అయిదు వేలమందికి... అమ్మయ్యింది!

పసిపిల్లల ఆరోగ్యానికి అమ్మపాలే రక్ష. కానీ అవి దొరక్క చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యా ఎక్కువే! అలాంటివారి ప్రాణాలు కాపాడుతూ అయిదు వేల మందికి అమ్మయ్యింది రక్ష జైన్‌!

Published : 11 Jul 2024 03:51 IST

పసిపిల్లల ఆరోగ్యానికి అమ్మపాలే రక్ష. కానీ అవి దొరక్క చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యా ఎక్కువే! అలాంటివారి ప్రాణాలు కాపాడుతూ అయిదు వేల మందికి అమ్మయ్యింది రక్ష జైన్‌!

2018... పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది రక్ష. కానీ తనకు పాలు పడలేదు. ఫార్ములా మిల్క్‌ చిన్నారికి పడట్లేదు. తొలిచూలు బిడ్డ... అలా ఇబ్బంది పడుతోంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది. అప్పుడే ఎవరో దగ్గర్లోని మిల్క్‌ బ్యాంక్‌ గురించి సమాచారమిచ్చారు. అక్కడినుంచి తల్లిపాలు తీసుకొచ్చి పట్టాకకానీ బాబు ఆకలి తీరలేదు. అప్పుడే ‘నా బిడ్డ ఆకలి తీర్చి, ప్రాణాలు కాపాడిన ఆ తల్లి రుణం ఎలాగూ తీర్చుకోలేను. నా వంతుగా మరికొందరు బిడ్డలను కాపాడాలి’ అనుకుందట రక్ష. రక్షది రాజస్థాన్‌లోని భిల్‌వాడా. ప్రసవమైన మూడోరోజు పాలు పడ్డాక చాలా ఆనందించింది. అమృతం లాంటి తల్లిపాలను ఇవ్వడానికి మించింది ఏముంటుంది అనుకొని తన బిడ్డకు ఇవ్వగా మిగిలినవాటిని దానమివ్వడం మొదలుపెట్టింది. అలా 2018-19 మధ్యలో 65 లీటర్లు ఇచ్చింది. గత ఫిబ్రవరిలో మరో బిడ్డకు జన్మనిచ్చాక మళ్లీ అలాగే చేసింది. ఈసారి ఏకంగా 106 లీటర్ల పాలను మిల్క్‌ బ్యాంకుకు ఇచ్చింది.

‘కళ్ల ముందు బిడ్డ ఆకలితో గిలగిల్లాడుతోంటే ఆ తల్లికి ఎలా ఉంటుందో నాకు అనుభవమే. అందుకే నా బిడ్డలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని తెలిశాక ఊరుకోలేకపోయా. రోజూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఇచ్చొచ్చా. తరవాత ప్రయాణ ఖర్చులు భరించలేక బండి మీద బిడ్డను వెనక కట్టుకొని వెళ్లిన రోజులూ ఉన్నాయి. ఇంత కష్టం అవసరమా అనొచ్చు. ఓసారిలాగే వెళ్లినపుడు అక్కడ పనిచేసే ఆమె ఓ ఆడశిశువును తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, ‘ఇదిగో నీ కూతురు’ అంది. అర్థంకాక చూస్తోంటే... ‘పాప కన్నతల్లి పురిట్లోనే చనిపోయింది. అప్పట్నుంచీ నీ పాలతోనే ఈ పాప జీవిస్తోంది’ అందామె. ఆ చిన్నారిని చూసినప్పుడు నా కన్నకూతురే అనిపించింది. అలాంటి పసివాళ్ల కడుపు నింపడం నా అదృష్టంగానే భావిస్తున్నా’నంటుంది రక్ష. తన పాలతో అయిదువేల మంది చిన్నారుల కడుపు నింపిందామె. తన ఆలోచనకు ఇంట్లోవాళ్లు సాయపడ్డారు. ఇంకా తల్లులు ముందుకొస్తే ఎంతోమంది చిన్నారులను రక్షించుకోవచ్చని భావించిన రక్ష ఈ విషయంగా అవగాహననీ కలిగిస్తోంది. అభినందించాల్సిందే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్