Updated : 22/06/2021 20:12 IST

కరోనా కాలంలో క్యాబ్ డ్రైవర్‌గా..!

Image for Representation

తన 12 ఏళ్ల వయసులో తల్లి హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం అంబులెన్స్‌కు సమాచారమందించింది . కానీ ఏ వాహనమూ రాలేదు. అమ్మ ప్రాణాలూ దక్కలేదు..!

30 ఏళ్ల తర్వాత తన భర్తకు అదే పరిస్థితి వచ్చింది....తీవ్ర అనారోగ్యంతో అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పట్లోలా అంబులెన్స్‌ కోసం కానీ, ఇతరుల సహాయం కోసం ఆమె ఎదురుచూడలేదు. తనే కార్‌ డ్రైవ్‌ చేస్తూ భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అతడి ప్రాణాలను దక్కించుకుంది.

క్యాబ్‌ డ్రైవర్‌గా..!

బెంగళూరు నగరంలో ఏకైక మహిళా క్యాబ్‌ డ్రైవరైన తులసి లవకుమార్‌ జీవితంలో చోటు చేసుకున్న రెండు కీలక సంఘటనలివి..! తనకున్న డ్రైవింగ్‌ నైపుణ్యంతో తన భర్త ప్రాణాలను కాపాడుకున్న ఆమె...ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో ‘క్యాబ్‌ డ్రైవర్‌’గా సేవలందిస్తోంది. కొవిడ్‌ బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేరుస్తూ నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.

రోగుల్లో సానుకూల దృక్పథం నింపుతూ!

బెంగళూరు సమీపంలోని ఉత్తర హళ్లిలో తన భర్త, పిల్లలతో కలిసి నివాసముంటోంది తులసి. ఓ గృహిణిగా తన కుటుంబాన్ని సమర్థంగా నడిపిస్తోన్న ఆమె క్యాబ్‌ డ్రైవర్‌గానూ విధులు నిర్వర్తిస్తోంది. వైరస్‌కు ఏ మాత్రం భయపడకుండా కరోనా బాధితులను తన కారెక్కించుకుంటోంది. మార్గమధ్యంలో వారికి కరోనా భయం పోగొట్టే మాటలు చెబుతూ, రోగులు సానుకూల దృక్పథంతో ఆస్పత్రికి చేరేలా సహాయపడుతోంది.

అమ్మను కాపాడుకోలేకపోయా!

‘మేం నలుగురు అక్కాచెల్లెళ్లం. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ ఒక్కర్తే మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. నాన్న లేని లోటు కనిపించకుండా మాకు అన్నీ సమకూర్చింది. అయితే నా 12 ఏళ్ల వయసులో ఉన్నట్లుండి అమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంబులెన్స్‌తో పాటు తెలిసిన వారందరికీ సమాచారమందించాం. కానీ ఎవరూ రాలేదు. మాకెవరికీ డ్రైవింగ్‌ రాకపోవడం, అమ్మను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతోనే తన ప్రేమకు మేం దూరమయ్యాం.’

మా వారికి కూడా నేర్పించాను!

‘భర్త, పిల్లాడి బాధ్యతలతో బిజీగా ఉన్న నాకు అనుకోకుండా డ్రైవింగ్‌ నేర్చుకునే అవకాశం వచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నారని తెలుసుకుని అందులో చేరాను. కొద్ది రోజుల్లోనే డ్రైవింగ్‌ స్కిల్స్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల కార్లను తీసుకుని నా డ్రైవింగ్‌ నైపుణ్యాలను పరీక్షించుకున్నాను. అప్పుడప్పుడు వారికి డ్రైవర్‌గా కూడా వెళ్లేదాన్ని. మా వారితో పాటు నా 21 ఏళ్ల కుమారుడికి కూడా డ్రైవింగ్‌ నేర్పించాను. దీంతో గతేడాది మా ఆయన సొంతంగా కారు కొని క్యాబ్‌ డ్రైవర్‌గా స్థిరపడ్డారు.’

ఆయన జబ్బు పడడంతో..

‘గతేడాదే మా వారికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగింది. అయినా మందులు వాడుతూనే డ్రైవింగ్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి పెరగడంతో తక్కువ మంది కస్టమర్లనే ఎక్కించుకుంటున్నారు. దీంతో సరైన ఆదాయం రావడం లేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో నేనే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాను. చికిత్స చేయించాను. డాక్టర్లు కూడా ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. అలా నా భర్త ఇంటికే పరిమితం కావడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. నాకు కరాటే శిక్షణలో అనుభవమున్నప్పటికీ ప్రస్తుతం దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైంది. దీంతో మా వారికున్న కారును తీసుకుని ‘cabto’ లో క్యాబ్‌ డ్రైవర్‌గా నమోదు చేసుకున్నాను.’

‘అమ్మ’ అంటారు!

‘దూరాన్ని బట్టి ట్రిప్పుకు సుమారు రూ.600 దాకా తీసుకుంటాను. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో కాల్‌ చేసినా మరుక్షణమే వారి దగ్గరికి వెళుతున్నాను. ఇక కరోనా అంటారా...దాని గురించి భయపడను... కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా. నిత్యం పీపీఈ కిట్లలోనే ప్రయాణం చేస్తున్నా. ట్రిప్‌ పూర్తి కాగానే కారును తప్పనిసరిగా శానిటైజ్‌ చేస్తాను. ఇంటికి రాగానే నా దుస్తులన్నీ నేనే శుభ్రం చేసుకుంటాను. ఇక నా క్యాబ్‌ ఎక్కిన వారందరూ నన్ను అక్కా, థాయి (అమ్మ), తంగి (చెల్లెలు) అని ప్రేమతో పలకరిస్తుంటారు. గమ్యానికి చేరే లోపు ప్రయాణికులతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. ఇక కొవిడ్‌ కాలంలో నా కారెక్కిన ప్రతి ఒక్కరి ద్వారా ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. గతేడాది లాక్‌డౌన్‌లో మా ఫ్యామిలీతో పాటు మా అక్కచెల్లెళ్లందరం కలిసి అవసరమైన వారికి ఆహారం, పండ్లు అందించాం. కానీ ఈసారి నా కుటుంబం కోసం ఇలా కారెక్కాల్సి వచ్చింది. అయినా కొవిడ్‌ రోగులకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నానన్న ఆత్మ సంతృప్తి కలుగుతోంది. ఇప్పుడు మా అక్కలందరూ నన్ను ‘అమ్మ’ అని పిలుస్తున్నారు’ అని అంటోందీ కరోనా వారియర్‌.

నా కలను నా కుమారుడి ద్వారా సాకారం చేసుకున్నా!

తులసికి 21 ఏళ్ల గౌతమ్‌ అనే కుమారుడున్నాడు. తైక్వాండో ఛాంపియన్‌ అయిన అతడు అంతర్జాతీయంగా, జాతీయంగా ఎన్నో పతకాలు సాధించాడు.  ‘చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో నాకిష్టమైన ఆటకు దూరమయ్యాను. నా కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదని నాలుగేళ్ల వయసులోనే తైక్వాండో అకాడమీలో చేర్పించాను. అప్పుడు బాబును భుజాలపై మోస్తూ స్టేడియం వరకు నడిచి వెళ్లేదాన్ని నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు నా కుమారుడు ఇంటర్నేషనల్‌ తైక్వాండో ఛాంపియన్‌గా ఎదిగాడు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు.  నా కలను నా కుమారుడి ద్వారా సాకారం చేసుకున్నాను’ అని అంటోందీ సూపర్‌ వుమన్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని