బొంతలు కుట్టి... కోట్లు కూడబెట్టి!

రెండున్నర లక్షల పెట్టుబడితో మసాజ్‌ సెంటర్‌ ఆరంభించిన ఫరా అహ్మద్‌ మరో రెండు వ్యాపారాలను అవలీలగా నిర్వహిస్తూ పన్నెండున్నర కోట్ల టర్నోవర్‌కు విస్తరించింది.

Updated : 25 Mar 2023 07:43 IST

రెండున్నర లక్షల పెట్టుబడితో మసాజ్‌ సెంటర్‌ ఆరంభించిన ఫరా అహ్మద్‌ మరో రెండు వ్యాపారాలను అవలీలగా నిర్వహిస్తూ పన్నెండున్నర కోట్ల టర్నోవర్‌కు విస్తరించింది. ఆమె స్ఫూర్తి ప్రయాణం...

కోల్‌కతాలో పుట్టిపెరిగిన ఫరా తల్లి ఉర్దూలో డాక్టరేట్‌, తండ్రి ఆర్థోపెడిక్‌ సర్జన్‌. పై చదువుల కోసం బెంగళూరు వెళ్లింది. చదువయ్యాక రెండుమూడు ఉద్యోగాలు చేసినా తృప్తినివ్వలేదు. వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో బెంగళూరు ఐఐఎంలో రీసెర్చ్‌ అసోసియేట్‌గా చేరి ఆర్నెల్లు శిక్షణ తీసుకుంది. ఆనక యూకే వెళ్లింది. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఒక ప్రాజెక్ట్‌ పూర్తిచేసి మరింత అవగాహన పెంచుకుంది. తిరిగొస్తున్నప్పుడు బ్యాంకాక్‌లో థాయ్‌ మసాజ్‌ పార్లర్‌ ఆమెనెంతో ఆకర్షించింది. రూ.అరవై వేలు చెల్లించి నెల రోజుల శిక్షణ తీసుకుంది. ఆ వెంటనే బెంగళూరులో థాయ్‌ స్పా ప్రారంభించింది. దాచుకున్న రూ. రెండున్నర లక్షలే పెట్టుబడి, ఇద్దరే ఉద్యోగులు. రెండో అంతస్థులో దుకాణాన్ని అద్దెకు తీసుకున్నప్పుడు యజమాని ‘నువ్వు నిర్వహించగలవా?’ అనడిగాడు అనుమానంగా. అప్పటికామె వయసు ఇరవయ్యారే మరి. దాన్ని నడపటమే కాదు ‘టాయ్స్‌ అండ్‌ బేబీ స్టోర్‌’ కూడా మొదలుపెట్టి విజయం సాధించింది. ప్రపంచ బ్రాండ్‌గా కితాబులందుకుంటున్న ‘ట్రాయ్‌’ ఫరాదే. మహిళా పారిశ్రామిక వేత్తలకు నిధులు, శిక్షణ లాంటి విషయాల్లో సాయమందించే గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రోగ్రాముకు ఎంపికైన ఫరా ట్రాయ్‌ బ్రాండ్‌ను రూపొందించింది. 62 బ్లాక్స్‌తో పిల్లలు బోలెడన్ని ఆకృతులు నిర్మించగల ఈ కిట్‌ను పరిచయం చేసింది.

2021లో కొవిడ్‌ వల్ల నెల వ్యవధిలో తల్లిని, సోదరుడిని కోల్పోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది ఫరా. సాధారణంగా ఏవైనా సమస్యలు ఎదురైతే కుంగిపోవడం సహజం. కానీ వాటికి పరిష్కారాలు కనుక్కునేందుకు ప్రయత్నించడమే ఫరా ప్రత్యేకత. అలా డిప్రెషన్‌ నుంచి కోలుకునే క్రమంలో మెమొరీ క్విల్ట్‌ ఆలోచన వచ్చిందామెకి. అంటే మెత్తటి పాత వస్త్రాలతో కుట్టే బొంత. తల్లీ సోదరుల దుస్తులతో బొంత కుట్టి వారి జ్ఞాపకాలను పదిలంగా దాచుకుంది. మనవాళ్లు మనతోనే ఉన్నారన్న భావన కలిగి గుండెభారం తగ్గుతుంది. ఈ ఆలోచన నచ్చిన ఎందరో ఆమెని సంప్రదించారు. తమ ఆప్తుల గుర్తుగా బొంతలు తయారుచేసివ్వమన్నారు. దేశం నలుమూలల నుంచే గాక అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. ఈ క్విల్ట్‌ వ్యాపారానికి ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు వస్తాయి. చాట్‌బోట్‌ సాంకేతికతతో నడుస్తుంది. వెబ్‌సైట్‌ లేదా ఇన్‌స్ట్టాగ్రామ్‌ పేజీ నుంచి ఆర్డర్‌ చేయొచ్చు. ఇవి పిల్లలకు వాడిన వస్త్రాలు, టీషర్టులు, చీరలు- మూడు రకాలున్నాయి. ఒక్కోటి నాలుగు నుంచి ఆరు వేలుంటుంది.  ఎం.టెక్‌ చదివి ఐఐటి రవుర్కెలాలో పనిచేసే ఫరా భర్త ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆమె వ్యాపారంలో చేరిపోయారు. ఒకే బుట్టలో గుడ్లన్నీ ఉంచడం అంత మంచిది కాదు. వ్యాపారమూ అంతే. ఒక్కదాని మీదే డబ్బూ, శ్రమా ఖర్చుపెడితే నష్టపోతే కష్టం. అందుకే రెండు మూడింటి మీద కృషి చేయడం ఉత్తమం- అంటుంది ఫరా. మంచి ఆలోచన కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్