ఇంటికి ‘గాజు’ సోయగం!
ఇంటికి అందాన్నివ్వడంలో అలంకరణ వస్తువుల పాత్ర కీలకం! ఈ క్రమంలో గాజు వస్తువుల్ని ఎంచుకుంటుంటారు చాలామంది. అయితే గాజుతో చేసిన అలంకరణ వస్తువులే కాదు.. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి గాజును....
ఇంటికి అందాన్నివ్వడంలో అలంకరణ వస్తువుల పాత్ర కీలకం! ఈ క్రమంలో గాజు వస్తువుల్ని ఎంచుకుంటుంటారు చాలామంది. అయితే గాజుతో చేసిన అలంకరణ వస్తువులే కాదు.. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి గాజును వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..
టేబుల్ టాప్స్‌గా..!
సోఫా మధ్యలో టీపాయ్, డైనింగ్ టేబుల్, ల్యాప్‌టాప్ టేబుల్.. వంటివి మన అవసరాలు తీర్చడమే కాదు.. ఇంటికి అందాన్నీ జోడిస్తాయి. అయితే వీటిని గాజుతో అలంకరిస్తే ఆ అందం మరింత రెట్టింపవుతుంది. ఇందుకోసం మన ఇంట్లో ఉన్న టేబుల్ టాప్స్ ఆకృతి, పరిమాణానికి తగ్గట్లుగా టఫెండ్ గ్లాస్‌ను తయారుచేయించుకొని.. ఆయా ఉపరితలాలపై ఫిక్స్ చేయించుకోవాలి. ఈ క్రమంలో పారదర్శక గ్లాస్ నచ్చని వారు.. సోఫా/డైనింగ్ టేబుల్ ఛెయిర్స్ రంగులను పోలి ఉన్న గాజు మెటీరియల్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. అదీ కాదంటే వివిధ రకాల ప్రింట్లతో తయారుచేసిన గ్లాస్ మెటీరియల్ కూడా లభ్యమవుతోంది. వీటిలో మీకు నచ్చిన, మీ ఇంట్లో ఫర్నిచర్‌కు నప్పిన గాజును ఎంచుకుంటే ఇంటికి అదనపు హంగులద్దచ్చు. ఇక కొత్తగా కొనాలనుకునే వారు పూర్తిగా గాజుతో తయారుచేసిన టీపాయ్/కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్.. వంటివి ఎంచుకొని ఇంటికి పూర్తి మోడ్రన్ లుక్‌ని అందించచ్చు.
పార్టిషన్స్‌తో పర్‌ఫెక్ట్ లుక్!
ఇంట్లో పెద్దగా ఉన్న గదుల్ని విభజించుకోవడం కూడా ప్రస్తుతం ఓ ఇంటీరియర్ ట్రెండే! ఇందుకోసం వివిధ రకాల రెడీమేడ్ రూమ్ డివైడర్స్/రూమ్ పార్టిషన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ క్రమంలో చెక్కతో చేసినవి ఎంచుకునే వారే ఎక్కువ! కానీ గాజు పార్టిషన్స్ ఇంటికి సరికొత్త హంగులద్దుతాయంటున్నారు నిపుణులు. కావాలంటే చెక్క ఫ్రేములకు మధ్యలో గ్లాస్ ఫిక్స్ చేయించుకొని ప్రత్యేకంగా తయారుచేయించిన పార్టిషన్స్ ఉపయోగించచ్చు.. ఇలా పారదర్శకంగా ఉంటే నచ్చనివారు.. ప్రింటెడ్, స్టెయిన్‌డ్, ఫ్రోస్టెడ్ తరహాల్లో తయారుచేసిన గాజు మెటీరియల్‌ని ఎంచుకోవచ్చు. ఇవి పారదర్శకంగా ఉండవు సరికదా.. ఇంటిని కలర్‌ఫుల్‌గా మార్చేస్తాయి కూడా!
వార్డ్‌రోబ్ కోసం..!
ఇంటీరియర్ డిజైనింగ్‌లో కప్‌బోర్డ్స్ పాత్ర కీలకం! అందుకే కిచెన్ దగ్గర్నుంచి, క్రాకరీ, టీవీ యూనిట్, బెడ్‌రూమ్‌లో అమర్చుకునే కప్‌బోర్డ్స్ దాకా.. విభిన్న మెటీరియల్స్‌తో తయారుచేసిన క్యాబినెట్ డోర్స్ ఎంచుకుంటాం. వీటిలో చాలా వరకు లోపలి వస్తువులు బయటికి కనిపించకుండా ఉన్నవే ఎంపిక చేసుకుంటారు. కానీ పారదర్శకంగా ఉండాలని కోరుకునే వారు గాజు మెటీరియల్‌తో రూపొందించిన క్యాబినెట్స్‌ని ఎంచుకోవడం వల్ల గది అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సగం క్యాబినెట్స్ గాజుతో, మిగతా సగం చెక్క, పారదర్శకంగా లేని ఇతర మెటీరియల్‌తో డిజైన్ చేయించుకుంటే.. చూడ్డానికి లుక్ బాగుంటుంది.. వస్తువులన్నీ బయటికి కనిపించకుండానూ జాగ్రత్తపడచ్చు.
‘గాజు’ మాయాజాలం!
కిటికీలకు చాలామంది ఫ్రోస్టెడ్ తరహా గాజు మెటీరియల్‌ను ఎంచుకుంటుంటారు. దీనివల్ల లోపలి వస్తువులు, వ్యక్తులు బయటికి కనిపించకుండా ప్రైవసీని మెయింటెయిన్ చేయచ్చు.. పైగా ఇందులోనూ పువ్వులు, జామెట్రిక్ డిజైన్స్‌తో రూపొందించిన ఫ్రోస్టెడ్ గ్లాస్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాదు.. ఇదే విండో గ్లాస్‌తో ఇంటికి అదనపు హంగులద్దాలనుకునే వారు.. కిటికీ లోపలి వైపు రంగురంగుల ప్రింట్స్‌తో కూడిన స్టెయిన్‌డ్ తరహా గ్లాస్‌ను, బయటికి వైపు సాధారణ గ్లాస్‌ను ఎంచుకోవచ్చు.. అయితే ఈ రెండూ వేర్వేరు కాదు.. ఒకే గ్లాస్‌పై లోపలి వైపు ఒక ప్రింట్, బయటి వైపు మరో ప్రింట్ వచ్చేలా రూపొందిస్తారన్నమాట! తద్వారా గది కలర్‌ఫుల్‌గా కనిపించడంతో పాటు.. ప్రైవసీనీ కొనసాగించచ్చు.
సీలింగ్ కూడా!
ఫాల్స్ సీలింగ్ మనకు తెలుసు! చెక్క, పీఓపీ, జిప్సం.. వంటి మెటీరియల్స్‌తో విభిన్న డిజైన్లలో రూపొందించుకునే ఈ రూఫ్‌టాప్ ఇంటికి మోడ్రన్ లుక్‌ని తెచ్చిపెడుతుంది. అయితే ఇందులోనూ ఇంకాస్త ట్రెండీగా కావాలనుకునే వారు గాజు సీలింగ్‌ని ఎంచుకోవచ్చంటున్నారు నిపుణులు. పూర్తిగా గ్లాస్‌తోనే కాకుండా.. ఒక లేయర్‌ని గాజుతో డిజైన్ చేయించుకుంటే లుక్ అదిరిపోతుందంటున్నారు. ఇక అందులోనూ లైటింగ్ అమర్చుకుంటే.. గది మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనూ ప్లెయిన్, విభిన్న డిజైన్లతో కూడినవీ ఎంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.