Published : 11/01/2023 21:03 IST

మెనోపాజ్.. ఇవి తెలుసుకోండి..!

మెనోపాజ్.. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి సూచన. ప్రతి ఆడపిల్లా పుట్టినప్పుడు దాదాపు పది నుంచి ఇరవై లక్షల అండాలతో పుడుతుంది. ఇవి రోజులు గడిచే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. రుతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి మూడు నుంచి నాలుగు లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇలా ప్రతి నెలా కొన్ని అండాలు విడుదలవుతూ, మెనోపాజ్ నాటికి ఈ నిల్వ పూర్తిగా తరిగిపోతుంది. తర్వాత అండాశయాల నుంచి ఇక అండం విడుదల కాదు. దాంతో పాటే హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది.

మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే ఈ మార్పులు ప్రారంభమవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగానే తగ్గుతుంది. ఆ సమయంలో పిట్యూటరీ గ్రంథి నుంచి గొనడోట్రోపిన్ లాంటి హార్మోన్ల విడుదల ఎక్కువై శారీరకంగా మార్పులు జరుగుతాయి. దాంతో మెనోపాజ్ దశకు చేరుకుంటారు. సాధారణంగా 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది. మెనోపాజ్ సగటు వయసు 51 సంవత్సరాలు. అలాకాకుండా మెనోపాజ్ మరీ 40 కంటే ముందే వస్తే దాన్ని 'ప్రిమెచ్యూర్ మెనోపాజ్' అంటారు.

ఈ లక్షణాలతో..

మెనోపాజ్‌ని ఎలా గుర్తించాలి? ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటి ద్వారా మెనోపాజ్ దశకు చేరుకున్నామని గుర్తించొచ్చు. వీటిల్లో కొన్ని లక్షణాలు ఒక్కసారిగా దాడి చేస్తే మరికొన్ని ఆలస్యంగా మొదలవుతాయి. వెంటనే, ఉన్నట్టుండి మొదలయ్యే లక్షణాల్లో.. శరీరమంతా లేదా కొన్ని భాగాల్లో అంటే తల, మెడ, ఛాతీ దగ్గర చర్మం అంతా కందిపోయినట్టు ఎర్రగా తయారవుతుంది. ఈ భాగాల్లో చాలా వేడిగా కూడా ఉంటుంది. చెమటలు కారిపోతూ ఉంటాయి. వీటిని 'హాట్ ఫ్లషెస్' అంటాం.. నిద్రలోనూ చెమటలు పట్టి, పక్కంతా తడిసిపోయి ఉన్నట్టుండి మెలకువ వచ్చేస్తుంది. ఇలా ఎక్కువసార్లు జరగడం వల్ల దాని ప్రభావం దినచర్యపై పడి చిరాకు, కోపం, అసహనం లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఓ రకంగా చూస్తే ఇది మొదటి లక్షణం.. ఈ లక్షణాలు మరీ విపరీతంగా ఉన్నప్పుడు డాక్టర్లు ఈస్ట్రోజెన్ హార్మోన్‌ని సూచిస్తారు. అయితే కొన్ని సంవత్సరాల ముందు నుంచే ప్రాణాయామం, ధ్యానం, యోగా లాంటివి చేసే వారిలో ఈ లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి.

నెలసరిలో తేడా..

మెనోపాజ్‌ని సూచించే మరో లక్షణం నెలసరిలో తేడా.. మెనోపాజ్‌కు ఏడాది, రెండేళ్ల ముందు నుంచీ నెలసరి క్రమం తప్పుతుంది. కొన్నిసార్లు త్వరగా వచ్చేస్తే, మరికొన్నిసార్లు ఆలస్యంగా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా రక్తస్రావం మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఒక పద్ధతంటూ లేకుండా వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఒకటి, రెండు నెలలు నెలసరి రాకపోయేసరికి ఒక్కోసారి గర్భం అనుకొని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి తేడాలుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

వాటి పైనా..

మెనోపాజ్ ప్రభావం మూత్రవ్యవస్థ, జననేంద్రియాల పైన కూడా పడుతుంది. ఎందుకంటే మెనోపాజ్ ముందు వరకు యోని, మూత్రనాళం, మూత్రకోశాల్లో ఈస్ట్రోజెన్ రిసెప్టర్లు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజెన్ తగ్గుతుందో అప్పుడు ఆ కణజాలం బలహీనమై, పొడిబారిపోతుంది. అదే అసౌకర్యానికి, మంటకు దారితీస్తుంది. ఇక మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి వంటివి సాధారణంగా వచ్చే సమస్యలే.. వైద్యుల సలహాతో వీటిని తగ్గించుకోవచ్చు.

ఈ సమస్యలు సైతం..

అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.

ఎముక లోపల క్యాల్షియం, విటమిన్ 'డి' నిల్వలు తగ్గి అవి బలహీనంగా మారతాయి. ఎముకలు క్రమంగా గుల్లబారి మెత్తగా తయారవుతాయి. కొన్నిసార్లు ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం, చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్లు కావడం లాంటివి ఆస్టియోపొరోసిస్‌ను సూచిస్తాయి. ఎముకల సాంద్రత తగ్గకుండా ఈస్ట్రోజెన్‌తో పాటు క్యాల్షియం, విటమిన్ 'డి' తీసుకోవాలి. ఒకవేళ ఎముకల బలం విపరీతంగా తగ్గితే వాటిని పెంచేందుకు వైద్యులు మందులు సూచిస్తారు.

మెనోపాజ్ ప్రభావం మానసిక ఆరోగ్యం పైనా పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మగవారితో పోలిస్తే ఆడవారిలో అల్జీమర్స్ సమస్య ఎక్కువని తేలింది. ఈస్ట్రోజెన్‌కి నాడీ వ్యవస్థను కాపాడే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్ స్థాయి తగ్గుతుందో సమస్య మొదలవుతుంది. అలాగే కండరాలు కూడా బలహీనమైపోతాయి.

మెనోపాజ్ వచ్చే వరకు స్త్రీలలో గుండెపోటు చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులతో సమానంగా మహిళలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే అప్పటివరకు ఈస్ట్రోజెన్ గుండెను, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదీ కాక యాభై దాటిన తర్వాత రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అవి సన్నగా మారిపోతాయి.

ఈ క్రమంలో మెనోపాజ్ లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదిస్తే వారి సలహాలు, సూచనలతో జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యకరంగా గడపచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని