Published : 05/12/2022 19:15 IST

Money Management: మీరు ఇందులో నిపుణులేనా?

కీర్తనకు బీటెక్‌ పూర్తవగానే ఓ మంచి ఎమ్మెన్సీలో ఉద్యోగం వచ్చింది. నెలనెలా మంచి జీతం చేతికందుతుండడంతో తనకు అవసరం ఉన్నా లేకపోయినా నచ్చిందల్లా కొనేస్తుంది.

‘మేం ఉద్యోగం చేసేది మా కోసం.. మా అవసరాల కోసం.. ఇతరులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవడం కోసం..’ అన్న ఆలోచనతో ఉంటారు కొంతమంది మహిళలు. మరికొందరు.. తమ కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉండడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే ఎవరి మనసులో ఏమున్నా.. ఉద్యోగం చేస్తున్నా, గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. డబ్బు నిర్వహణ, పొదుపు సూత్రాలకు సంబంధించిన పలు విషయాలు తెలిసుండడం అవసరం అంటున్నారు నిపుణులు. అప్పుడే కుటుంబం ఆర్థికంగా దృఢంగా ఉంటుందంటున్నారు.

‘తొలి’ మోజులోంచి బయటపడండి!

తొలి ఉద్యోగం, తొలి సంపాదన.. ఎవరికైనా ఇది ప్రత్యేకమే! ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు 20ల్లోనే ఉద్యోగం సంపాదించడం, పెద్ద జీతం అందుకోవడం.. కామనైపోయింది. అయితే ఈ వయసులో తమపై బరువు బాధ్యతలేవీ ఉండవు కాబట్టి సంపాదించిన మొత్తాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు, తమకు నచ్చిన వస్తువులన్నీ కొనేసుకోవచ్చన్న భావనతో ఉంటారు చాలామంది అమ్మాయిలు. అదిగో ఆ పొరపాటే చేయొద్దంటున్నారు నిపుణులు. వయసు చిన్నదే అయినా పరిణతితో ఆలోచించమంటున్నారు. వచ్చిన డబ్బుతో అత్యవసరమైన ఖర్చులకు కొంత డబ్బును వెచ్చించి.. మిగతా సొమ్మును పొదుపు-మదుపు చేయమంటున్నారు. ఈ క్రమంలో స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం మంచిది. ఇందుకు నష్టభయం లేని మ్యూచువల్‌ ఫండ్స్‌, సిప్‌.. వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం కాబట్టి.. ఓ మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమూ ఉత్తమమే! రిటైర్మెంట్‌, ఇల్లు-బంగారం కోసం కూడా కొంత మొత్తం చొప్పున కేటాయించుకుంటే.. భవిష్యత్తుపై పూర్తి భరోసా ఉంటుంది.

ఖర్చులూ కలిసి పంచుకోవాలి!

పెళ్లయ్యాక పెరిగే కుటుంబ బాధ్యతల రీత్యా డబ్బు నిర్వహణ తమ వల్ల కాదనుకుంటారు కొందరమ్మాయిలు. నిజానికి భర్త సంపాదనకు భార్య ఉద్యోగం కూడా తోడైతే ఆ కుటుంబం ఆర్థికంగా మరింత పటిష్టంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో భవిష్యత్తు అవసరాలు, పిల్లల బాధ్యతల్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు, ఆర్థిక అవసరాల్ని కలిసి పంచుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు. ఇప్పటికే నిత్యావసర ఖర్చులు, గృహ రుణం చెల్లించడం, పొదుపు పథకాలు.. వంటివి భర్త నిర్వర్తిస్తున్నప్పుడు.. భార్య తన సంపాదనను పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, బంగారంపై పెట్టుబడులు పెట్టడం, రిటైర్మెంట్‌ ప్లానింగ్‌.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై వెచ్చించచ్చు. వీటితో పాటు ఎవరికి వీలైనట్లుగా వారు కొంత అత్యవసర నిధిని కూడా ఏర్పాటుచేసుకోవడం మంచిది. పెళ్లయ్యాక ఇలాంటి ప్రణాళిక ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా ఇబ్బంది తలెత్తదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి