Published : 20/02/2022 12:09 IST

కనువిందు చేసే మొఘల్ గార్డెన్స్!

రంగురంగుల పూలు.. అందమైన సీతాకోక చిలుకలు.. ఫౌంటెయిన్ నుంచి ఎగసిపడే నీటి జల్లు.. పక్షుల కిలకిలారావాలు.. ఎటు చూసినా పచ్చదనం.. ఇవన్నీ రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో కనిపించే సోయగాలు.. ఏడాదికోసారి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయడానికి ‘ఉద్యానోత్సవం’ పేరుతో మొఘల్ గార్డెన్స్ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఏడాది కూడా మార్చి 16 వరకు ఈ గార్డెన్‌ అందాల్ని తిలకించే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో ఈ గార్డెన్‌ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి..

మొఘలుల దర్పానికి ప్రతీక..

భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌ని నిర్మించారు. దీనిని చార్‌భాగ్ అంటారు. అంటే నాలుగు సమాన భాగాలుగా విడదీసి పూలతోటలను పెంచడం అన్నమాట. ఇక్కడ చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారంలో ఎన్నో రకాల పూలతోటలు, సరస్సులు ఉన్నాయి. ఆంగ్లేయుల పాలనా కాలంలో ఇక్కడ లాన్‌లను ఏర్పాటు చేశారు. 139 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న దీనిలో ఔషధి వనం, ఆధ్యాత్మిక వనం, బోన్సాయ్ గార్డెన్‌తో పాటు జీవవైవిధ్య పార్కును కూడా సందర్శించవచ్చు.

ఇందులో దాదాపు 10,000 తులిప్‌ మొక్కలు, 138 రకాల గులాబీలు, 70 రకాల్లో పూచే సుమారు 5,000 సీజనల్‌ పూలు, 250 బోన్సాయ్ వృక్షాలు, 2,500 రకాల డాలియా పూల మొక్కలు ఉన్నాయి. ఇవే కాకుండా కాక్టస్, జెర్బెరా, చామంతి తదితర 80 రకాల మొక్కలు ఉన్నాయి.

అంతేకాకుండా.. ఏడు రకాల న్యూట్రిషన్‌ గార్డెన్స్‌లో భాగంగా మామిడి, కమలాఫలం, కొబ్బరి, ఉసిరి.. వంటి ఎన్నో పోషకభరితమైన పండ్ల-కాయగూరల మొక్కలు, చెట్లను తిలకించవచ్చు. వీటితో పాటు మ్యూజికల్ గార్డెన్‌లో ఉన్న 12 ఫౌంటెయిన్లు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఎన్ని రకాల గులాబీలో..

మొఘల్ గార్డెన్స్‌లో పూచే విభిన్న వర్ణాల గులాబీలే ఆ ఉద్యానవనానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. రుతువులతో సంబంధం లేకుండా ఇక్కడ ఏడాది పొడవునా గులాబీలు పూస్తాయి. దాదాపు 138 రకాలకు పైగా ఉన్న ఈ గులాబీలు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు విరబూసి మరింతగా కనువిందు చేస్తాయి. అరుదైన పచ్చ గులాబీ సైతం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని గులాబీ మొక్కలకు మదర్ థెరిస్సా, రాజా రామ్మోహన్‌రాయ్, జవహర్‌లాల్ నెహ్రూ, ఎలిజబెత్ రాణి, అబ్రహాం లింకన్ తదితర ప్రముఖుల పేర్లను పెట్టారు. వాటికి పూసే పూలను సైతం అదే పేర్లతో పిలుస్తారు.

ఈసారి ఇవే ప్రధాన ఆకర్షణ!

‘ఉద్యానోత్సవం’లో భాగంగా ఈసారి 11 రకాల తులిప్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా ఇవి ఫిబ్రవరి నెలలో విరబూసి తోటకు అందాన్ని తీసుకొస్తాయి. సెంట్రల్‌ లాన్స్‌లో వివిధ ఆకృతుల్లో అద్భుతమైన పూల డిజైన్లతో కూడిన పూల కార్పెట్లు పర్యటకులకు కనువిందు చేయనున్నాయి. అంతేకాదు.. తెలుపు, ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో విరబూసే ఆర్నమెంటల్‌ పూలు నింగిలోని హరివిల్లును నేలకు దించనున్నాయి. ఇక మరోవైపు గాలిని శుద్ధి చేసే మొక్కలు, చిన్న చిన్న కాక్టస్‌ మొక్కలు కూడా మొఘల్ గార్డెన్స్‌లో కొలువు దీరాయి. వీటితో పాటు నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ, వూదా, నారింజ రంగుల్లో ఉన్న దాదాపు పదివేలకు పైగా తులిప్ మొక్కలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచనున్నాయి. దీంతో కశ్మీరు లోయ అంతటి అందాలను మొఘల్ గార్డెన్స్ సంతరించుకుంది. ఆధ్యాత్మిక వనంలో అభివృద్ధి చేసిన కలువల కొలను సైతం అదనపు ఆకర్షణగా నిలవనుంది.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..

ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్‌ను ఏడాదికోసారి ప్రజల సందర్శనార్థం అనుమతిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు సందర్శకులకు అనుమతి ఉంది. ప్రతి రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీన్ని సందర్శించవచ్చు. సాయంత్రం 4 గంటలకు చివరి ప్రవేశం ఉంటుంది. ప్రవేశం ఉచితం. సోమవారాలు మాత్రం సందర్శకులను అనుమతించరు. ఇక ఈసారి ముందుగానే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే గార్డెన్‌ను సందర్శించడానికి అనుమతిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు ఏడు స్లాట్ల చొప్పున ఒక్కో స్లాట్‌లో వంద మంది బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక కరోనా దృష్ట్యా సందర్శకులందరూ కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం ఈ లింకుల్ని క్లిక్‌ చేయండి!

https://rashtrapatisachivalaya.gov.in 
https://rb.nic.in/rbvisit/visit_plan.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని