Varun-Lavanya: ‘హ్యాండ్‌సమ్’ అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది!
తెరపై జంటగా రొమాన్స్ పండిస్తుంటారు ఎంతోమంది నటీనటులు. అలాంటి కొన్ని ముచ్చటైన జంటల్ని చూస్తే.. నిజ జీవితంలోనూ వీరు ఒక్కటైతే బాగుండనిపిస్తుంటుంది. ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్, సొట్టబుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠి....
(Photos: Instagram)
తెరపై జంటగా రొమాన్స్ పండిస్తుంటారు ఎంతోమంది నటీనటులు. అలాంటి కొన్ని ముచ్చటైన జంటల్ని చూస్తే.. నిజ జీవితంలోనూ వీరు ఒక్కటైతే బాగుండనిపిస్తుంటుంది. ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్, సొట్టబుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠిని వెండితెరపై జంటగా చూసిన అభిమానులూ ఇలాగే అనుకున్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. తాజాగా నిశ్చితార్థంతో తమ అనుబంధాన్ని మరో మెట్టెక్కించింది. ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నంత చూడముచ్చటగా కనిపించే ఈ లవ్లీ కపుల్.. తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల్నీ ఆనందంలో ముంచెత్తారు. మరి, త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ ముద్దుల జంట ప్రేమాయణం అసలు ఎక్కడ మొదలైంది? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? తమ ప్రేమ విషయం గురించి లావణ్య ముందే హింట్ ఇచ్చిందా? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
‘మిస్టర్’తో మొదలైంది!
వెండితెరపై కలిసి నటించి.. ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. వరుణ్-లావణ్యలు కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు. 2017లో ‘మిస్టర్’ సినిమా కోసం తొలిసారి కలిసి నటించిందీ జంట. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారట! ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారిందట! ఇక గతేడాది డిసెంబర్‌లో లావణ్య పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తన ప్రేమ ప్రతిపాదన చేశాడట! ఇలా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లపీటలెక్కేందుకు రడీ అయిపోయారు.
‘మెగా’ వేడుకల్లో సందడి!
ఇన్నేళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఇద్దరూ కలిసి కెమెరా కంటికి చిక్కిన సందర్భం ఒక్కటీ లేదు.. తమ ప్రేమను అంత రహస్యంగా ఉంచిందీ జంట. అయితే ‘మెగా’ ఫ్యామిలీలో జరిగిన పలు ఫంక్షన్లు, వేడుకల్లో లావణ్య సందడి చేయడం మనం చూశాం. నిజానికి వరుణ్ చెల్లెలు నిహారికకు లావణ్య మంచి స్నేహితురాలు! వారిద్దరూ తమ స్నేహితులతో కలిసి జిమ్‌లో, రెస్టరంట్లో.. ఇలా పలు చోట్ల దిగిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఇక ఉదయ్‌పూర్లో జరిగిన నిహారిక పెళ్లికీ హాజరై సందడి చేసిందీ డింపుల్ బ్యూటీ. ఆ సమయంలో రీతూ వర్మ, వరుణ్‌తో కలిసి ఫొటోలూ దిగింది. అయితే అప్పుడూ అతిథిగానే ఈ వేడుకల్లో పాల్గొందనుకున్నారంతా! కానీ ‘మెగా’ ఫ్యామిలీకి కాబోయే కోడలిగా ఆడపడుచు పెళ్లిలో భాగమైందన్న విషయం ఇప్పుడు నెమరువేసుకొని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్.
ముందే హింట్ ఇచ్చిందా?
ప్రేమలో ఉన్న వారి మాటలు ఓ పట్టాన అర్థం కావు.. ఒక్కోసారి వారు హింట్ ఇచ్చినా మనం అర్థం చేసుకోలేకపోతాం. ఈ అందాల రాక్షసి కూడా తన ఇష్టసఖుడిపై తనకున్న ప్రేమ గురించి కొన్ని సందర్భాలలో పరోక్షంగా చెప్పింది. ఇటీవలే తన కొత్త చిత్రం ‘పులి మేక’ ప్రమోషన్‌లో భాగంగా ‘సుమ అడ్డా’ కార్యక్రమంలో పాల్గొంది లావణ్య. అందులో ‘నాని, వరుణ్.. వీరిద్దరిలో ఎవరు హ్యాండ్‌సమ్?’ అని సుమ అడగ్గా.. ‘వరుణ్ హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు!’ అని తడుముకోకుండా సమాధానమిచ్చింది.
ఇక ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా.. అల్లు అరవింద్ లావణ్యను మెచ్చుకున్న సందర్భంలోనూ వరుణ్-లావణ్యల ప్రేమ విషయం తెలియలేదు. నిజానికి లావణ్య ఉత్తరాది నుంచి వచ్చింది. అలాంటిది ఆ ఈవెంట్ వేదికపై చక్కటి తెలుగులో మాట్లాడే సరికి.. ‘ఉత్తరాది నుంచి వచ్చినా చక్కగా తెలుగు మాట్లాడుతున్నావ్. ఓ తెలుగబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిలవ్వు..’ అంటూ లావణ్యతో సరదాగా సంభాషించారు. దానికి ఈ డింపుల్ బ్యూటీ ఓ స్మైల్‌తో సరేనంటూ సమాధానమిచ్చింది. ఇలా పలుమార్లు వీరి ప్రేమ, పెళ్లి గురించి హింట్స్ వచ్చినా తెలుసుకోలేకపోయామంటున్నారు చాలామంది ఫ్యాన్స్.
వదినకు స్వాగతం!
ఏదేమైనా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్-లావణ్యలు తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుక కోసం ఇద్దరూ సంప్రదాయబద్ధమైన దుస్తులు ఎంచుకున్నారు. లావణ్య.. అనితా డోంగ్రే రూపొందించిన లేత ఆకుపచ్చ రంగు చీరలో మెరవగా, వరుణ్.. తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన క్రీమ్ కలర్ షేర్వాణీ ధరించాడు. ‘నా ప్రేమ దొరికిందం’టూ ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక తన బెస్ట్ ఫ్రెండ్, వదిన కాబోతుండడంతో నిహారిక ‘వదినకు స్వాగతం’ అంటూ అన్న-వదినలతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ మెగా కపుల్ నిశ్చితార్థపు ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అటు సెలబ్రిటీలు, ఇటు ఫ్యాన్స్ ఈ ముద్దుల జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కంగ్రాట్స్ క్యూట్ కపుల్!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.