ఈ ఊళ్లు ఆడవాళ్లకు మాత్రమే.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం మంది మహిళలు నిత్యం మగవారి చేతిలో ఏదో ఒకరకంగా వేదనకు గురవుతున్నట్లు ప్రపంచ నివేదికలు తెలుపుతున్నాయి. వీరిలో కొంతమంది మౌన రోదనతోనే జీవిస్తుంటే, మరికొంతమంది తిరగబడుతూ స్వేచ్ఛా జీవనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇలా మగాళ్లు పెత్తనం చెలాయించే ఈ ప్రపంచంలో కొన్ని ఊళ్లు మాత్రం స్త్రీల అధీనంలోనే ఉన్నాయని...

Updated : 02 Mar 2022 20:30 IST

(Photo: Facebook)

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం మంది మహిళలు నిత్యం మగవారి చేతిలో ఏదో ఒకరకంగా వేదనకు గురవుతున్నట్లు ప్రపంచ నివేదికలు తెలుపుతున్నాయి. వీరిలో కొంతమంది మౌన రోదనతోనే జీవిస్తుంటే, మరికొంతమంది తిరగబడుతూ స్వేచ్ఛా జీవనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇలా మగాళ్లు పెత్తనం చెలాయించే ఈ ప్రపంచంలో కొన్ని ఊళ్లు మాత్రం స్త్రీల అధీనంలోనే ఉన్నాయని మీకు తెలుసా ? అక్కడ మగవారు అడుగుపెట్టడానికి వీల్లేదంటే మీరు నమ్ముతారా ? అవును ఇది నిజమే ! మన ప్రపంచంలో ఇటువంటి ఊర్లు కూడా కొన్నున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం రండి !

15 మందితో మొదలైంది !

ఉత్తర కెన్యాలోని సంబురులో పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది ఉమోజ అనే ఊరు. చుట్టూ ముళ్లపొదతో రక్షణ వలయం కలిగిన ఈ ఊరిలోకి మగవారికి ప్రవేశం నిషిద్ధం. 1990లో బ్రిటిషర్ల చేతిలో అత్యాచారానికి గురైన 15 మంది మహిళలు ఈ ఊరిని నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు. చుట్టు పక్కల ఊర్లలోని మగవారి వల్ల చిత్రహింసలకు గురైన మహిళలకి, పిల్లలకు ప్రస్తుతం ఈ ఊరు నీడనిస్తోంది. వీరిలో పశువుల కోసం వృద్ధులకు అమ్మేసిన అమ్మాయిలు, పురుషుల చేతిలో అఘాయిత్యానికి గురైతే ఇంట్లో నుండి గెంటేసిన గృహిణులు ఉన్నారు.

జీవనాధారం కోసం ఇక్కడి మహిళలు పశువులను కాయడం, వ్యవసాయం చేయడంతో పాటు రకరకాల రంగు రాళ్లతో ఆభరణాలు చేసి చుట్టు పక్కల ఊర్లకు వచ్చే టూరిస్టులకు అమ్ముతుంటారు. వృద్ధులు, కాస్త సామాజిక చైతన్యం ఉన్న మహిళలు తోటి మహిళలకు బాల్య వివాహాలు, ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఇక్కడి మహిళలు, పిల్లల కోసం ఓ స్కూల్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పక్క గ్రామాల ఆడపిల్లలు, మహిళలు కూడా వచ్చి చదువుకోవచ్చు.

తుపాకీతో కాపలా ఉంటారు !

సిరియా అంటేనే యుద్ధానికి పెట్టింది పేరు. ఇక్కడ ఎప్పుడూ హింసాత్మక వాతావరణమే నెలకొని ఉంటుంది. ఈ క్రమంలో ఎందరో సైనికులు తమ ప్రాణాలను కోల్పోతుంటారు. అలా యుద్ధంలో భర్తలను కోల్పోయిన స్త్రీల కోసం, అనాథగా మిగిలిన మహిళల కోసం 'జిన్‌వార్' అనే ఊరిని ప్రత్యేకంగా నిర్మించాయి మహిళా సంఘాలు. ఈ క్రమంలో మహిళలను, పిల్లలను హింస నుండి దూరంగా ఉంచడానికి కెన్యాలోని ఉమోజ గ్రామాన్నే వీళ్లు ఇక్కడ స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. ఈ ఊరిలోకి పురుషులెవరూ రాకుండా గేటు బయట ఒక మహిళ తుపాకీతో కాపలా కాస్తుంటుంది కూడా.

ఈ ఊళ్లో పిల్లలకు ఒక పాఠశాల, జిన్‌వార్ అకాడమీ, మ్యూజియంతో పాటు ఒక ఆరోగ్య కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడి మహిళలు వ్యవసాయం, పశువుల పెంపకం చేపడుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఉదయం అల్పాహారం దగ్గర నుండి సాయంత్రం భోజనం వరకు ఇక్కడ అందరూ కలిసే చేయడం మరో విశేషం.

ఒంటరి మహిళల కోసం..

ఈజిప్టు ప్రభుత్వం వితంతువులకు, విడాకులు తీసుకున్న వారికి కేటాయించిన వూరే 'అల్ సమాహా'. ఇక్కడ 300 మందికి పైగా మహిళలు తమ పిల్లలతో జీవనం సాగిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి ఇచ్చిన ఇంటిని, వ్యవసాయ భూమిని తిరిగి తీసుకుంటుందట ఇక్కడి ప్రభుత్వం. ఎలాంటి ఆసరా లేని ఒంటరి మహిళలు మాత్రమే ఇక్కడ నివసించాలనేది ప్రభుత్వ నిబంధన. పలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అన్ని విధాలా అర్హులైన వారికి ఒక ఇంటితో పాటు ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వమే కేటాయిస్తుంది. అంతేకాదు ఇంట్లో అవసరమైన ప్రతి వస్తువుని, వ్యవసాయానికి కావాల్సిన ప్రతి ముడి సరుకుని ప్రభుత్వమే ఇస్తుందట.

ఒక దీవినే సృష్టించింది!

క్రిస్టినా రోత్ ఒక వ్యాపారవేత్త. అంతకుముందు పలు సంస్థలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేది. ఆ సమయంలో మగవారి ఆజ్ఞలకు తలాడించాల్సి రావడం ఆమెకు నచ్చలేదట. అందుకే తాను నెలకొల్పిన సంస్థను అమ్మేసి తనలాంటి మహిళల కోసం ఏకంగా ఒక దీవినే కొనేసింది. ఆ దీవి పేరే 'సూపర్ షీ ఐల్యాండ్'.

మహిళలు సరదాగా కాలం గడిపే ఈ దీవిలో మగవారికి ప్రవేశం లేదు. ఇక్కడ మగవారు ప్రవేశించింది కేవలం దీవి నిర్మాణ సమయంలోనే. ఈ దీవిలో మహిళలు యోగా, మెడిటేషన్, సాహసకృత్యాలతో పాటు స్ఫూర్తి ప్రసంగాలను ఇస్తుంటారు. అయితే ఈ దీవి బాగా సంపన్న మహిళలకే అందుబాటులో ఉందని, పైగా ఇందులో ప్రవేశం కోసం జరిగే సెలక్షన్స్‌లో కఠిన నియమాలతో పాటు భారీ మొత్తాన్ని వసూలు చేయడం విమర్శలకు దారితీసింది. అయితే వీటిని రోత్‌ కొట్టిపడేశారు. 2019 నుంచి ఈ దీవి సూపర్‌ షీ యాప్‌ యాక్టివ్‌ మెంబర్స్‌ని మాత్రమే అనుమతిస్తోంది.

కొడుకైనా వెళ్లిపోవాల్సిందే !

'నొయివా డు కోర్డియొరొ' ఇది బ్రెజిల్‌లోని ఒక ఊరు. గతంలో ఇక్కడ వితంతువులు, అనాథ మహిళలు, పెళ్లి కాని మహిళలు ఎక్కువగా ఉండేవారట. తాము చెప్పిన నియమనిబంధనలకు ఒప్పుకుంటేనే మగవారిని ఊరిలో ఉండనిచ్చేవారట. అది కూడా వీకెండ్స్‌లో మాత్రమే! మిగిలిన రోజులన్నీ ఎక్కడికైనా వెళ్లి పని చేసుకుంటూ ఉండాల్సిందే. ఆఖరుకి సొంత కొడుకైనా పద్దెనిమిదేళ్లు దాటితే ఊరి నుండి వెళ్లిపోవాల్సిందేనట. ప్రస్తుతం ఇక్కడ 20 నుండి 35 సంవత్సరాల వయసుండే ఆరు వందల మంది మహిళలు జీవిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన ఆహారోత్పత్తుల్ని స్వయంగా పండించుకుంటారట ఇక్కడి మహిళలు.

ఐక్యరాజ్య సమితి మెచ్చుకుంది!

యూరప్‌లోని బాల్టిక్ నదిలో ఉంది 'కిహ్ను' అనే దీవి. దీని అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని స్థానికులు చెబుతుంటారు. దీనంతటికీ కారణం ఇక్కడి మహిళల నిర్వహణ సామర్థ్యమే. దాదాపు ఆరు వందలకు పైగా ఉండే ఇక్కడి జనాభాలో మహిళలే ఎక్కువ కాగా, అధికారం మొత్తం వారి చేతిలోనే ఉంటుందట. ఇక్కడి మగవారు నెలల తరబడి చేపల వేటకు వెళ్లడం వల్ల పిల్లల ఆలనా పాలనా దగ్గర నుండి వూరిలోని అన్ని విషయాలను మహిళలే చూసుకుంటారు. అందుకే ఈ ప్రాంతం సంస్కృతీ సంప్రదాయాలతో అలరారుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి 'కిహ్ను'ని మాటలకందని వారసత్వ సంపదగా అభివర్ణించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్