ఆరున్నర అడుగుల జుట్టుతో ‘సోషల్‌ మీడియా స్టార్’ అయింది!

ఎంత పొడవాటి శిరోజాలుంటే అంత అందంగా భావిస్తారు చాలామంది మహిళలు. అందుకే తమ ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కురులను కాపాడుకునేందుకు ఎన్నో రకాల సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటారు. అయితే నేటి ఆధునిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం... తదితర సమస్యలతో నిలువెత్తు కురులున్న అమ్మాయిలు ఎక్కువగా కనిపించడం లేదు. ఒకవేళ పొడవాటి కేశాలున్నప్పటికీ కొంతమంది సౌకర్యం కోసం షార్ట్‌ హెయిర్‌ స్టైల్స్‌కే ప్రాధాన్యమిస్తున్నారు.

Published : 29 Jun 2021 16:27 IST

Photo: Instagram

ఎంత పొడవాటి శిరోజాలుంటే అంత అందంగా భావిస్తారు చాలామంది మహిళలు. అందుకే తమ ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కురులను కాపాడుకునేందుకు ఎన్నో రకాల సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటారు. అయితే నేటి ఆధునిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం... తదితర సమస్యలతో నిలువెత్తు కురులున్న అమ్మాయిలు ఎక్కువగా కనిపించడం లేదు. ఒకవేళ పొడవాటి కేశాలున్నప్పటికీ కొంతమంది సౌకర్యం కోసం షార్ట్‌ హెయిర్‌ స్టైల్స్‌కే ప్రాధాన్యమిస్తున్నారు.

ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు చెందిన అలెనా క్రావ్చెంకో అనే మహిళ తన ఆరున్నర అడుగుల పొడవైన జుట్టుతో సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయింది. 35 ఏళ్ల అలెనా తన ఐదేళ్ల వయసు నుంచి కురులపై కత్తెర పడకుండా పెంచుకుంటోంది. అలా మూడు దశాబ్దాలుగా ఎంతో మురిపెంగా తన కేశాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫలితంగా మొత్తం ఆరున్నర అడుగుల పొడవైన జుట్టుతో ప్రస్తుతం అక్కడి ప్రజలతో పాటు సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటోంది.

అమ్మ చెప్పిందని!

చిన్నప్పుడు ఎక్కువగా పొట్టి జుట్టుకే ప్రాధాన్యమిచ్చిన ఆమె ఐదేళ్ల వయసులో తన తల్లి చెప్పిన మాటలతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అప్పటి నుంచి 30 ఏళ్లుగా తన కురులపై కత్తెర పడకుండా ప్రాణప్రదంగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఆరున్నర అడుగుల జుట్టుతో ‘ఉక్రెనియన్‌ రాపంజెల్‌’ గా అక్కడి ప్రజల్లో విశేష గుర్తింపు సొంతం చేసుకుంటోంది.

వారానికోసారి మాత్రమే తలస్నానం!

తన పొడవాటి శిరోజాలతో తనకు పెరుగుతోన్న పాపులారిటీని చూసి తెగ సంబరపడిపోతోంది అలెనా. ఈ సందర్భంగా తన వెంట్రుకల గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. ‘చిన్నప్పుడు నేను ఎక్కువగా షార్ట్‌ హెయిర్‌లోనే ఉండేదాన్ని. అయితే నా ఐదేళ్ల వయసులో ఒకసారి అమ్మ ‘ఆడవారికి పొడవాటి కురులు మరింత అందాన్నిస్తాయి’ అని చెప్పిన మాటలు మనసులో బలంగా నాటుకుపోయాయి. అప్పటి నుంచి నా కురులపై కత్తెర పడనీయలేదు. అయితే జుట్టు పొడవుగా ఉంటే తలస్నానం చేయడం, ఆరబెట్టడం, దువ్వడం, చిక్కులు కట్టకుండా సంరక్షించుకోవడం... తదితర సమస్యలు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటారు చాలామంది. అయితే ఈ విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. వారానికోసారి 30 నిమిషాల పాటు తలస్నానం చేస్తాను. స్నానం తర్వాత జుట్టును సహజంగానే ఆరనిస్తాను. వేడి కలిగించే హెయిర్‌ డ్రయర్స్‌ను వాడను. వీటిని అధికంగా వాడితే వెంట్రుకలు చివర్లు చిట్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా కురులు తడిగా ఉన్నప్పుడు దువ్వెన అసలు ఉపయోగించను.’

మీరూ నాలా కురులను పెంచుకోవచ్చు!

‘శిరోజాలు మిలమిలా మెరిసేందుకు ఎక్కువగా నేచురల్‌ హెయిర్‌ మాస్క్‌లే వాడతాను. క్రమం తప్పకుండా హెర్బల్‌ ఆయిల్స్‌తో హెడ్‌ మసాజ్‌ చేయించుకుంటాను. నా జుట్టు తత్వానికి సరిపడే కాస్మెటిక్స్‌ను మాత్రమే బయట నుంచి కొనుగోలు చేస్తాను. కొంచెం ఓపిక, పొడవాటి కురులు పెంచుకోవాలన్న కోరిక ఉంటే మీరూ నాలా మారొచ్చు’ అని అంటోందీ బ్యూటిఫుల్‌ లేడీ.

నా కంటే నా జుట్టే పొడవుగా ఉంది!

వ్యాపారవేత్త అయిన అలెనా నిలబడితే తన ఆరున్నర అడుగుల కురులు నేలను తాకుతుంటాయి. ఈ క్రమంలో తన జుట్టు కారణంగానే తనకు పాపులారిటీ వచ్చిందంటోందీ బ్యూటీ. ‘ప్రస్తుతం నా కంటే నా కురులే పొడవుగా ఉన్నాయి. వీటి కారణంగానే నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇక్కడి ప్రజలందరూ నన్ను ఓ యువరాణిలా చూస్తున్నారు. నాతో కలిసి ఫొటోలు దిగేందుకు ఎగబడుతున్నారు. అందులో చాలామంది నా వెంట్రుకలు నిజమైనవా? కావా? అని ముట్టుకొని మరీ చూస్తున్నారు. అప్పుడు నాకెంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. ఇక సోషల్‌ మీడియాలోనూ నా శిరోజాలకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. నా హెయిర్‌ కేర్‌ టిప్స్‌ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పొడవాటి జుట్టు వల్ల నాకెలాంటి అసౌకర్యం కలగడం లేదు. బయటకు వెళ్లే కొన్ని సందర్భాల్లో మాత్రం నా కురులు నేలను తాకకుండా జడ వేసుకుంటాను’ అని అంటోందీ రాపంజెల్.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్