Updated : 23/11/2022 18:38 IST

మా అమ్మాయి కూడా అలా చేస్తుందేమోనని భయంగా ఉంది..!

మా అమ్మాయి వయసు 20 సంవత్సరాలు. డిగ్రీ చదువుతోంది. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను ఎదిరించి, ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అలా చేయడం తప్పు కదాని మా అమ్మాయితో అన్నాను. అందుకు ‘నా ఫ్రెండ్‌ తప్పేముంది.. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఇంట్లోంచి వెళ్లిపోయేది కాదు కదా’ అని చెప్పింది. తన మాటలు విన్న దగ్గర్నుంచి నాకు భయంగా అనిపిస్తోంది. మా అమ్మాయి కూడా అలా చేస్తుందేమోనన్న ఆలోచన నన్ను వెంటాడుతోంది. అలా జరగదని తెలిసినా ఎందుకో చాలా భయం, కంగారు కలుగుతున్నాయి. మా అమ్మాయి ఫోన్‌ చూస్తున్నా, ఇంటికి రావడం ఆలస్యమైనా ఆందోళనగా ఉంటుంది. తనకు ఈ విషయాలు చెబితే ఏమనుకుంటుందోనని చెప్పడం లేదు. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? నేను ఈ ఆలోచనల నుంచి బయటపడే మార్గం చెప్పండి. - ఓ సోదరి.

జ. మీ ప్రశ్నను బట్టి మీరు మీ అమ్మాయి పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతోంది. అయితే మీ అమ్మాయి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి సున్నితమైన అంశం గురించి తన అభిప్రాయాన్ని మీతో స్వేచ్ఛగా చెప్పడాన్ని సానుకూలంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీరు కూడా మీ అభిప్రాయాలను తనతో పంచుకుంటే అప్పుడు తన ఉద్దేశాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇక తను ఇంటికి రావడం ఆలస్యమైనా కంగారు పడుతున్నానని చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా ఎందుకు ఆలస్యమైందో అడగండి. అసలు విషయం తెలుస్తుంది. అంతేకానీ, మీరు తనతో ఎలాంటి విషయాలు చర్చించకుండా ప్రతి విషయాన్ని నెగెటివ్‌గా చూడడం వల్ల ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పడే అవకాశం ఉంటుంది. అలాగే కొంతకాలానికి మీ కుటుంబం పైనా పడుతుంది.

మీ అమ్మాయితో ఒక స్నేహితురాలిగా మెలగండి. తను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ తన మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ప్రతికూల అంశాలు కనిపిస్తే వాటి వల్ల కలిగే నష్టాలను వివరించండి. ఇలా చేయడం వల్ల క్రమంగా మీకు, మీ అమ్మాయికి మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడుతుంది. ఈ బంధం మీ భయాలను, ఆందోళనలను దూరం చేసే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి