Published : 24/12/2022 13:03 IST

మెనోపాజ్.. లైఫ్‌స్టైల్ మార్పులతో..!

మెనోపాజ్.. చాలామంది దీనిని ఒక సమస్యగా భావిస్తారు. అయితే వయసు పైబడుతున్నప్పుడు ఎదురయ్యే కొన్ని సమస్యల గురించి హెచ్చరించే ఒక సూచన లాంటిది ఈ దశ. ఈక్రమంలో మెనోపాజ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, జీవనశైలి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలోనూ ఆనందంగా గడపడం అసాధ్యం కాదు..

మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే జీవనశైలి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:

⚛ ఈ సమయంలో సోయాబీన్స్, బీన్స్ జాతి గింజలు, వాటితో దొరికే ఇతర పదార్థాలు, ఎక్కువగా తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి.

⚛ యాంటీ క్యాన్సర్ పదార్థాలుగా పరిగణించే టొమాటో, గుమ్మడి, క్యారట్, బొప్పాయి లాంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

⚛ జ్ఞాపక శక్తి కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే అవిసె గింజలు, డ్రైఫ్రూట్స్, చేపల్ని తరచుగా తినాలి. ఫైబర్, ప్రొటీన్లుండే పదార్థాలను ఎక్కువగా ఎంచుకోవాలి. అదే సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, జంక్‌ఫుడ్, ప్రిజర్వేటివ్స్ కలిపినవి తగ్గించాలి.

⚛ వ్యాయామం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా కండరాలు బలహీనపడకుండా ఉంటాయి. అలాగే ఎముకలకు క్యాల్షియం చేరేలా చేయడంలోనూ వ్యాయామం పాత్ర చాలా కీలకం. రోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఎముకల్లోకి క్యాల్షియం చేరుతుంది. అలాగే రక్తప్రసరణ కూడా చక్కగా జరిగి.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

⚛ ఏదైనా సరే దీర్ఘకాలం పాటు వాడకపోతే, అది పనిచేయడం మానేస్తుంది. ఈ మాట మన మెదడుకు చక్కగా వర్తిస్తుంది. మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే కొన్ని చికాకులతో కొంతమంది నిర్లిప్తంగా మారిపోతుంటారు. ఇలా కావడం వల్ల మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. దాన్ని అధిగమించాలంటే మెదడుకు కూడా తగినంత పని చెప్పాలి. చురుగ్గా ఉండాలి. అలాంటప్పుడే మానసిక ఆరోగ్యం మన సొంతమవుతుంది.

⚛ మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని నిర్ధరించుకోవడం కూడా ఈ సమయంలో ముఖ్యమే.. దీనికోసం చేయించుకోవాల్సిన పరీక్షలు కొన్నున్నాయి. 40 సంవత్సరాలు వచ్చిన దగ్గర్నుంచి మమోగ్రామ్, పాప్‌స్మియర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్ టెస్ట్, బీపీ చెకప్.. లాంటివి చేయించుకుంటూ ఉండాలి. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఐదేళ్లకోసారి బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేయించుకోవాలి..

ఈ విధంగా జీవనశైలిలో కొన్ని మార్పులు పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ దశలోనూ మామూలుగానే ఉండటానికి అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని