Menstrual Hygiene: ప్యాడ్స్ ఇలా వాడితే ఇన్ఫెక్షన్లు తప్పవట!
నెలసరి సమయంలో తలెత్తే దుష్ప్రభావాల వల్ల మహిళలు ఒక రకమైన అసహనానికి గురవడం సహజం. అయితే వేసవి ఉక్కపోత కారణంగా ఈ సమస్యలు మరింత ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా జననేంద్రియాల వద్ద ఇన్ఫెక్షన్ ఈ కాలంలో ఎక్కువగా....
నెలసరి సమయంలో తలెత్తే దుష్ప్రభావాల వల్ల మహిళలు ఒక రకమైన అసహనానికి గురవడం సహజం. అయితే వేసవి ఉక్కపోత కారణంగా ఈ సమస్యలు మరింత ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా జననేంద్రియాల వద్ద ఇన్ఫెక్షన్ ఈ కాలంలో ఎక్కువగా వేధిస్తుంటుంది. ఇందుకు చెమట ఒక్కటే కాదు.. మనం వాడే శ్యానిటరీ న్యాప్‌కిన్లు కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఇది క్రమంగా తీవ్ర అనారోగ్యాలకు, ప్రత్యుత్పత్తి సమస్యలకు దారితీస్తుందంటున్నారు. అందుకే శ్యానిటరీ ప్యాడ్స్ వాడే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోమని సలహా ఇస్తున్నారు. ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..
వేసవిలో అధిక చెమట కారణంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లు ఉపయోగించే క్రమంలో వెజైనా దగ్గర దురద, మంట.. వంటి సమస్యలు ఎక్కువమంది ఎదుర్కొంటుంటారు. దీంతో పాటు శ్యానిటరీ ప్యాడ్స్ వాడే విషయంలో కొంతమంది అలక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇది కాస్తా వెజైనల్ ఇన్ఫెక్షన్లకు, ఇతర తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇలా జరగకూడదంటే వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించడమెలాగో తెలిసుండాలంటున్నారు నిపుణులు.
పరిమళం కాదు.. నాణ్యత ముఖ్యం..!
ఈ కాలంలో ఏ వస్తువు తయారీలోనైనా పరిమళం ఉపయోగించడం కామనైపోయింది. శ్యానిటరీ ప్యాడ్స్, ట్యాంపూన్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. సువాసన భరితంగా ఉంటాయని, దీనివల్ల నెలసరి సమయంలో రక్తస్రావం వల్ల వెలువడే దుర్వాసన బయటికి వెదజల్లకుండా సౌకర్యవంతంగా ఉండచ్చని చాలామంది వీటిని ఎంచుకుంటున్నారు. ఈ పొరపాటే వెజైనల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలాంటి ప్యాడ్స్ తయారీలో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటుంది.. పైగా వాటి నాణ్యత కూడా అంతంతమాత్రమే! కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టి మంచి నాణ్యతతో కూడిన పర్యావరణహిత ప్యాడ్స్‌ని ఎంచుకోవడం మంచిది.
నాలుగైదు గంటలకోసారి..!
వెజైనల్ ఇన్ఫెక్షన్లకు మరో కారణం.. గంటల తరబడి ఒకే శ్యానిటరీ ప్యాడ్ వాడడం. బ్లీడింగ్ తక్కువగా ఉందనో, బద్ధకించో, ప్యాడ్ నిండలేదనో.. ఇలా పలు కారణాల వల్ల ఒకే ప్యాడ్‌ను ఎక్కువ సమయం ఉపయోగిస్తుంటారు కొంతమంది. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. రక్తస్రావంతో పనిలేకుండా కనీసం నాలుగైదు గంటలకోసారి ప్యాడ్‌ని మార్చుకోవడం అత్యుత్తమం అని చెబుతున్నారు. ఒకవేళ మరీ తక్కువ బ్లీడింగ్ అవుతున్నట్లయితే రోజుకు రెండు ప్యాడ్ల చొప్పున మార్చుకోవడం మాత్రం తప్పనిసరి! అంతేకానీ.. రోజంతా ఒకే ప్యాడ్ వినియోగిస్తామంటే మాత్రం ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర దుష్ప్రభావాలూ ఎదుర్కోక తప్పదు.
శుభ్రం చేసుకుంటున్నారా?
ఇక పిరియడ్స్ సమయంలో.. ప్యాడ్ మార్చుకున్న ప్రతిసారీ జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడం మరీ మంచిది. తద్వారా అక్కడి బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు తొలగిపోయి వెజైనల్ ఇన్ఫెక్షన్లకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. మామూలు వేళల్లోనూ వెజైనా భాగాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకు అవసరమైతే నిపుణుల సలహా మేరకు క్లెన్సర్లను కూడా ఎంచుకోవచ్చు. ఆ తర్వాత చేతుల్నీ శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి?
వెజైనా దగ్గర దురద, మంట, వైట్ డిశ్చార్జి.. వంటివి అప్పుడప్పుడూ సహజం. అయితే తరచూ ఈ సమస్యలొస్తున్నాయంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. దుర్వాసనతో కూడిన డిశ్చార్జి, పసుపు-ఆకుపచ్చ వంటి రంగుల్లో డిశ్చార్జి కావడం.. వంటివి సీరియస్‌గా పరిగణించాలంటున్నారు. అలాగే నెలసరి సమయంలో శుభ్రత కొనసాగించినా వెజైనా దగ్గర మంట, దురద.. వంటివి పదే పదే తలెత్తినా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెజైనల్ ఇన్ఫెక్షన్‌గా పరిగణించి డాక్టర్‌ని సంప్రదించాలి. తద్వారా సమస్యేంటో త్వరగా తెలుసుకొని చికిత్స తీసుకునే వీలుంటుంది.
ఇవి గుర్తుపెట్టుకోండి!
⚛ నెలసరి సమయంలో ఉపయోగించేందుకు వీలుగా ప్రస్తుతం ప్రత్యేకమైన ‘పిరియడ్ ప్యాంటీస్’ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఈ సమయంలో ఉపయోగించచ్చు. మిగతా రోజుల్లో సాధారణ లోదుస్తులు వాడుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
⚛ కొంతమంది వాడిన శ్యానిటరీ ప్యాడ్స్‌ని టాయిలెట్‌లో పడేసి ఫ్లష్ చేస్తుంటారు. దీనివల్ల బ్యాక్టీరియా మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని టాయిలెట్ పేపర్‌లో చుట్టి.. చెత్తడబ్బాలో పడేయాలి. లేదంటే ప్యాడ్ డిస్పెన్సర్ మెషీన్ ఏర్పాటు చేసుకుంటే ఎప్పటికైనా పనికొస్తుంది. ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే పర్యావరణహిత ప్యాడ్స్‌ని వాడితే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది.
⚛ మెన్‌స్ట్రువల్ కప్స్ వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే వాటిని సరైన విధానంలో ఉపయోగించడం, నిర్ణీత వ్యవధుల్లో శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.