51 ఏళ్ల తర్వాత తిరిగి అలా ఒక్కటయ్యారు.. ఇదీ ఓ సినిమా కథే..!

తమ కలల చిన్నారి ఈ భూమి పైకి వచ్చిందంటే దంపతుల ఆనందానికి హద్దులు ఉండవు. ఆ చిన్నారిని ఇంటికి ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకొంటారు.. ఎలాంటి కష్టం రాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారి బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటారు. అలాంటి సమయంలో ఆ చిన్నారిని ఎవరో

Published : 30 Nov 2022 20:21 IST

(Photos: Facebook)

తమ కలల చిన్నారి ఈ భూమి పైకి వచ్చిందంటే దంపతుల ఆనందానికి హద్దులు ఉండవు. ఆ చిన్నారిని ఇంటికి ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకొంటారు.. ఎలాంటి కష్టం రాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారి బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటారు. అలాంటి సమయంలో ఆ చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధను మాటల్లో వర్ణించలేం. అమెరికాకు చెందిన ఓ జంట సరిగ్గా ఇలాంటి బాధనే అనుభవించారు. తమ బిడ్డ ఆచూకీ కోసం శతవిధాలుగా ప్రయత్నించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 51 సంవత్సరాలు ఈ వెతుకులాట కొనసాగింది. పట్టు వదలకుండా చేసిన వారి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అప్పుడు తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారి 5 దశాబ్దాల తర్వాత, 53 ఏళ్ల మహిళగా ఇప్పుడు తిరిగి తన కుటుంబంతో కలిసింది. అందరిలోనూ ఆనందం నింపింది.. మరి ఆ కథేంటో చూద్దామా..!

అదే చివరిసారి..!

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అల్టా, జెఫ్రీ దంపతులకు పలు ప్రయత్నాల తర్వాత ఆడపిల్ల జన్మించింది. ఆమెకు ముద్దుగా మెలిస్సా హైస్మిత్ అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం రావడంతో అల్టా బిజీగా మారిపోయింది. ఆఫీసుకు వెళ్లినప్పుడు మెలిస్సా సంరక్షణ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఒక బేబీ సిట్టర్ని నియమించుకుంది. అయితే మొదట్లో నమ్మకంగానే పనిచేసిన ఆ మహిళ ఒకరోజు పాపను తీసుకుని ఎటో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే అల్టా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆచూకీ లభించలేదు. అప్పటినుంచి మెలిస్సా కోసం ఆ కుటుంబం వెతుకుతూనే ఉంది. ఈ ఘటన జరిగే సమయానికి మెలిస్సా వయసు కేవలం 21 నెలలు మాత్రమే.

పుట్టినరోజు వేడుకలు ఆగలేదు..

అల్టా, జెఫ్రీలు ఆ రోజు నుంచి మెలిస్సా ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఒకవైపు పోలీసులు మెలిస్సా కోసం గాలిస్తున్నా.. సొంతంగా వాళ్లిద్దరూ కూడా తమ బిడ్డ ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా వారికి మాత్రం మెలిస్సా జాడ దొరకలేదు. తమ ముద్దుల చిన్నారిని మర్చిపోలేని ఆ జంట ఏటా ప్రతి నవంబర్‌లో తన పుట్టినరోజు వేడుకలు జరిపేవారు. ఆ కుటుంబం వేరే ప్రాంతానికి మారినా మెలిస్సా ఆచూకీ ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. మెలిస్సా సోదరుడు జెఫ్‌ హైస్మిత్‌ తనని వెతకడం కోసం ఒక ప్రైవేట్‌ ఇన్వెస్టిగేటర్‌ని సైతం నియమించాడు. ఈ క్రమంలో అతను ఇందుకోసం  ప్రత్యేకంగా ‘Help find Melissa Highsmith’ పేరిట ఒక ఫేస్‌బుక్ పేజీని కూడా క్రియేట్ చేశాడు. ఈ పేజీలో దాదాపు 6500 మంది సభ్యులు చేరారు.

జన్యు పరీక్ష ద్వారా...

జెఫ్‌ ప్రయత్నానికి కొన్ని సంవత్సరాల తర్వాత స్పందన వచ్చింది. ఆ అమ్మాయిని నేనేనంటూ ముగ్గురు యువతులు జెఫ్‌ని సంప్రదించారు. దాంతో అల్టా కుటుంబంలో ఆశలు చిగురించాయి. కానీ, వారికి జన్యు పరీక్ష చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. వారిలో ఒక్కరు కూడా మెలిస్సా కాదని తేలింది. అయినా వారి ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఈ క్రమంలో- డీఎన్‌ఏలు సేకరించి తమ పూర్వీకుల వివరాలు తెలిపే ఓ వెబ్‌సైట్ సహాయంతో వారికి ఓ అమ్మాయి జాడ గురించి తెలిసింది. చివరికి పోలీసులు కూడా ఆ అమ్మాయినే మెలిస్సాగా నిర్ధారించడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. అయితే మొదట మెలిస్సా ఇదంతా ఒక స్కామ్‌ అని భావించింది. దాంతో ఆ కుటుంబ సభ్యులు ఆమె చిన్నప్పటి ఫొటోని చూపించారు. ఆమె తన దగ్గర ఉన్న ఫొటోతో సరిచూసుకుంది. రెండూ ఒకేలా ఉండడంతో తను కన్న తల్లిదండ్రులకు దగ్గరైంది. ఈ క్రమంలో ‘ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. నా మనసు భావోద్వేగాలతో నిండిపోయింది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నా’ అని చెప్పుకొచ్చింది. దాంతో ఆ ఫేస్‌బుక్‌ పేజీ పేరుని కూడా ‘We Found Melissa’గా మార్చారు.

ఇంటి నుంచి పారిపోయి...

కుటుంబం నుంచి దూరమైన మెలిస్సా దుర్భరమైన జీవితాన్ని అనుభవించింది. ఆ బేబీసిట్టర్‌ తనను మరో మహిళకు 500 డాలర్లకు అమ్మేసింది. ఆమె దగ్గరే మెలిస్సా.. మెలనీ వాల్డెన్‌గా పెరిగింది. అయితే వారు హింసించడంతో మంచి జీవితం వెతుక్కోవడం కోసం 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి పారిపోయింది. 20 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు సంతానం. అయితే వివిధ కారణాల వల్ల ఆ ముగ్గురిని ఆమె వేరేవారికి దత్తత ఇచ్చింది. ఆ తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లింది. ఈ క్రమంలో ప్రార్ధనా స్థలాలను శుభ్రపరచడం, చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ద్వారా జీవనం సాగించేది. 50 ఏళ్ల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని కలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మెలనీ వాల్డెన్‌గా కొనసాగిన ఆమె ఇకముందు మాత్రం మెలిస్సాగానే ఉంటానని అంటోంది.

వీరికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ఒక్కటైన ఈ కుటుంబానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజానికి ఇది కూడా ఓ సినిమా కథనే తలపిస్తోంది కదూ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్