కాల్పులు జరిపినా వెరవలేదు.. అందుకే ఈ నోబెల్
close
Updated : 09/10/2021 18:57 IST

కాల్పులు జరిపినా వెరవలేదు.. అందుకే ఈ నోబెల్!

(Photo: Instagram)

కలాన్నే ఆయుధంగా చేసుకొని.. చుట్టూ జరిగే అన్యాయాల్ని, అవినీతిని బట్టబయలు చేస్తూ, ప్రజలకు కనువిప్పు కలిగించే జర్నలిస్టులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ల హృదయం అనుక్షణం నీతి, నిజాయతీ కోసమే కొట్టుకుంటుంది.. వాళ్ల ఊపిరి నిరంతరం వీటి వెంటే పరుగులు పెడుతుంటుంది. ప్రజలకు నిజాన్ని చేరవేయడానికి తమ ప్రాణాలనైనా ఫణంగా పెట్టడానికి సిద్ధపడుతుంటారు వీరు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రఖ్యాత జర్నలిస్ట్‌ మరియా రెస్సా కూడా ఇలాంటి డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ జర్నలిస్టే! అక్కడి ప్రభుత్వ పాలనను ఎండగట్టడానికి, అధికార దుర్వినియోగం-హింసను రూపుమాపడానికి తన కలాన్నే ఆయుధంగా మలచుకున్నారామె. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణిచి ప్రపంచమంతా శాంతి నెలకొనేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇందుకు ప్రతిగానే ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక శాంతి నోబెల్‌ పురస్కారం గెలుచుకున్నారామె. రష్యాకు చెందిన మరో జర్నలిస్ట్‌ దిమిత్రి మురాటోవ్‌తో కలిసి ఈ అత్యున్నత అవార్డును పంచుకోనున్నారు మరియా. ఈ నేపథ్యంలో ఈ డేరింగ్‌ లేడీ పాత్రికేయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం రండి..

మరియా రెస్సా.. 1963లో మనీలాలో జన్మించింది. ఏడాది వయసున్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో మరియా తల్లి ఆమెను, ఆమె సోదరిని తన పుట్టింట్లో వదిలి యూఎస్‌ఏ వెళ్లిపోయింది. అక్కడే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పుడు మరియా వయసు పదేళ్లు. ఆ సమయంలోనే తన సోదరితో పాటు తననూ అమెరికా తీసుకెళ్లిపోయింది ఆమె తల్లి. దాంతో ఆ తర్వాత చదువంతా అక్కడే కొనసాగించింది మరియా.

తొలి ఉద్యోగం అదే!

ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి మాలిక్యులర్‌ బయాలజీ-థియేటర్‌లో యూజీ పూర్తి చేసిన ఆమె.. ఇంగ్లిష్‌-థియేటర్‌ సర్టిఫికెట్స్‌-డ్యాన్స్‌ విభాగాల్లో బీఏ చదివింది. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే మరియా ఆ తర్వాత ‘ఫిలిప్పీన్స్‌ డిలిమన్‌ యూనివర్సిటీ’లో పొలిటికల్‌ థియేటర్‌ చదివేందుకు Fulbright Fellowship ను గెలుచుకుంది. ఆ తర్వాతే తన పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించింది మరియా. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వ ఛానల్‌ PTV 4 లో తొలి ఉద్యోగంలో చేరిందామె. ఆపై CNN బ్యూరో చీఫ్‌గా సేవలందించింది. మరో పదేళ్ల పాటు CNN జకార్తా విభాగానికి బ్యూరో చీఫ్‌గా పనిచేశారు మరియా. ఈ క్రమంలో ఉగ్రవాదం, ఉగ్రవాదుల సంబంధాలపై పరిశోధనలు సాగించి ఆసియాలోనే మేటి ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌గా ఎదిగారు. సింగపూర్‌లోని ICPVTR సెంటర్‌లోనూ రచయిత్రిగా సేవలందించారు.

కాల్పులు జరిపినా వెరవలేదు!

ఓవైపు CNN, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కి కథనాలు రాస్తూనే.. మరోవైపు ABS-CBN వార్తా సంస్థకు చీఫ్‌గా వ్యవహరించారు మరియా. ఏ దేశంలో పనిచేసినా ఉగ్రవాదాన్ని రూపుమాపడానికే కృషి చేశారామె. ఇందులో భాగంగానే అల్‌ఖైదా, ఆగ్నేయాసియాలోని మిలిటెంట్ల మధ్య సంబంధాలను ట్రాక్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఎన్నోమార్లు తనపై కాల్పులు జరిగినా వెరవలేదంటున్నారీ డేరింగ్‌ జర్నలిస్ట్‌. ‘1986లో రిపోర్టర్‌గా నా పాత్రికేయ ప్రస్థానం మొదలైంది. ప్రపంచంలో వివిధ దేశాల్లో కీలక పదవుల్లో పనిచేశాను. ఈ క్రమంలో పలుమార్లు నాపై దాడులు కూడా జరిగాయి.. అయినా నేను వెరవలేదు. నిజంగా చావుకు భయపడితే నేను ఈ రంగంలోకి వచ్చేదాన్ని కాదేమో!’ అంటారు మరియా.

నకిలీ వార్తలపై ఉక్కు పాదం!

కాలక్రమేణా తన ఉద్యోగాలకు రాజీనామా చేసి 2012లో మరో ముగ్గురు మహిళా జర్నలిస్టులతో కలిసి ‘Rappler’ అనే డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు మరియా. ప్రస్తుతం ఈ సంస్థలో వంద మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. అధికార దుర్వినియోగం, హింస, ప్రభుత్వపు లోటు పాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్యోద్దేశంగా ముందుకు సాగుతోందీ డిజిటల్‌ ఛానల్‌. ఇందులో భాగంగానే.. పలు సంచలనాత్మక కథనాల్ని తన వెబ్‌సైట్‌లో ప్రచురించారు మరియా. మరెంతోమంది ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు కూడా చేశారు. అంతేకాదు.. నకిలీ వార్తల గుట్టురట్టు చేయడమే తమ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నానంటున్నారామె. ఈ క్రమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారామె. ఇలా అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ కోసం పోరాటం సాగిస్తున్నారు. ఇలా తన కృషికి గుర్తింపుగానే తాజాగా నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్నారు మరియా. రష్యాకు చెందిన మరో జర్నలిస్ట్‌ దిమిత్రి మురాటోవ్‌తో కలిసి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

 

రచయిత్రిగా.. టీచర్‌గా..!

* అశాంతిని అణచివేసే క్రమంలో తన కలానికి పదును పెట్టిన మరియా.. రచయిత్రిగానూ రాణించారు. ఈ క్రమంలో ‘Seeds of Terror: An Eyewitness Account of Al-Qaeda's Newest Center (2003)’, ‘From Bin Laden to Facebook: 10 Days of Abduction, 10 Years of Terrorism (2013)’.. వంటి పుస్తకాలు సైతం రాశారామె.

* మరోవైపు టీచింగ్‌ రంగంలోనూ తనదైన ముద్ర వేశారీ డేరింగ్‌ జర్నలిస్ట్‌. ఇందులో భాగంగానే ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ‘Politics and the Press in Southeast Asia’, ఫిలిప్పీన్స్‌ డిలిమన్‌ యూనివర్సిటీలో ‘Broadcast Journalism’.. వంటి కోర్సుల్ని కూడా బోధించారు.


* ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజంలో తాను చేసిన కృషికి గుర్తింపుగా పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు మరియా. ఎమ్మీకి కూడా నామినేట్‌ అయ్యారు.

* అంతేకాదు.. 2018లో ‘టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా, 2019లో టైమ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘ప్రపంచంలోనే వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ‘బీబీసీ 100 విమెన్‌’ లిస్ట్‌లోనూ స్థానం సంపాదించారు.

* ఇక ఈ ఏడాది యునెస్కో పురస్కారంతో పాటు తాజాగా నోబెల్‌ శాంతి బహుమతి కూడా అందుకొని తనకు తిరుగులేదనిపించారు మరియా.


Advertisement

మరిన్ని