానికి దూరంగా ఉండడం సవాలే.. కానీ ఎప్పుడెప్పుడు మార్స్‌ వాతావరణంలోకి అడుగుపెడతానా అన్న ఆతృత నన్ను నిలవనివ్వట్లేదు. ఇక ఈ ప్రయోగంలో భాగంగా నిర్ణీత వ్యవధుల్లో మేం స్పేస్‌సూట్‌ ధరించి స్పేస్‌వాక్‌ చేయాల్సి ఉంటుంది.. ఇది కూడా ఓ ప్రత్యేకమైన అనుభూతిని పంచనుంది. చిన్నప్పట్నుంచి అంతరిక్షం, దానికి సంబంధించిన ప్రయోగాలంటే అమితాసక్తే ఉన్నప్పటికీ.. అరుణ గ్రహంపై ఇలా జీవించే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఏదేమైనా ఈ ప్రయోగంలో నేను భాగమవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..’ అంటున్నారు కెల్లీ. కెనడాకు చెందిన జీవ శాస్త్రవేత్త అయిన ఆమె.. ‘క్యాలిఫోర్నియా యూనివర్సిటీ’లో పీహెచ్‌డీ చేశారు. ఆపై పలు బయోటెక్నాలజీ సంస్థల్లో శాస్త్రవేత్తగా సేవలందించారు. మానవ వ్యాధులపై ప్రయోగాలు చేయడం, వాటికి సంబంధించిన నమూనాలు రూపొందించడంలో ఆమె అనుభవజ్ఞురాలు. నాడీ-కాలేయ సంబంధిత సమస్యలు/వ్యాధులు, సంతానలేమి.. వంటి సమస్యలకు స్టెమ్‌ సెల్‌ ఆధారిత చికిత్స పద్ధతుల్ని కనుగొనడంలో కీలక పాత్ర పోషించారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని