Published : 02/01/2022 13:45 IST

ఈ పుదీనా ప్యాక్స్‌తో అందంగా మెరిసిపోదాం!

పుదీనా ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అందిస్తుంది. దీనికి ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు కలిపితే.. చర్మాన్ని మెరిపించే ప్యాక్స్‌ తయారుచేసుకొని అప్లై చేసుకోవచ్చు. మరి, ఏంటా ప్యాక్స్‌? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? రండి తెలుసుకుందాం..

మచ్చలు పోతాయి..

మొటిమలు, దోమకాటు వల్ల ఏర్పడే మచ్చలను నివారించడానికి పుదీనా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను ముద్దలా చేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి.. సమస్య ఉన్న చోట రాస్తే ఫలితం కనిపిస్తుంది.

నల్లటి వలయాలు మాయం..

పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడతాయి. ఇది రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది. కంటి కింద నల్లటి వలయాలూ తగ్గుతాయి.

గ్రీన్‌టీతో..

పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్‌ టీ వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని చేతులు, మెడకు పూతలా వేస్తే.. కాలుష్యం కారణంగా పేరుకున్న మురికి వదులుతుంది. చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

జిడ్డు చర్మతత్వానికి..

ముల్తానీ మట్టిలో సరిపడా పుదీనా రసం కలపాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు వారంలో రెండుసార్లు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

సహజ మాయిశ్చరైజర్‌గా..

పెరుగు, పుదీనా ఆకుల మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటే.. చర్మం తేమను సంతరించుకుంటుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది.

గులాబీ నీరు, తేనె, పుదీనా ఆకులతో తయారుచేసిన మిశ్రమాన్ని మొటిమలపై రాసి.. మర్దన చేసుకుంటే అవి తగ్గుముఖం పడతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని