విశ్వ సుందరికి లభించే సౌకర్యాలేంటో తెలుసా?

ప్రపంచంలో రకరకాల అందాల పోటీలు జరుగుతుంటాయి. అయితే వాటిలో మిస్ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌, మిస్ ఇంటర్నేషనల్‌, మిస్ ఎర్త్‌ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ పోటీలు జరుగుతున్నంతసేపు చాలామంది కళ్లు దీని పైనే ఉంటాయి. ఈ క్రమంలో తమ దేశానికి చెందిన అమ్మాయి కిరీటాన్ని దక్కించుకోవాలని ఆశిస్తుంటారు.

Updated : 18 Dec 2021 12:52 IST

ప్రపంచంలో రకరకాల అందాల పోటీలు జరుగుతుంటాయి. అయితే వాటిలో మిస్ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌, మిస్ ఇంటర్నేషనల్‌, మిస్ ఎర్త్‌ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ పోటీలు జరుగుతున్నంతసేపు చాలామంది కళ్లు దీని పైనే ఉంటాయి. ఈ క్రమంలో తమ దేశానికి చెందిన అమ్మాయి కిరీటాన్ని దక్కించుకోవాలని ఆశిస్తుంటారు. అందాల పోటీల విజేతలు పేరు ప్రఖ్యాతులతో పాటు ఇతరత్రా అనేక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఇవి మరొకరిని విజేతగా ప్రకటించేంతవరకు కొనసాగుతుంటాయి. ఈ క్రమంలో- తాజా ‘విశ్వ సుందరి’ హర్నాజ్ సంధు ఎలాంటి ప్రయోజనాలు పొందనుందో తెలుసుకుందాం..

దాదాపు 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంజాబ్‌ సుందరి హర్నాజ్‌ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో- మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్ విజేతకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తుంది. 

* విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచినప్పుడు తొడిగే కిరీటం ఎంతో విలువైనది. మన కరెన్సీలో దీని ధర దాదాపు 38 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ కిరీటాన్ని ‘ది పవర్‌ ఆఫ్‌ యూనిటీ’గా పిలుస్తుంటారు. దీనిని సుమారు 18 క్యారట్ల బంగారం, 1725 తెలుపు వజ్రాలు, 3 గోల్డెన్‌ కెనరీ డైమండ్స్‌తో రూపొందించారు. కిరీటం మధ్యలో బంగారపు షీల్డ్‌తో రూపొందించిన డైమండ్‌ ఉంటుంది. దీని బరువు 62.83 క్యారట్లు ఉంటుంది. అయితే ఈ కిరీటాన్ని పూర్తిగా సొంతం చేసుకునే అవకాశం మాత్రం విజేతలకు ఉండదు. తదుపరి ఏడాది విజేతను ప్రకటించే వరకు వివిధ కార్యక్రమాల్లో దీనిని ధరించే అవకాశం మాత్రమే ఉంటుంది. 

* విశ్వసుందరికి న్యూయార్క్‌ నగరంలో మిస్‌ యూనివర్స్‌ అపార్ట్‌మెంట్స్‌లో సంవత్సరం పాటు ఉచిత నివాస సౌకర్యం కల్పిస్తారు. ఆమెతో పాటు మిస్ యూఎస్‌ఏ కూడా ఆ అపార్ట్‌మెంట్లో ఉంటుంది. ఈ అపార్ట్‌మెంట్లో ఉన్న సమయంలో గ్రాసరీ నుంచి బట్టల వరకు అన్నీ ఉచితంగా అందిస్తారు.

* మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ విజేతకు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, సహాయకులతో కూడిన బృందాన్ని ఉచితంగా నియమిస్తుంది. ఈ బృందాన్ని విశ్వసుందరి తనకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో మేకప్‌కు కావాల్సిన ఉత్పత్తులు, బట్టలు, ఆభరణాలు, షూలు.. ఇలా ప్రతి ఖర్చూ ఆ సంస్థే భరిస్తుంది.

* ఇదేవిధంగా విశ్వసుందరి కోసం ఆ సంస్థ ప్రొఫెషనల్ స్టైలిస్ట్, న్యూట్రిషనిస్ట్, డెర్మటాలజిస్ట్‌, డెంటిస్ట్‌లను సైతం నియమిస్తుంటుంది.

* మిస్‌ యూనివర్స్‌గా గెలిచిన వారిలో చాలామంది మోడలింగ్‌ రంగం వైపు వెడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ నిపుణులైన ఫొటోగ్రాఫర్‌ని వారికోసం నియమిస్తుంటుంది. మోడలింగ్‌లో రాణించాలనుకునే వారు వీరి సేవలను ఉపయోగించుకోవచ్చు.

* కిరీటం సొంతం చేసుకున్న వారు మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌కు సంవత్సరం పాటు చీఫ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతారు. ఈ క్రమంలో కొన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా సంస్థ నిర్వహించే సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, ప్రెస్‌ కాన్ఫరెన్సులకు హాజరవ్వాల్సి ఉంటుంది.

* విశ్వసుందరిగా నిలిచిన వారు సంవత్సరం పాటు ఉచితంగా ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఈ సమయంలో హోటల్, రెస్టరంట్ల ఖర్చులను కూడా ఆ సంస్థే భరిస్తుంటుంది.

* వీరికి ఆరంకెల జీతం కూడా లభిస్తుందనే వార్తలున్నాయి. కానీ, వీటిని మిస్‌ యూనివర్స్‌ సంస్థ ఎప్పుడూ ధృవీకరించలేదు.

* మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన వారికి దాదాపు 1.8 కోట్ల రూపాయల ప్రైజ్‌ మనీ కూడా లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్