వర్షాకాలంలో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలం మొదలైంది.. అయితే ఈ కాలంలో గాలిలోని అధిక తేమ వల్ల హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. ఇది మన రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపి వివిధ రకాల వ్యాధుల బారిన పడేలా....
వర్షాకాలం మొదలైంది.. అయితే ఈ కాలంలో గాలిలోని అధిక తేమ వల్ల హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. ఇది మన రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపి వివిధ రకాల వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అందుకే ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు.
‘విటమిన్-డి’ లోపం లేకుండా..!
ఎముకల దృఢత్వానికి విటమిన్ ‘డి’ చాలా అవసరం. మరి, ఈ విటమిన్ పొందాలంటే ఉదయాన్నే లేలేత ఎండలో కాసేపు నిలబడాలి. అయితే ఈ కాలంలో ఆకాశం మబ్బులు పట్టడం వల్ల ఎండ వచ్చే రోజులు తక్కువ. ఫలితంగా శరీరానికి సరిపడా విటమిన్ ‘డి’ అందకపోవడం వల్ల కూడా వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అందుకే ఈ కాలంలో సూర్యరశ్మి లేకపోయినా విటమిన్-డి కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలి. ఈ విటమిన్ అధికంగా లభించే చేపలు, గుడ్లలోని పచ్చసొన, పుట్ట గొడుగులు, ఛీజ్, కమలాఫలం.. వంటి ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. మరీ అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్స్ కూడా వాడచ్చు.
దోమల నుంచి రక్షణకు..!
వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువ! ఇవి ఇంట్లోకి రాకుండా సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసేసినా, ఇంటిని పరిశుభ్రంగా ఉంచినా సరే.. ఎలాగోలా అవి ఇంట్లోకి దూరిపోతాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా.. వంటి వ్యాధుల్ని కలగజేస్తాయి. వీటి బారిన పడకూడదంటే దోమల బెడద లేకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో ఇంట్లోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, ఆరుబయట నీళ్లు నిలవకుండా జాగ్రత్తపడడం, ఇంటి చుట్టూ క్రిమిసంహారకాలను స్ప్రే చేయడం, తులసి-బంతి-లావెండర్.. వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవడం, ఇంట్లో అక్కడక్కడా కొన్ని అత్యవసర నూనెలు, కర్పూరం.. వంటివి ఏర్పాటుచేయడం వల్ల దోమల బెడదను తగ్గించుకోవచ్చు.
ఆహారం విషయంలో అజాగ్రత్త వద్దు!
ఇక ఈ వర్షాకాలంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు, పకోడీలు, స్వీట్‌కార్న్.. వంటి వాటిపైకి మనసు లాగడం సహజం. అయితే వీటిని మరీ ఎక్కువగా తినడం, బయట తయారుచేసే వాటికి ప్రాధాన్యమివ్వడం.. వల్ల అజీర్తి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటివి ఇంట్లోనే పరిశుభ్రంగా తయారుచేసుకొని తినడం మంచిది. అది కూడా మితంగానే! వీటితో పాటు మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం, తాజా కాయగూరలు-పండ్లు, ఆకుకూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు.
సీజనల్ అలర్జీలకు దూరంగా..!
వాతావరణంలోని మార్పుల వల్ల జలుబు, దగ్గు.. వంటి సీజనల్ సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వారిలో ఇవి మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి ఇంట్లో ఉండే కంటికి కనిపించని క్రిమికీటకాలు కూడా ఇలాంటి సీజనల్ అలర్జీలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి వీటి బారిన పడకుండా ఉండేందుకు.. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్ ఏర్పాటుచేసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా మంచిదే! రోగనిరోధక శక్తిని పెంచే డ్రైఫ్రూట్స్, ‘సి’ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, పెరుగు, ఆకుకూరలు.. మొదలైనవి తీసుకోవడం, ఆవిరి పట్టడం.. వంటివి క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఇలాంటి సీజనల్ అలర్జీలకు దూరంగా ఉండచ్చు..
ఇవి గుర్తుంచుకోండి!
⚛ చాలామంది కాయగూరలు, పండ్లను ముందే కట్ చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటుంటారు. ఫలితంగా గాలిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు కట్ చేసిన ఆహారంపైకి చేరతాయి. మనం వాటిని మళ్లీ కడగకుండా తినేయడం వల్ల అవి మన కడుపులోకి చేరి లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడే తాజాగా వాటిని కట్ చేసుకోవడం ఉత్తమం.
⚛ వండుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వండినవి రాత్రి, రాత్రి మిగిలిపోయినవి మరునాడు ఉదయం తినడం అస్సలు మంచిది కాదు. ఏ పూటకాపూటే వేడివేడిగా వండుకొని తీసుకోవాలి.
⚛ దాహం వేయట్లేదని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతాం. కాబట్టి ఏ కాలంలోనైనా సరైన మోతాదులో నీళ్లు తాగాలి. అవి కూడా మరిగించి కాస్త గోరువెచ్చగా తీసుకోవాలి.
⚛ రోజులో ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే మానసిక ఒత్తిడి, ఆందోళనలకు గురై.. దీని ప్రభావం రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది.
⚛ ఇక ఈ సీజన్‌లో నూనె పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నూనెలు, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు సులభంగా జీర్ణం కావు. పైగా వర్షాకాలంలో మన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే కాయగూరలు, సూప్స్, బ్రెడ్, పెరుగన్నం.. వంటివి తీసుకోవడం మంచిది.
గమనిక : వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడూ పలు అనారోగ్యాలు తలెత్తుతూనే ఉంటాయి. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే ఆయా అనారోగ్యాల్ని నయం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.