ఒక కూతురు తల్లికిచ్చిన కానుకే ‘మదర్స్ డే’!

అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించవచ్చు.. అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు.. నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు.. కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మ పైన ప్రేమని....

Published : 14 May 2023 09:36 IST

అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించవచ్చు.. అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు.. నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు.. కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మ పైన ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికే ‘మదర్స్ డే’ మొదలైంది. అయితే అసలు ఈ ఐడియా ఎవరిది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డని కన్నట్లే.. ఒక కూతురు తన తల్లి కోరిక నెరవేర్చడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించి 'మదర్స్ డే' ఆలోచనను అమల్లో పెట్టింది. ఆ కూతురి పేరే 'అన్నా జార్విస్'. ఇంతకీ అమ్మల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు కావాలనుకుంది ? తెలియాలంటే ఇది చదవండి మరి!

(Representational Image)

అమ్మ మాటలు స్ఫూర్తి నింపాయి!

అన్నా జార్విస్ తల్లి 'అన్ రీవ్స్ జార్విస్' ఒక సంఘసంస్కర్త. అమెరికన్ సివిల్ వార్ సమయంలో 'మదర్స్ డే వర్క్ క్లబ్'ని నెలకొల్పి పిల్లల బాగోగుల గురించి మహిళలకు శిక్షణనిప్పించింది. తర్వాత 'మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే'ని ప్రారంభించి అమ్మలందరితో కలిసి సైనికులలో స్నేహ భావాన్ని పెంపొందించింది.

ఒకరోజు అన్ రీవ్స్ ఎప్పటిలానే చర్చిలో ఉపన్యాసం ఇస్తోంది. అప్పుడు అన్నా జార్విస్‌కు పన్నెండేళ్లు. ఆ ఉపన్యాసంలో అన్ రీవ్స్ చెప్పిన మాటలు అన్నా మనసులో నాటుకుపోయాయి..

'మానవాళికి వెలకట్టలేని, సాటిలేని సేవ చేస్తున్న అమ్మకి ఒక రోజంటూ ఉండాలి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఆమె గౌరవార్థం ఆ రోజుని తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను' అని చెప్పింది. అంతే.. ఆ మాటలతో ఆ ఒక్కరు తానే అవ్వాలనుకుంది అన్నా. తన తల్లితో పాటు ప్రపంచంలోని తల్లులందరికీ గుర్తింపు తీసుకురావాలనుకుంది. పెళ్లి, పిల్లలు కూడా వద్దనుకుని అదే ఏకైక లక్ష్యంగా ఉద్యమించింది.

(Representational Image)

మొదట నవ్వుకున్నారు!

వెటకారంతోనే విజయం మొదలవుతుందంటారు.. అన్నా విషయంలో కూడా ఇదే జరిగింది. తల్లి చనిపోయిన మూడు సంవత్సరాలకి 1908లో ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదనను ఉంచుతూ మదర్స్ డేని గుర్తించాలని కోరింది అన్నా. ఇలా అయితే అమ్మలకే కాదు అత్తలకి కూడా ఒక రోజుని పెట్టాలని ఎద్దేవా చేసి తిరస్కరించారు ఆ దేశాధిపతులు.

అయితే అన్నా అక్కడితో ఆగలేదు, ఓ పూల వ్యాపారి నుండి ఆర్థిక సాయం పొంది అదే సంవత్సరం మొదటి అధికారిక మదర్స్‌డేని నిర్వహించింది. ఆ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం వచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. అప్పటి నుండి కొన్ని సంస్థలు మదర్స్ డేని గుర్తించి వార్షిక వేడుకగా జరపడం ప్రారంభించాయి.

ఈ స్ఫూర్తితో అన్నా తన ఉద్యమాన్ని మరింత ముందుకి తీసుకెళ్లింది. అమెరికాలో అప్పటి వరకు ఉన్న సెలవులన్నీ మగవారు సాధించిన విజయాలకు, వారి త్యాగాలకు మాత్రమే గుర్తుగా ఉండేవి. ఈ నేపథ్యంలో తల్లుల త్యాగాలకు గుర్తుగా మదర్స్ డేని గుర్తించి జాతీయ క్యాలండర్‌లో చేర్చాలని వార్తా పత్రికలకు, రాజకీయ నాయకులకు కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు రాసింది అన్నా.

తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ ఫలించింది !

1905లో తల్లి అన్ రీవ్స్ మరణం తర్వాత అన్నా ప్రారంభించిన ఉద్యమం సఫలం కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. జనం నుండి మదర్స్ డేకి లభిస్తున్న ఆదరణ చూసిన అప్పటి అధ్యక్షుడు వూడ్రో విల్సన్ 1914లో ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారాన్ని అధికారికంగా మదర్స్ డేగా జరుపుకోవాలని తీర్మానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తల్లి ప్రేమలో వ్యాపారం !

అంతా బానే ఉంది కానీ ఆ తర్వాత కొంత కాలానికి అసలు సమస్య మొదలైంది. అన్నా జార్విస్ మదర్స్ డేని ప్రారంభించింది తల్లులందరూ కలిసి తమ కుటుంబాలతో సరదాగా కాలాన్ని గడపడం కోసం. పిల్లలు తమ తల్లుల ప్రేమాభిమానాలను, వారి త్యాగాలను గుర్తించి గౌరవించడం కోసం. ఆమె ఊహించిన దాని ప్రకారం అందరూ శాంతికి చిహ్నమైన తెల్లని దుస్తులు ధరించి కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళి అమ్మ గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే ఒక్కసారి మదర్స్ డేని జాతీయ సెలవు దినంగా గుర్తించడంతో ప్రేమ పెరగాల్సింది పోయి వ్యాపారం ఎదిగింది. దూరంగా ఉన్నవారు తల్లి చెంతకు చేరకుండా పూలని, గ్రీటింగ్ కార్డులని పంపడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా వ్యాపారమే తప్ప జార్విస్ వూహించిన ప్రేమ కనిపించలేదు.

దేనికోసమైతే పోరాడిందో దాన్నే వద్దంది!

మదర్స్ డే వేడుకలలో వ్యాపార ధోరణి నచ్చని జార్విస్ అందుకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 'మదర్స్ డే' పేరుని వాడుకుని వ్యాపారం సాగించే వారిపై ఎన్నో కేసులు వేసింది. ఇలా తన సంపాదనంతా వాటికే వెచ్చించిందంటే ఈ వ్యాపార ధోరణిపై జార్విస్ ఎంత విసిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక చివరికి తన వల్ల కాకపోవడంతో ఏ నోటైతే మదర్స్ డే కావాలందో అదే నోట మదర్స్ డేని క్యాలండర్ నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. అయితే ఆమె మరణం తర్వాత కూడా అది జరగలేదు. ఇప్పటికీ ఆ వ్యాపార ధోరణే కొనసాగుతోంది. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అన్నా జార్విస్ నిజమైన ఉద్దేశాన్ని పాటిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని