Published : 23/01/2023 20:40 IST

చిన్నవే.. పాటిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు!

శిరీష వాళ్ల ఇంట్లో ఉండేది ఇద్దరే.. అయినా, ఇంటి ఖర్చు మాత్రం నలుగురున్న కుటుంబానికి సరిపడేలా ఉంటుంది.. అదేంటని వాళ్లమ్మ గారు అడిగితే 'నిజమే.. ఖర్చులు పెరిగిపోతున్నాయి.. కానీ ఎక్కడ తగ్గించాలో అర్థం కావట్లేదం'టుంది. ఒక్క శిరీష విషయంలోనే కాదు.. కొత్తగా పెళ్త్లెన వాళ్లందరికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఖర్చులు ఎక్కువవుతుంటాయి. వృథా మాత్రం ఎక్కడ జరుగుతుందో అర్థం కాదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలియకుండానే ఇలా జరుగుతుంది.

వంటింట్లో ఇలా..

వంటింటి బడ్జెట్‌లో కూరగాయలు, పండ్ల కొనుగోలు కోసం కేటాయించేది ఎక్కువగానే ఉంటుంది. ఈ ఖర్చుని తగ్గించుకోగలిగితే.. సగానికి సగం డబ్బు ఆదా అవుతుంది. అయితే ఖర్చు తగ్గించడమంటే ఏం కొనకుండా ఉండిపోవడం కాదు. పండ్లు, కూరగాయల్ని తక్కువ ధరకు లభించే చోట కొనడం, కొన్న వాటిని వృథా చేయకుండా, పూర్తిగా వినియోగించుకోవడం అవసరం. ఈ క్రమంలో ఫ్రిజ్‌లో పెట్టగలిగిన వాటిని తెచ్చిన వెంటనే శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. మిగిలిన వాటిని పేపర్‌బ్యాగ్స్‌లో పెట్టాలి. అలాగే పండ్లని ఫ్రూట్ బాస్కెట్‌లో పెట్టడమో లేదా ఫ్రిజ్‌లో అనుకూల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడమో చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత కూడా కొన్ని కూరగాయలు వాడిపోతాయి. అంతమాత్రాన అవి ఉపయోగించుకోవడానికి పనికిరావని కాదు. ఇలాంటప్పుడు వాటిని ఉప్పు వేసిన చల్లని నీటిలో కాసేపు ఉంచితే తిరిగి తాజాగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయే పదార్థాలు.. (ఆకుకూరల్లాంటివి) మార్కెట్ నుంచి తీసుకువచ్చిన రెండు, మూడు రోజుల్లో వాడేస్తే మంచిది.

ఏరోజుకారోజే..

ఇంటి ఖర్చులో పాలకయ్యే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది ఎక్కువగా పాలు కొనేసి ఫ్రిజ్‌లో భద్రపర్చుకుంటూ ఉంటారు. అయితే పాలు నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటే అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్ని అవసరమో అన్నే తెప్పించుకోవాలి. వాటిని కాచి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. కాయకుండా పాలను ప్యాకెట్‌లోనే ఉంచేస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రిజ్‌లో టెంపరేచర్ సరిగా ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే అవి పాడవకుండా ఉంటాయి.

మన్నికగా..

ఇదేవిధంగా బట్టలు ఉతికేటప్పుడు, వాటిని ఆరేసేటప్పుడు చిన్నపాటి చిట్కాల్ని పాటించడం వల్ల దుస్తులు ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటాయి. బట్టల్ని మరీ ఎక్కువ వేడి నీటిలో నానబెట్టడం, మురికి బాగా పోవాలని డిటర్జెంట్ ఎక్కువగా వేసి ఉతకడం లాంటి పనుల వల్ల వస్త్రాల్లోని పోగుల నాణ్యత దెబ్బ తింటుంది. దుస్తుల రంగు కూడా వెలిసిపోయి పాత వాటిలా కనిపిస్తాయి. దాంతో త్వరగా కొత్త దుస్తులు కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీటి ప్రభావం పరోక్షంగా బడ్జెట్ పైనే పడుతుంది.

వీటి విషయంలోనూ..

ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం కోసం చాలామంది ఫ్లవర్‌వాజుల్లో తాజా పూలను అమరుస్తూ ఉంటారు. ఇలా ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకునే పూలను ఎక్కువ రోజులు ఉండేలా కాపాడుకోగలిగితే ఇంటి అలంకరణ కోసం మనం పెట్టే బడ్జెట్ బాగా తగ్గుతుంది. దీనికోసం పూలు కొనేటప్పుడు, వాటిని అలంకరించేటప్పుడు కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి అలంకరణ కోసం పూర్తిగా విరబూసిన పూలను కాకుండా, మొగ్గల్నే కొని ఎండ తక్కువ పడే చోట పెట్టాలి. అలానే పూలని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వాటి కాడల్ని తుంచేయాలి. వాడిన పూరేకలను కూడా తొలగించాలి. ఎందుకంటే ఇలాంటివి ఉంటే పువ్వు తాజాదనాన్ని త్వరగా కోల్పోతుంది. అంతేకాదు.. కాడ తప్ప పువ్వులోని ఏ భాగం కూడా నీటిలో మునగకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీటిలో పువ్వు ఎక్కువసేపు తాజాగా ఉండేందుకు ఆ నీటిలో టీస్పూన్ చక్కెర వేయాలి. లేదంటే బొగ్గుపొడిని కూడా ఉపయోగించవచ్చు.

అవసరానికి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. కానీ వృథా ఖర్చులు చేయడం మాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. కాబట్టి రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనే ఇలాంటి వృథా ఖర్చులేంటో ఓసారి పరిశీలించుకొని వాటిని తగ్గించుకోవడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని