మన దేవీ స్నిగ్ధ.. సౌరభ్ ఇష్టసఖిగా.. భర్తకు తగ్గ భార్యగా..!

సౌరభ్‌ నేత్రావల్కర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మార్మోగుతున్న పేరిది. ప్రవాస భారతీయుడైన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ తరపున ఆడుతున్నాడు. అందరు ఆటగాళ్లలా ప్రదర్శన చేస్తే మనం ఇప్పుడు అతడి గురించి మాట్లాడుకునే వాళ్లం కాదేమో!

Updated : 18 Jun 2024 14:10 IST

(Photos: Instagram)

సౌరభ్‌ నేత్రావల్కర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మార్మోగుతున్న పేరిది. ప్రవాస భారతీయుడైన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ తరపున ఆడుతున్నాడు. అందరు ఆటగాళ్లలా ప్రదర్శన చేస్తే మనం ఇప్పుడు అతడి గురించి మాట్లాడుకునే వాళ్లం కాదేమో! కానీ ఈ కుర్ర క్రికెటర్‌ ప్రత్యేకతే వేరు. ఎంత బలమైన ప్రత్యర్థి అయినా, దిగ్గజ క్రికెటర్‌ అయినా.. అలవోకగా వికెట్లు కూల్చుతూ వరల్డ్‌ కప్‌ హీరోగా మారిపోయాడు సౌరభ్‌. మరి, ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌కి కారణమేంటి? అని అడిగితే.. తన ముద్దుల సతీమణి అందించే ప్రోత్సాహమే అంటున్నాడీ హ్యాండ్‌సమ్‌ హబ్బీ. దీంతో ‘మిసెస్‌ నేత్రావల్కర్’ గురించి తెలుసుకొనే బిజీలో పడిపోయారు నెటిజన్లు.

‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందం’టారు. అలాగే తన కెరీర్‌ విజయం వెనుక తన ఇష్టసఖి దేవీ స్నిగ్ధ ముప్పాల ఉందంటున్నాడు సౌరభ్‌. ముంబయిలో పుట్టి పెరిగినా గత కొన్నేళ్ల క్రితం యూఎస్‌ఏ వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ యువ క్రికెటర్‌.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ తరపున ఆడుతున్నాడు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన సౌరభ్.. క్రికెట్‌ను తన ప్రవృత్తిగా ఎంచుకొని రాణిస్తున్నాడు.

ఒకరికి ఒకరై..!

ఇక సౌరభ్ ముద్దుల భార్య దేవి.. మన తెలుగు మూలాలున్న అమ్మాయే. ఇద్దరూ అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. ఆపై ఒరాకిల్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించారు. దేవి ఈ సంస్థలో ప్రిన్సిపల్‌ అప్లికేషన్‌ ఇంజినీర్‌గా కొనసాగుతోంది. పెద్దల ఆశీర్వాదంతో 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతి విషయంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతోంది. సౌరభ్‌ ఎలాగైతే దేవి కెరీర్‌ అభివృద్ధిలో ప్రోత్సహిస్తుంటాడో.. అదేవిధంగా దేవి కూడా తన భర్తకు క్రికెట్‌ విషయంలో పూర్తి మద్దతిస్తుంటుంది. ఇందులో భాగంగానే అతడు ఆడే ప్రతి మ్యాచ్‌కీ హాజరవుతూ.. స్టాండ్స్‌లో కూర్చొని తన భర్తను ఛీర్‌ చేస్తుంటుందీ బ్యూటిఫుల్‌ వైఫ్‌. అలాగే విదేశాల్లో స్థిరపడ్డా.. తమ జీవనశైలి, ఆహార్యం.. తదితర అంశాల్లో భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని పాటిస్తున్నారీ లవ్లీ కపుల్‌. ప్రయాణాలంటే ఈ జంటకు చాలా ఇష్టమట! ఈ క్రమంలోనే వివిధ దేశాల్లో పర్యటించిన ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తమ అనుబంధాన్ని చాటుకుంటుందీ ముద్దుల జంట.

ఆ ప్రోగ్రామ్‌తో పాపులారిటీ!

వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డా.. తనకిష్టమైన డ్యాన్స్ పైనా దృష్టి సారించింది దేవి. కథక్‌ నృత్యంలో ఆరితేరిన ఆమె.. అమెరికా వ్యాప్తంగా పలు నృత్య ప్రదర్శనలూ ఇచ్చింది. ఎంతోమంది ప్రశంసలందుకుంది. ప్రస్తుతం కథక్‌లో ఔత్సాహికులకు మెలకువలు నేర్పుతోన్న దేవి.. ఫిట్‌నెస్‌ లవర్‌ కూడా! శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి డ్యాన్స్‌ను మించిన వర్కవుట్‌ మరొకటి లేదని చెప్పే ఆమె.. ‘BollyX’ పేరుతో ఓ ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాలీవుడ్‌ నృత్యరీతులతో ఫిట్‌నెస్‌ మెలకువలు నేర్పించే ప్రోగ్రామ్‌ ఇది. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమందిలో ఫిట్‌నెస్‌ పట్ల అవగాహనను పెంచుతోన్న దేవి.. అమెరికన్‌ బిజినెస్‌ రియాల్టీ టీవీ షో ‘షార్క్‌ ట్యాంక్‌’లోనూ పాల్గొంది. ఈ ప్రోగ్రామ్‌ నచ్చి ఇందులో పెట్టుబడులు పెట్టడానికి కొందరు షార్క్‌లు ముందుకు రావడంతో.. దేవితో పాటు ఆమె ప్రారంభించిన ఈ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌కీ పాపులారిటీ మరింత పెరిగిందని చెప్పచ్చు.

డ్యాన్స్‌.. నా ఆరోప్రాణం!

‘నాకు చిన్నప్పట్నుంచీ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఏ బాలీవుడ్‌ సినిమా విడుదలైనా.. అందులోని పాటలకు స్టెప్పులేసేదాన్ని. ఇదే ఆసక్తితో కథక్‌లోనూ రాణిస్తున్నా. ఇవే కాదు.. హిప్‌హాప్‌ వంటి సమకాలీన నృత్యరీతుల్లోనూ నాకు ప్రావీణ్యం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. డ్యాన్సే నా స్ట్రెస్‌బస్టర్‌! మనసును ఉత్తేజితం చేసుకోవాలన్నా, ఒత్తిడి నుంచి బయటపడాలన్నా నృత్యమే థెరపీలా పని చేస్తుంది. నన్నడిగితే.. డ్యాన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటా! అందుకే ఇవే డ్యాన్స్‌ మెలకువలతో ఫిట్‌నెస్‌ను పెంచేందుకు ‘BollyX’ను ప్రారంభించా.. ఈ మెలకువల్ని మరెంతోమందికి పంచుతూ వారినీ నృత్యంలో రాణించేలా, ఫిట్‌నెస్‌ను పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నా..’ అంటోంది దేవి. ఇలా ఓవైపు తనకు నచ్చిన వృత్తిప్రవృత్తుల్లో రాణిస్తూనే.. మరోవైపు భర్తనూ ప్రోత్సహిస్తోన్న మిసెస్‌ నేత్రావల్కర్‌ను ‘భర్తకు తగ్గ భార్య!’ అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్