Premium Wraps: ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతాయ్!

తినగా మిగిలిపోయిన కూరలు, ఇతర పదార్థాల్ని గిన్నెలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తాం.. మరుసటి రోజుకు వాటి రంగు, రుచి.. రెండూ మారిపోతాయి.ఉదయాన్నే హడావిడి అవుతుందని రాత్రే కాయగూరలు కట్‌ చేసి పెట్టుకుంటాం.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టినా ఉదయానికి వడలిపోయినట్లు....

Published : 23 Jun 2023 12:42 IST

తినగా మిగిలిపోయిన కూరలు, ఇతర పదార్థాల్ని గిన్నెలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తాం.. మరుసటి రోజుకు వాటి రంగు, రుచి.. రెండూ మారిపోతాయి.

ఉదయాన్నే హడావిడి అవుతుందని రాత్రే కాయగూరలు కట్‌ చేసి పెట్టుకుంటాం.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టినా ఉదయానికి వడలిపోయినట్లు, తేమను కోల్పోయినట్లు తయారవుతాయి.

దూర ప్రయాణాల్లో తినడానికి.. ఎక్కువ మొత్తంలో వంటకాలు తయారు చేసుకుంటాం.. అయితే అవి కొన్ని గంటల్లోనే రుచి మారిపోవడం గమనిస్తాం..

వంట చేయడం ఒకెత్తయితే.. వివిధ పదార్థాలను తాజాదనం కోల్పోకుండా నిల్వ చేయడం మరో ఎత్తు. ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా, డబ్బాల్లో నిల్వ చేసినా.. గంటలు గడిచే కొద్దీ అవి తాజాదనాన్ని కోల్పోతాయి. వాతావరణంలోని గాలి, తేమ వీటికి తగలడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ప్రీమియం ర్యాప్స్‌తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. PVDC (పాలీవినైలిడిన్‌ క్లోరైడ్) - మెటీరియల్‌తో తయారుచేసిన ఈ ఫుడ్‌ ర్యాపింగ్‌ పేపర్‌తో ఆహార పదార్థాల్ని ర్యాప్‌/సీల్‌ చేయడం వల్ల వాటికి గాలి/తేమ తగలకుండా.. వాటిలోని తేమ బయటికి వెళ్లిపోకుండా.. ఇలా రెండు రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. తద్వారా ఆయా పదార్థాలు ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటాయి. ఇదే కాదు.. ఈ ప్రీమియం ర్యాప్స్‌ వల్ల ఇంకా బోలెడన్ని ప్రయోజనాలూ ఉన్నాయట! అవేంటో తెలుసుకుందాం రండి..

అన్ని విధాలా సురక్షితమైనవి!

చాలామంది ఆహార పదార్థాల్ని నిల్వ చేయడానికి లేదా క్యారీ చేయడానికి అల్యూమినియం ర్యాప్స్‌/ఫాయిల్‌ పేపర్స్‌.. వంటివి వాడుతుంటారు. కానీ వాటి కంటే ఈ ప్రీమియం ర్యాప్సే సురక్షితమైనవని అంటున్నారు నిపుణులు. అటు ఆరోగ్యానికే కాదు.. ఇటు పర్యావరణానికీ ఇవి మంచివని చెబుతున్నారు. క్లింగ్‌ ర్యాప్‌/క్లింగ్‌ ఫిల్మ్‌.. ఇలా విభిన్న పేర్లతో పిలిచే ఈ ర్యాపింగ్‌ పేపర్‌ని క్యాటరింగ్‌ సర్వీసెస్‌లో భాగంగా ఆహార పదార్థాల్ని తరలించడానికి ఎక్కువగా వాడుతుంటారు. అయితే దీన్ని ఇంటి ప్రయోజనాల కోసమూ ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. గాలి/తేమ చొరబడకుండా, పదార్థాల్లోని వేడి, తాజాదనం బయటికి పోనివ్వకుండా.. పూర్తి రక్షణ కవచంగా పని చేస్తాయివి.

ఎన్నెన్నో ప్రయోజనాలు!

ఎక్కువ మొత్తంలో చపాతీలు/పుల్కాలు చేసుకున్నప్పుడు కాసేపటికే ఇవి గట్టిపడడం గమనిస్తాం. ఎంత హాట్‌బాక్స్‌లో పెట్టినా కొద్దిసేపటికి అవి చల్లారిపోతాయి. కానీ ప్రీమియం ర్యాప్స్‌లో వీటిని చుట్టి నిల్వ చేస్తే.. అవి ఎక్కువసేపు వేడిగా, మెత్తగా, తాజాగా ఉంటాయి.. ఈ ర్యాపింగ్‌ పేపర్‌ ఉష్ణ నిరోధకంగా పనిచేయడమే ఇందుకు కారణం.

పండ్లకు గాలి తగలడం వల్ల రోజులు గడిచే కొద్దీ అవి తేమను కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. ప్రీమియం ర్యాప్స్‌లో వీటిని చుట్టేస్తే ఈ సమస్య ఉండదు. బయటి గాలి వాటికి తగలకుండా.. అవి తేమను కోల్పోకుండా.. చేస్తుందిది.

మాంసాహారాన్ని నేరుగా లేదంటే మ్యారినేట్‌ చేసి డీప్‌ ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే దాన్ని సాధారణంగా కాకుండా ప్రీమియం ర్యాప్‌లో చుట్టి ఫ్రీజర్‌లో పెడితే ఎక్కువ సమయం పాటు ఇవి తాజాగా ఉంటాయంటున్నారు నిపుణులు.

ఈ క్లింగ్‌ ర్యాప్స్‌ ఉష్ణ నిరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటితో ఆయా పదార్థాల్ని సీల్‌ చేసి.. మైక్రోవేవ్‌ అవెన్‌లో 140 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వరకూ సురక్షితంగా ఉడికించుకోవచ్చట! అలాగే స్టీమింగ్‌ పద్ధతిలో ఉడికించుకోవాలనుకునే కాయగూరల కోసం ఈ ర్యాపింగ్‌ పేపర్‌ని నిస్సందేహంగా వాడచ్చంటున్నారు నిపుణులు. తద్వారా వాటిలోని పోషకాలు కోల్పోకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు.

కాయగూరల్ని ముందు రోజు రాత్రే కట్‌ చేసుకొని పెట్టుకోవడం చాలామందికి అలవాటు. ఈ క్రమంలో వాటిని నేరుగా కాకుండా.. ప్రీమియం ర్యాప్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే.. మరుసటి రోజుకు వడలిపోకుండా, వాటిలోని తేమ కోల్పోకుండా తాజాగా ఉంటాయి.. ఫలితంగా అవి త్వరగా ఉడుకుతాయి కూడా!

ఆహార పదార్థాలు తేమను కోల్పోతే.. అవి త్వరగా పాడైపోతాయి.. రుచి కూడా మారిపోతుంది. క్లింగ్‌ ర్యాప్స్‌లో చుట్టిన పదార్థాలకు ఈ సమస్య ఉండదు. బయటి తేమను పదార్థాల్లోకి పోనివ్వకుండా.. పదార్థాల్లోని తేమను బయటికి రానివ్వకుండా ఇది నిరోధిస్తుంది.

జ్యూసులు, ఇతర పానీయాలు ఒలికిపోకుండానూ ఈ ర్యాపింగ్‌ పేపర్స్‌ని ఉపయోగించుకోవచ్చు. సింపుల్‌గా ఈ పేపర్స్‌తో జ్యూస్‌ జార్స్/ గ్లాసుల పైభాగాన్ని సీల్‌ చేసి, మధ్యలో స్ట్రా పట్టేంత రంధ్రం చేశారంటే.. ఇక ఒలికిపోతుందన్న భయమే ఉండదు.

ఈ ప్రీమియం ర్యాప్స్‌ ఆహార పదార్థాల్ని ఎక్కువసేపు తాజాగా ఉండేలా చేయడం వల్ల ఆహార వృథా కూడా తగ్గుతుంది.

రిఫ్రిజిరేటర్‌ని శుభ్రం చేయడం ఓ పెద్ద పని. అదే వాటి షెల్ఫులపై ఈ ర్యాపింగ్‌ పేపర్స్‌ని పరిచి.. మురికిగా మారినప్పుడు వాటిని తొలగిస్తే పని సులువవుతుంది.

ప్రీమియం ర్యాప్‌ ప్యాకింగ్‌కి అనుసంధానంగా ఓ కట్టర్‌ అమరి ఉంటుంది. దాంతో ఈ ర్యాప్‌ను సులభంగా కట్‌ చేయచ్చు కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని