Summer Tips: జిడ్డు చర్మం మరింత జిడ్డుగా మారుతోందా?

అసలే ఎండాకాలం.. చర్మాన్ని ఎంత జాగ్రత్తగా సంరక్షించుకున్నా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా జిడ్డు చర్మతత్వం ఉన్న అమ్మాయిలు ఈ కాలంలో మరిన్ని తిప్పలు....

Published : 09 May 2023 20:23 IST

అసలే ఎండాకాలం.. చర్మాన్ని ఎంత జాగ్రత్తగా సంరక్షించుకున్నా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా జిడ్డు చర్మతత్వం ఉన్న అమ్మాయిలు ఈ కాలంలో మరిన్ని తిప్పలు పడుతుంటారు. ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా తమ చర్మం పదే పదే జిడ్డుగా మారుతోందని బాధపడిపోతుంటారు. నిజానికి మనం చేసే కొన్ని పొరపాట్లే జిడ్డు చర్మాన్ని మరింత జిడ్డుగా మారేలా చేస్తున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌.. వంటి సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే ఆ పొరపాట్లేంటో తెలుసుకొని వాటిని సరిచేసుకుంటే జిడ్డు చర్మం ఉన్న వారు కూడా ఈ వేసవిలో ఇబ్బంది పడకుండా ఉండచ్చని చెబుతున్నారు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి...

నీళ్లు సరిగ్గా తాగట్లేదా?!

మన శరీరంలోని సెబేషియస్ గ్రంథులు విడుదల చేసే సీబమ్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అయితే అది మరింత ఎక్కువగా ఉత్పత్తయితే మాత్రం చర్మం మరింత జిడ్డుగా మారుతుందంటున్నారు నిపుణులు. మనం సరైన మొత్తంలో నీళ్లు తాగకపోయినా సీబమ్‌ అధికంగా విడుదలవుతుందట! అదెలాగంటే.. మన శరీరానికి సరిపడా నీరు అందనప్పుడు శరీరం తగిన నీటి స్థాయుల కోసం సెబేషియస్ గ్రంథులపై ఆధారపడుతుంది. తద్వారా అవసరానికి మించి సీబమ్‌ ఉత్పత్తవుతుంది. ఇది జిడ్డు చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చుతుంది. కాబట్టి ఇలా జరగకూడదంటే ఎవరికి వారు బరువును బట్టి సరిపడా మోతాదులో నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

ఈ నూనెల వల్లే..!

అందంలో అత్యవసర నూనెల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని ఎసెన్షియల్‌ నూనెలు జిడ్డు చర్మాన్ని బ్యాలన్స్‌ చేసి.. మొటిమలు, అలర్జీ.. వంటి ఇతర సౌందర్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తే.. మరికొన్ని నూనెలు మాత్రం ఈ జిడ్డుదనాన్ని మరింతగా పెంచుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనె కూడా ఈ రెండో కోవకు చెందుతుందట! అందుకే ఈ సమస్య ఉన్న వారు రోజువారీ పాటించే సౌందర్య చికిత్సల్లో కొబ్బరి నూనెను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు. అలాగే దీన్ని జుట్టుకు పట్టించినా.. జుట్టు కూడా మరింత జిడ్డుగా మారుతుంది. కాబట్టి జిడ్డు సమస్య మరీ ఎక్కువగా ఉన్న వారు మాత్రం కొబ్బరికి బదులుగా రోజ్‌మేరీ, జెరానియం.. వంటి అత్యవసర నూనెల్ని ఉపయోగిస్తే.. సీబమ్‌ ఉత్పత్తి అదుపులో ఉంటుంది. ఫలితంగా చర్మం మరింత జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడచ్చు.

మాయిశ్చరైజర్‌ ఇలా!

జిడ్డు చర్మతత్వం ఉన్న వారు మాయిశ్చరైజర్‌ రాసుకుంటే చర్మం మరింత జిడ్డుగా మారుతుందని దాన్ని ఉపయోగించడమే మానేస్తుంటారు. కానీ ఇది కూడా చర్మం మరింత జిడ్డుగా మారేందుకు దోహదం చేస్తుందట! అలాగే ఒక చర్మతత్వం ఉన్న వారు మరో చర్మతత్వానికి సంబంధించిన మాయిశ్చరైజర్‌ రాసుకున్నా ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు నిపుణులు. అందుకే చర్మతత్వాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవడమనేది చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే వేర్వేరు చర్మతత్వాలకు అనుగుణంగా ప్రత్యేకమైన మాయిశ్చరైజర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ కొనుగోలు చేయడం లేదంటే ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం.. వంటివి చేయచ్చు.

మేకప్‌ ఎక్కువైనా..!

కొంతమందికి వృత్తిలో భాగంగా మేకప్‌ వేసుకోక తప్పదు. మరికొంతమందికి రోజూ మేకప్‌తో తమ అందానికి మెరుగులు దిద్దుకోవడం ఒక అలవాటు. ఈ క్రమంలో కొంతమంది మరీ ఎక్కువగా మేకప్‌ వేసేసుకుంటుంటారు. జిడ్డు చర్మతత్వం గల వారు ఇలా అధిక మొత్తంలో మేకప్‌ వేసుకున్నా చర్మం మరింత జిడ్డుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదెలాగంటే మేకప్‌ వేసుకునే క్రమంలో చర్మ రంధ్రాలు మూసుకుపోవడంతో పాటు ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలవుతాయట! తద్వారా చర్మం మరింత జిడ్డుగా మారుతుందంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని