అందుకే ఐటీ జాబ్ వదిలేసి.. వ్యాపారంలోకొచ్చా..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఓ టర్నింగ్‌ పాయింట్‌ ఉంటుంది. అదే తాము చేసిన పొరపాట్లేంటో తెలుసుకొనేలా చేస్తుంది. వాటి నుంచి రియలైజ్‌ అయ్యి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఊతమిస్తుంది. ఇలా తన జీవితంలోనూ ఓ టర్నింగ్‌ పాయింట్‌ ఉందంటోంది శ్రీదేవి ఆశల.

Published : 08 Jul 2024 12:13 IST

(Photos: Instagram)

ప్రతి ఒక్కరి జీవితంలో ఓ టర్నింగ్‌ పాయింట్‌ ఉంటుంది. అదే తాము చేసిన పొరపాట్లేంటో తెలుసుకొనేలా చేస్తుంది. వాటి నుంచి రియలైజ్‌ అయ్యి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఊతమిస్తుంది. ఇలా తన జీవితంలోనూ ఓ టర్నింగ్‌ పాయింట్‌ ఉందంటోంది శ్రీదేవి ఆశల. కెరీర్‌ బిజీలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఆమెకు ఒకానొక సమయంలో అబార్షన్‌ అయింది. ఈ సంఘటనే తన జీవితాన్ని మలుపు తిప్పిందంటోందామె. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల్ని తన లైఫ్‌స్టైల్లో భాగం చేసుకున్న ఆమె.. ఆపై ఇదే ఆలోచనతో చిన్నారుల కోసం హెల్దీ ఫుడ్స్‌ తయారుచేసే వ్యాపారం ప్రారంభించింది. ఉద్యోగం కంటే వ్యాపారమే ఎక్కువ సంతృప్తినిస్తుందంటోన్న శ్రీదేవి సక్సెస్‌ జర్నీ ఇది!

శ్రీదేవిది బెంగళూరు. చదువు పూర్తయ్యాక సుమారు 15 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ప్రముఖ కంపెనీల్లో పనిచేసిందామె. తన భర్త, ఆమె.. ఇద్దరూ కెరీర్‌ బిజీలో పడిపోయి.. ఇంట్లో వంట చేసుకొనే సమయమే ఉండేది కాదు వారికి! దీంతో ఎక్కువ శాతం బయటి ఆహారమే తీసుకునేవారు. ఈ నిర్లక్ష్యమే తన అబార్షన్‌కి కారణమైందంటోంది శ్రీదేవి.

అప్పుడు రియలైజయ్యా!

‘నాకు చిన్న వయసు నుంచి పోషకాహారం, హెల్దీ లైఫ్‌స్టైల్‌ గురించి అవగాహన ఉంది. కానీ ఉద్యోగంలో స్థిరపడ్డాక.. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా ఇంట్లో వండుకునే సమయం ఉండేది కాదు. దాంతో నేను, నా భర్త ఎక్కువ శాతం ప్యాకేజ్‌డ్‌ ఆహారం పైనే ఆధారపడేవాళ్లం. ఇదే నా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. నా అబార్షన్‌కి కారణమైంది. ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అప్పుడే రియలైజయ్యా. నిపుణుల సలహా మేరకు హెల్దీ లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకున్నా. ఈ క్రమంలోనే కొనే ప్రతి పదార్థం లేబుల్‌ని చదివేదాన్ని. అయితే ఇలా నేనొక్కదాన్నే కాదు.. నాలా ఉద్యోగాల్లో బిజీగా గడుపుతోన్న మహిళల్నీ ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల దిశగా ప్రోత్సహించాలనుకున్నా. ఇలా ఆలోచిస్తున్నప్పుడే.. ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌, రసాయనాలు లేకుండా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని తయారుచేసే వ్యాపారం ప్రారంభించాలన్న ఐడియా వచ్చింది. కానీ అటు ఉద్యోగం, ఇటు వ్యాపారం.. రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకోగలనా? అని తటపటాయించా. ఈ ఆలోచనలతో నెలలు గడిచిపోయాయి. ఈలోపే నా మొదటి పాప పుట్టడంతో చిన్నారి పోషణ పైకి మనసు మళ్లింది. అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఇక పాపకు ఘనాహారం ఇవ్వాలన్న సమయం వచ్చినప్పుడే మళ్లీ వ్యాపార ఆలోచన చేశా..’ అంటోంది శ్రీదేవి.

ఉద్యోగం వదిలి.. వ్యాపారంలోకి!

తన చిన్నారి ఘనాహారం కోసం మార్కెట్లో దొరికే పదార్థాల్ని పరిశీలించిన శ్రీదేవికి.. అందులో ప్రిజర్వేటివ్స్‌, రసాయనాల శాతమే ఎక్కువగా కనిపించింది. దాంతో తానే స్వయంగా ఉగ్గు తయారుచేసి తన చిన్నారికి తినిపించేది. కానీ రెండో పాప పుట్టాక.. ఇటు ఇద్దరు చిన్నారుల బాధ్యత, ఇంటి పనులు, కెరీర్‌.. వంటివన్నీ సమన్వయం చేసుకోవడం కష్టంగా మారిందంటోందామె.

 ‘మా పెద్ద పాపకి ఇంట్లోనే ఉగ్గు తయారుచేసి తినిపించేదాన్ని. కానీ రెండో అమ్మాయి పుట్టాక అంత సమయం నాకు దొరకలేదు. అలాగని బయట దొరికే ఉత్పత్తులపై ఆధారపడడం సరికాదనిపించింది. మరోవైపు బాధ్యతలూ పెరిగిపోవడంతో వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోలేకపోయా. అందుకే ఉద్యోగం వదిలి నేను గతంలో అనుకున్న ఫుడ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకున్నా. అది కూడా చిన్నారుల కోసం హెల్దీ ఫుడ్స్‌ తయారుచేస్తే నాలాంటి తల్లులెందరికో ఉపయుక్తంగా ఉంటుందనిపించింది. ఈ ఆలోచనే 2019లో ‘టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్‌’ పేరుతో సంస్థను ప్రారంభించేలా చేసింది. మొదటి ఏడాదంతా ఆయా ఆహార పదార్థాలు, వాటిలో ఉండే పోషకాలపై పరిశోధనలు చేశా. ఇందుకోసం ఇంట్లోనే చిన్న సైజు ప్రయోగశాలనూ ఏర్పాటుచేసుకున్నా..’ అంటోన్న ఈ మహిళా ఆంత్రప్రెన్యూర్‌.. తన సంస్థ వేదికగా ఏడాది దాటిన చిన్నారులకు ఆరోగ్యకరమైన రెడీ-టు- ఈట్ మిక్సెస్‌ను తయారుచేసి అందిస్తోంది.

మొలకలే ముడి పదార్థాలుగా!

ధాన్యాల్ని మొలకెత్తించడం వల్ల వాటిలోని పోషకాలు రెట్టింపవుతాయి. శరీరమూ వాటిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే ఇలా సహజసిద్ధంగా మొలకెత్తించిన ధాన్యాల్నే చిన్నారుల రెడీ-టు-మిక్సెస్‌ కోసం ముడి సరుకుగా ఉపయోగిస్తున్నానంటోంది శ్రీదేవి.

‘బయట దొరికే ఆహార పదార్థాల్లో పోషకాల శాతం పెంచడానికి వివిధ రకాల రసాయనాల్ని కలుపుతుంటారు. పిల్లల ఆహారోత్పత్తుల్లో ఇలాంటి పదార్థాలు దాదాపు 65 శాతం దాకా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి చిన్నారుల ఆరోగ్యానికి చేటు చేసేవే! అందుకే సహజసిద్ధంగానే వారి ఆహారాన్ని బలవర్ధకంగా మార్చాలనుకున్నా. ఈ క్రమంలోనే స్ప్రౌటింగ్‌ పద్ధతిని అనుసరిస్తున్నా. ఈ పదార్థాల కోసం నేను వాడే పప్పులు, కాయధాన్యాలు.. వంటివి ముందుగా మొలకలెత్తించి వాటితో ఫుడ్‌ మిక్సెస్‌ తయారుచేస్తున్నా. బ్రౌన్‌ రైస్‌, బఠానీ, ఓట్స్‌, రాగులు, బాదం పప్పులు, మిల్లెట్స్‌.. వీటన్నింటితో పాటు ఫ్లేవర్‌ కోసం పాలకూర, చిలగడ దుంప, పండ్లు.. వంటివి ఉపయోగిస్తున్నా. ప్రస్తుతం మా వద్ద ఈ రెడీ మిక్స్‌లతో పాటు మిల్లెట్‌ కుకీస్‌, మిల్లెట్‌ ప్యాన్‌కేక్‌ మిక్సెస్‌, హెల్త్‌ మిక్సెస్‌.. వంటివీ దొరుకుతున్నాయి. వీటిలో కొన్ని పెద్ద వాళ్లూ ప్రయత్నించచ్చు. అలాగే మేం తయారుచేసే ప్రతి ఉత్పత్తిలో పాలు, చక్కెర, ఉప్పు, కృత్రిమ రంగులు-ఫ్లేవర్స్‌, రసాయనాలు.. వంటివేవీ వాడం. ఏ పదార్థమైనా పూర్తి స్థాయిలో సహజసిద్ధంగా, ఆరోగ్యకరంగా తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం..’ అంటోందీ బిజినెస్‌ మామ్.

మనసు మాట వినాలి!

తన సంస్థ ద్వారా చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందిస్తోన్న శ్రీదేవి.. ఈ వేదికగా పలువురు మహిళలకూ ఉపాధి కల్పిస్తోంది. కెరీర్‌ బాధ్యతలతో బిజీగా గడిపే మహిళలకు ఈ హెల్దీ మిక్సెస్‌ బాగా ఉపయోగపడతాయంటోందామె.

‘ప్రస్తుతం నా వ్యాపారంలో కొత్తగా తల్లైన మహిళల్నే చేర్చుకున్నా. ఎందుకంటే పసి పిల్లల, చిన్నారుల ఆహార అవసరాలేంటో వాళ్లకే బాగా తెలుస్తాయి. అయితే వ్యాపారం ప్రారంభించిన కొత్తలో.. అప్పటికే మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్లతో పోటీపడుతూ వినియోగదారుల్ని ఆకట్టుకోవడం కాస్త సవాలుగా అనిపించింది. కానీ మా ఉత్పత్తుల్లోని నాణ్యత, సహజసిద్ధమైన తయారీ విధానమే పోటీని తట్టుకొని ముందుకు సాగేలా చేస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా మా ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నాం. అలాగే పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్‌తో హెల్దీగా కొన్ని స్నాక్స్‌ తయారుచేయడంపై దృష్టి సారించాం..’ అంటూ తన భవిష్యత్‌ లక్ష్యాల గురించి చెబుతోంది శ్రీదేవి. దాదాపు కోటిన్నర పెట్టుబడితో ప్రారంభించిన ఈ వ్యాపారంలో మంచి లాభాల్ని రాబడుతోన్న శ్రీదేవి.. నెలకు సుమారు రూ. 10 లక్షల వరకు సంపాదిస్తున్నానని చెబుతోంది. అంతేకాదు.. మనకు నచ్చిన రంగంలో కొనసాగినప్పుడే రాణించగలమంటూ నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ మామ్‌ ఆంత్రప్రెన్యూర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్