80 శాతం మనిషి, 20 శాతం రోబో.. సారా స్ఫూర్తి గాథ విన్నారా?

ప్రమాదంలో కాలు, చేయి విరిగినా.. తన జీవితం వ్యర్థం అనుకోలేదామె. అమ్మ వస్తుందని ఎదురుచూసే తన పిల్లల కోసం ఇంటికెళ్లాలనుకుంది. అంగవైకల్యం ఉన్నంత మాత్రాన చావే మార్గం కాదని, ఎలాగైనా బతకాలని...

Updated : 04 Jul 2023 17:58 IST

(Photos: Instagram)

ప్రమాదంలో కాలు, చేయి విరిగినా.. తన జీవితం వ్యర్థం అనుకోలేదామె. అమ్మ వస్తుందని ఎదురుచూసే తన పిల్లల కోసం ఇంటికెళ్లాలనుకుంది. అంగవైకల్యం ఉన్నంత మాత్రాన చావే మార్గం కాదని, ఎలాగైనా బతకాలని గుండె దిటవు చేసుకుంది.. నిజానికి ఈ మొండితనమే చావు అంచుల దాకా వెళ్లిన సారా డే లగార్డేను బతికించాయేమో అనిపిస్తుంది ఆమె కథ వింటే! ఎందుకంటే ఆమెకు జరిగిన ప్రమాదం అంత తీవ్రమైంది మరి! అలాగని శారీరక వైకల్యంతోనే జీవించాలనుకోలేదు సారా. పట్టుబట్టి మరీ పెట్టుడు కాలు, చేయి అమర్చుకుంది. అయితే అందులో కాలు ప్రోస్థటిక్‌దే అయినా.. చేయి మాత్రం కృత్రిమ మేధతో రూపొందించిన బయోనిక్‌ ఆర్మ్‌. ఇటీవలే దీన్ని అమర్చుకున్న ఆమె.. ప్రపంచంలోనే ఇలా ఏఐ సాంకేతికతతో తయారుచేసిన బయోనిక్‌ ఆర్మ్‌ అమర్చుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కింది. ‘నాకు అంగవైకల్యం ఉందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను 80 శాతం మనిషిని.. 20 శాతం రోబోని..’ అంటోన్న సారా.. ప్రస్తుతం విభిన్న సామాజిక అంశాలపై నలుగురిలో అవగాహన కల్పిస్తోంది.

సారాది లండన్‌లోని క్యామ్‌డెన్‌ నగరం. ప్రస్తుతం అక్కడి ఓ సంస్థలో ‘చీఫ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌’గా పనిచేస్తోన్న ఆమె తన భర్త, ఇద్దరు కూతుళ్లతో నివాసముంటోంది. రచయిత్రిగా, వక్తగా, మోడల్‌గానూ సారా అక్కడి వారికి సుపరిచితమే! ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో తీసుకునే ఆమె.. తన కలం, గళంతోనూ పలు సామాజిక అంశాలపై నలుగురిలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది.

అనుకోని ప్రమాదం!

అయితే రోజూ ఆఫీస్‌కు రైల్లో వెళ్తుంటుంది సారా. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఇంటికెళ్లేందుకు తన ఆఫీస్‌కు దగ్గర్లోని హై బార్నెట్‌ స్టేషన్‌లో రైలు కోసం వేచి చూస్తోంది. అసలే ఆ రోజు ఆఫీస్‌ పనిలో ఆలస్యమైందంటే.. దీనికి తోడు వర్షం. ఈ హడావిడిలోనే ట్రెయిన్‌ ఎక్కే ప్రయత్నం చేసిన ఆమె.. ప్రమాదవశాత్తూ జారి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పడిపోయింది. ‘ఇంటికి వెళ్లే హడావిడిలో రైలు తలుపులు మూసుకుంటున్నట్లు సిగ్నల్‌ శబ్దం వచ్చినా గమనించకుండా రైలెక్కే ప్రయత్నం చేశా. ఒక్కసారిగా తలుపులు మూసుకోవడంతో నా ముక్కు, దంతాలకు గాయాలయ్యాయి. సడన్‌గా వెనక్కి జరగబోయి ప్రమాదవశాత్తూ ప్లాట్‌ఫామ్‌కి, రైలుకి మధ్య ఉన్న గ్యాప్‌లో జారి పడిపోయా. అక్కడున్న ఎవరూ నన్ను గమనించలేదు. అంతలోపే మరో ట్రెయిన్‌ వచ్చి వెళ్లింది. ఇలా రెండు రైళ్లు నా కుడి చేయి, కుడి మోకాలు పైనుంచి వెళ్లడంతో.. ఆ రెండు భాగాలూ నుజ్జునుజ్జయ్యాయి. ఒక్కసారిగా వాటిని చూసి షాక్‌ తిన్నా. నా శరీరంలో రెండు భాగాలు కోల్పోయానని ఆ క్షణమే రియలైజ్‌ అయ్యా. ‘నా పేరు సారా.. నాకు బతకాలనుంది.. ఎవరైనా నాకు సహాయం చేయండి..’ అని గట్టిగా అరవడం ప్రారంభించా.. ఆ తర్వాత పావుగంటకు గానీ నాకు సహాయం అందలేదు..’ అని చెప్పుకొచ్చిందామె.

వైకల్యాన్ని జయించాలనుకున్నా!

అయితే ఈ ప్రమాదానికి కొన్ని నెలల ముందే తన కుటుంబంతో కలిసి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది సారా. ఆ సమయంలో ఎంత పట్టుదలతోనైతే శిఖరాగ్రాన్ని చేరుకోగలిగానో.. అంతే సంకల్పబలాన్ని కూడగట్టుకొని ఈ మృత్యుముఖం నుంచి బయటపడగలిగానంటోందామె.

‘ఓవైపు రక్తమోడుతున్నా.. మరోవైపు నా భర్త, నా పిల్లలే నాకు గుర్తొచ్చారు. వారి కోసం ఎలాగైనా ఇంటికెళ్లాలనుకున్నా. ప్రమాదానికి కొన్ని నెలల ముందు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి సాహసం చేసిన నేను.. అదే సంకల్పబలంతో ఈ ప్రమాదం నుంచీ బయటపడాలన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నా. పావుగంట తర్వాత రైల్వే సిబ్బంది స్పందించి.. అత్యవసర చికిత్స అందిస్తూ నన్ను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో నా చేయి భుజం వరకు, కాలు మోకాలి వరకు తొలగించారు. అయితే ఈ శారీరక వైకల్యంతో నేను జీవితాన్ని కొనసాగించాలనుకోలేదు. అందుకే ప్రోస్థటిక్స్‌ కోసం అన్వేషణ ప్రారంభించా. మోకాలికైతే ప్రోస్థటిక్‌ లెగ్‌ అమర్చుకోగలిగాను.. కానీ చేయి పూర్తిగా కోల్పోవడంతో దీనికి కృత్రిమ అవయవం అందుబాటులో లేకపోయింది. దాంతో కృత్రిమ మేధతో బయోనిక్‌ ఆర్మ్‌ తయారుచేసే ఓ సంస్థను సంప్రదించా..’ అంటూ ప్రమాదం నుంచి బయటపడిన తీరును గుర్తు తెచ్చుకుంది సారా.

రోబోటిక్‌ చేయితో రికార్డు!

సారా AI సాంకేతికతతో రూపొందించిన బయోనిక్‌ ఆర్మ్‌నైతే అమర్చుకోవాలనుకుంది.. కానీ దాని ధర రెండున్నర కోట్ల పైమాటే! అంత డబ్బు ఆమె వద్ద లేకపోవడంతో తన కుటుంబం ఓ క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్‌ సహాయంతో నిధుల సమీకరణ చేపట్టింది. కొన్ని నెలలకే కావాల్సిన డబ్బు సమకూరడంతో.. ఇటీవలే నిపుణులు ఆమెకు ఆ బయోనిక్‌ ఆర్మ్‌ని అమర్చారు. దీంతో ప్రపంచంలోనే ఈ తరహా చేయి అమర్చుకున్న తొలి వ్యక్తిగా సారా రికార్డులకెక్కింది. అయితే తాను అమర్చుకున్న ఈ రోబోటిక్‌ చేయి తనకు పునర్జన్మనిచ్చిందంటోందామె.
‘కృత్రిమ అవయవాలు అమర్చుకున్న తొలినాళ్లలో చేయిని కదిలించడానికి, నడవడానికి చాలా ఇబ్బందులు పడ్డా. కానీ రోజులు గడిచే కొద్దీ ఇవీ నా శరీరంలో భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా బయోనిక్‌ ఆర్మ్‌లో అమర్చిన సాకెట్‌కు సెన్సర్లున్నాయి. అవి నా మెదడు సంకేతాల్ని గ్రహించి దానికి అనువుగా చేయిని సులభంగా కదిలించేలా చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ రోబోటిక్‌ చేయి నాకు పునర్జన్మనిచ్చింది. ప్రస్తుతం దీంతో వస్తువుల్ని ఒడిసిపట్టడం నేర్చుకుంటున్నా. నా కూతుళ్లూ ఈ చేయిని, దీని తయారీలో వాడిన టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నా శరీరంలో ఎలాంటి వైకల్యం లేదు. ఎందుకంటే నేను 80 శాతం మనిషిని.. 20 శాతం రోబోని..!’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది సారా.

వక్తగా, రచయిత్రిగా..!

ముందు నుంచీ ప్రతి విషయంలోనూ పాజిటివ్‌గా ఆలోచించే అలవాటున్న సారా.. ఈ సానుకూల దృక్పథం, మొండి ధైర్యంతోనే చావు అంచుల దాకా వెళ్లినా బతికి బయటపడింది. తన ఉపన్యాసాలతో పని ప్రదేశంలో ఉద్యోగులకు కార్పొరేట్‌ విలువలు నేర్పే ఆమె.. ప్రమాదం తర్వాత అంగవైకల్యంపై అవగాహన కల్పించేందుకూ నడుం బిగించింది. ఈ క్రమంలో వివిధ వేదికలపై ప్రోత్సాహకర ప్రసంగాలు చేస్తూ.. శారీరక లోపాలున్న ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. మరోవైపు సారా పుస్తక రచయిత్రిగానూ చాలామందికి సుపరిచితం. ఈ క్రమంలోనే.. వ్యాపార మెలకువల దగ్గర్నుంచి కాల్పనిక నవలల దాకా.. పలు అంశాలపై పుస్తకాలూ రాసిందామె. మరోవైపు తన పెట్టుడు కాలు, రోబోటిక్‌ చేయితో మోడలింగ్‌ కూడా చేస్తోంది సారా.
‘జీవితం ఎంత అమూల్యమైందో ప్రమాదం తర్వాత నాకు అర్థమైంది. ఇలాంటి గడ్డు సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. ఆ సమయంలో బాధపడుతూ కూర్చోవడం కంటే.. రియలైజ్‌ అయి దాన్నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే మనమేంటో నిరూపించుకోగలం.. మన జీవితాన్నీ ఆనందమయం చేసుకోగలుగుతాం. ప్రస్తుతం నేను నా కుటుంబంతో సంతోషంగా ఉన్నా.. గతంలోలాగే ముందుముందు వారితో కలిసి మరిన్ని సాహస యాత్రలు చేయాలనుకుంటున్నా..’ అంటోందీ వారియర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని