‘గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌’ పోటీలో మన అమ్మాయిలు!

కొరియన్‌ పాప్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అలాంటి ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌లో చోటు దక్కించుకోవాలనేది ప్రతి సింగర్‌ కల.

Published : 02 Sep 2023 11:55 IST

(Photos: Instagram)

కొరియన్‌ పాప్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అలాంటి ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌లో చోటు దక్కించుకోవాలనేది ప్రతి సింగర్‌ కల. చాలామంది గాయకులకు చిరకాల స్వప్నంగా మిగిలిపోయే అలాంటి కలకు అడుగు దూరంలో నిలిచారు భారత సంతతికి చెందిన ఇద్దరు యువ గాయనీమణులు లారా రాజ్, ఎజ్రెలా అబ్రహాం. నెట్‌ఫ్లిక్స్ కోసం త్వరలో రూపొందించబోయే కె-పాప్‌ డాక్యుమెంటరీ సిరీస్‌ కోసం రెండు ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్స్‌.. ప్రపంచవ్యాప్తంగా యువ ట్యాలెంట్ కోసం అన్వేషణ మొదలుపెట్టగా.. వివిధ దేశాలకు చెందిన 20 మంది అమ్మాయిలు తుది పోరు కోసం ఎంపికయ్యారు. అందులో లారా, ఎజ్రెలా చోటు దక్కించుకున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ కోసం వీరిద్దరూ ఎంపికవ్వాలంటే ముందు ‘డెబ్యూ - ది డ్రీమ్ అకాడమీ’ అనే ఆడిషన్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. మరి, కె-పాప్‌ బ్యాండ్‌ ‘గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌’కు అడుగు దూరంలో నిలిచిన ఈ ఇద్దరమ్మాయిల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

ఇంతకీ.. ఏంటీ పోటీ?

కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌ ‘HYBE’, అమెరికన్‌ యూనివర్సల్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘జిఫెన్‌ రికార్డ్స్‌’ సంయుక్తంగా తమ తొలి ‘గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌’ కోసం రెండేళ్ల క్రితమే అన్వేషణ మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కె-పాప్‌ సంగీతంలో ప్రావీణ్యం ఉన్న 15-20 ఏళ్ల వయసున్న అమ్మాయిల్ని ఎంపిక చేసుకోవాలనుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా.. ఆడిషన్లు, వివిధ వడపోతల అనంతరం 20 మంది అమ్మాయిలు తుది పోటీ కోసం ఎంపికయ్యారు. వీరంతా ఆస్ట్రేలియా, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, యూఎస్‌ఏ, బ్రెజిల్‌, దక్షిణ కొరియా, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, థాయ్‌ల్యాండ్‌, అర్జెంటీనా.. తదితర దేశాలకు చెందిన వారు. అయితే ఇందులో భారత సంతతికి చెందిన లారా రాజ్‌, ఎజ్రెలా కూడా చోటు దక్కించుకున్నారు. వీరంతా ‘డెబ్యూ : ది డ్రీమ్‌ అకాడమీ’ అనే టీవీ ఆడిషన్‌ షోలో పోటీ పడనున్నారు. ఇందులో గెలుపొందిన వారికి ‘గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌’లో చోటు దక్కుతుంది. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ నదియా హాల్‌గ్రెన్‌ రూపొందించబోయే నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ సిరీస్‌లో పాల్గొనే అవకాశమూ వీరి సొంతమవుతుంది. ఈ క్రమంలోనే డాక్యుమెంటరీ థీమ్‌కు తగినట్లుగా వీరికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఇక తుది పోటీకి సంబంధించిన ఆడిషన్‌ ప్రోగ్రామ్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి ప్రతి వారం.. 12 వారాల పాటు ప్రసారం చేయనున్నారు. తుది విజేతల్ని నవంబర్‌ 17న ప్రకటిస్తారు. కేవలం డాక్యుమెంటరీ కోసమే కాకుండా.. ఈ అమ్మాయిల బృందాన్ని అంతర్జాతీయ సంగీత రంగంలో ‘ది బెస్ట్‌ గర్ల్‌ గ్రూప్‌’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాయీ రెండు పాప్‌ సంస్థలు.


‘ట్రిపుల్‌ థ్రెట్‌’లో నిపుణురాలు!

గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌ తుది పోటీ కోసం ఎంపిక చేసిన 20 మందిలో న్యూయార్క్‌కు చెందిన భారత సంతతి అమ్మాయి లారా రాజ్‌ ఒకరు. నాలుగేళ్ల వయసు నుంచే పాటలు, డ్యాన్స్‌, నటన అంటే ఆసక్తి చూపిన లారా.. ఈ మూడింట్లోనూ శిక్షణ తీసుకుంది. అందుకే ఏ సందర్భంలోనైనా తనను తాను ‘ట్రిపుల్‌ థ్రెట్‌ (తమకు ఆసక్తి ఉన్న మూడు అంశాల్లో శిక్షణ పొందడం)’గా పరిచయం చేసుకుంటుందామె. తాజాగా గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌ తుది జాబితాకు ఎంపికైనప్పుడూ ఇలాగే పరిచయం చేసుకుంది లారా. ఈ మూడు అంశాల్లో పూర్తి నైపుణ్యాలు సాధించడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న ఆమె.. తొలుత కొన్నేళ్ల పాటు ‘స్టీఫెన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌’తో కలిసి పని చేసింది. ఈ క్రమంలోనే పలు వేదికలపై సంగీత ప్రదర్శనలిచ్చింది. ఆపై ఓ సంగీత పోటీలో గెలుపొందిన ఈ అమ్మాయికి.. బుల్లితెర/వెండితెర, మోడలింగ్‌, మ్యూజికల్‌ థియేటర్‌తో పాటు నటిగా పలు అవకాశాలొచ్చాయి. ఆపై 2013లో ‘ది బ్లాక్‌లిస్ట్‌’ అనే టీవీ సిరీస్‌లో నటించే అవకాశం దక్కించుకొని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది లారా. ఆ తర్వాత ‘అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ‘గో రెడ్‌ ఫర్‌ విమెన్‌’ అనే ఈవెంట్కి కోహోస్ట్ గానూ వ్యవహరించింది లారా. ఇలా తెర పైనే కాదు.. సొంతంగా పాటలు పాడుతూ, సాంగ్‌ కవర్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేస్తుంటుందీ 17 ఏళ్ల యూత్‌ సెన్సేషన్.


మిసెస్‌ ఒబామాతో కలిసి..!

తన పాటలు, డ్యాన్స్‌, నటనతో ఆకట్టుకునే లారా.. పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంలోనూ ముందుంటుంది. ఈ క్రమంలోనే 2019లో ‘ఒబామా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మిచెల్‌ ఒబామా ప్రారంభించిన ‘గ్లోబల్‌ గర్ల్స్‌ అలయన్స్‌’ అనే ప్రచార కార్యక్రమంలోనూ భాగమైంది. బాలికలు, మహిళల విద్యా హక్కులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన క్యాంపెయిన్‌ వీడియోలోనూ నటించింది లారా.

‘పాటలు, డ్యాన్స్‌, నటన నాకు ప్రాణం. చిన్నప్పట్నుంచీ వినోద రంగంలో పనిచేయాలని కలలు కన్నా. నా ఆసక్తిని గుర్తించిన నా కుటుంబం, స్నేహితులు, టీచర్లు.. అందరూ నన్ను ప్రోత్సహించారు. దాంతో నా ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇప్పటివరకు సింగర్‌గా, డ్యాన్సర్‌గా ఎన్నో ప్రదర్శనలిచ్చా. నటిగా, మోడల్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నా. కానీ మిచెల్‌ ఒబామాతో కలిసి పనిచేయడం నా జీవితంలోనే మర్చిపోలేను. ‘గ్లోబల్‌ గర్ల్స్‌ అలయన్స్‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సామాజికంగా అమ్మాయిలు/మహిళలు ఎదుర్కొనే సమస్యలేంటో తెలుసుకున్నా. అందుకే తరచూ సోషల్‌ మీడియాలో బాలికా విద్య, మానసిక ఆరోగ్యం, సామాజిక న్యాయం.. తదితర అంశాలపై మాట్లాడుతూ నలుగురిలో స్ఫూర్తి నింపుతున్నా. నేనూ పెరిగి పెద్దయ్యే క్రమంలో నా శరీరాకృతి పరంగా పలు సమస్యలు, విమర్శలు ఎదుర్కొన్నా.. కానీ కుటుంబ సభ్యుల సహకారంతో ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలిగాను.. స్వీయ ప్రేమను పెంచుకోగలిగాను..’ అంటోన్న ఈ టీనేజర్‌.. ‘గ్లోబల్‌ గర్ల్స్‌ గ్రూప్‌’ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది.


కె-పాప్‌ గాయనిగా..!

ఎజ్రెలా అబ్రహాం.. భారత సంతతికి చెందిన ఈ టీనేజర్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. ప్రస్తుతం గాయనిగా కొనసాగుతోన్న ఆమె.. Maverick, KNTQ అనే కె-పాప్‌ కవర్‌ గ్రూప్స్‌లో భాగమైంది. ఇందులో భాగంగానే పలు మ్యూజిక్‌ ప్రదర్శనలిచ్చి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. ఇంగ్లిష్‌, మలయాళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదట! ఇక పియానో వాయించడంలోనూ దిట్ట. అంతేకాదు.. ట్రావెలింగ్‌ అన్నా తనకు మక్కువేనట! అయితే కెమెరాకు దూరంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడే ఎజ్రెలా.. తన వెకేషన్‌ ఫొటోల్ని మాత్రం సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది. ప్రస్తుతం గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌ ఆడిషన్‌కు సిద్ధమవుతున్నానని చెబుతోన్న 20 ఏళ్ల టీనేజర్‌.. గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని