ఆ తొక్కలతోనూ ఉపయోగాలెన్నో!

కిచెన్‌లో మనం వృథా అంటూ పడేసే కొన్ని వస్తువులు/పదార్థాలతో బోలెడన్ని ఉపయోగాలుంటాయి. పండ్లు, కాయగూరల తొక్కలూ ఇందుకు మినహాయింపు కాదు. ఇందులో ఉండే కొన్ని రకాల ఆమ్ల గుణాలు క్లీనింగ్‌ ఏజెంట్‌గా, క్రిమి సంహారిణిగా.....

Published : 17 Jun 2022 20:38 IST

కిచెన్‌లో మనం వృథా అంటూ పడేసే కొన్ని వస్తువులు/పదార్థాలతో బోలెడన్ని ఉపయోగాలుంటాయి. పండ్లు, కాయగూరల తొక్కలూ ఇందుకు మినహాయింపు కాదు. ఇందులో ఉండే కొన్ని రకాల ఆమ్ల గుణాలు క్లీనింగ్‌ ఏజెంట్‌గా, క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి. మరి, ఈ తొక్కలను ఇంకా దేనికోసం వాడచ్చు? తెలుసుకుందాం రండి..

* ఇంట్లో పెంచుకునే మొక్కల కోసం ఇప్పుడందరూ సహజ ఎరువుల్నే వాడుతున్నారు. పండ్లు, కాయగూరల తొక్కలతోనూ దీన్ని తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే.. ఈ తొక్కల్ని కాసేపు ఎండలో ఉంచి.. ఆ తర్వాత మట్టిలో కలిపి కొన్నాళ్ల పాటు అలాగే వదిలేస్తే సరి.

* సింక్‌, కుళాయిలపై తరచూ నీళ్ల మరకలు అవడం మనం గమనిస్తూనే ఉంటాం. పైగా ఇవి ఓ పట్టాన వదలవు కూడా! అలాంటప్పుడు నిమ్మ, కమలాఫలం తొక్కలతో వాటిని రుద్దితే చాలు. వాటిలోని ఆమ్ల గుణాలు ఆయా వస్తువుల్ని మెరిపించడంలో సహకరిస్తాయి.

* నిమ్మ, కమలాఫలం తొక్కల్ని కొన్ని నీళ్లలో వేసి మరిగించాలి. చల్లారాక వడకట్టుకొని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సింక్‌, బాత్‌రూమ్‌లో నీళ్లు పోయే చోట తరచూ స్ప్రే చేస్తుండాలి. తద్వారా అక్కడ బ్యాక్టీరియా, క్రిములు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. పైగా ఈ మిశ్రమం సువాసనలు కూడా వెదజల్లుతుంది.

* పండ్లు, కాయగూరల తొక్కల్లోనూ అందాన్ని ద్విగుణీకృతం చేసే పోషకాలుంటాయి. కాబట్టి వీటిని ఎండబెట్టి బరకగా పొడి చేసుకోవాలి. ఇందులో తేనె, ముల్తానీ మట్టి, గులాబీ నీరు, పెరుగు.. వంటివి కలుపుకొని స్క్రబ్‌లాగా ఉపయోగించుకోవచ్చు.

* చర్మంపై దురద, అలర్జీ, మంట.. వంటి సమస్యల్నీ తొక్కలతో తొలగించుకోవచ్చు. ఇందుకోసం స్నానం చేసే నీటిలో కొన్ని గంటల ముందు నిమ్మ, కమలాఫలం తొక్కలు వేసి అలాగే ఉంచాలి. ఆపై వాటిని తీసేసి ఆ నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

* ఈ వర్షాకాలంలో తడి ఉన్న చోట చిన్న చిన్న పురుగుల్లాంటివి చేరి చిరాకు తెప్పిస్తుంటాయి. వాటిని తరిమి కొట్టాలన్నా తొక్కల్ని ఇలా ఉపయోగించచ్చు. ఉల్లి, అల్లం, నిమ్మ, కమలాఫలం.. వంటి తొక్కల్ని లీటర్‌ నీటిలో వేసి మరిగించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని వడకట్టుకొని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్‌ సోడా లేదా వెనిగర్‌ కలుపుకొని.. పురుగులున్న చోట స్ప్రే చేసుకుంటే అవి ఆ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడచ్చు.

* రబ్బర్‌ ప్లాంట్‌ వంటి మందపాటి, ప్రకాశవంతమైన ఆకులుండే ఇండోర్‌ మొక్కల్ని అరటి పండు తొక్కలతో మృదువుగా తుడవడం వల్ల వాటిపై ఉండే దుమ్ము తొలగిపోయి.. అవి తిరిగి ప్రకాశవంతంగా మారతాయి.

* నిమ్మ, కమలాఫలం తొక్కలతో టీ తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని నీళ్లలో ఆ తొక్కల్ని వేసి మరిగించాలి. కాస్త చల్లారాక వడకట్టుకొని.. తియ్యదనం కోసం తేనె కలుపుకొని తీసుకోవచ్చు.

* కొన్ని వంటకాల్లో వెజిటబుల్‌ స్టాక్‌ను వాడుతుంటాం. దీన్నీ కాయగూరల తొక్కలతో తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం.. ఈ తొక్కలన్నీ నీటిలో వేసి మరిగించాలి. చల్లారాక వడకట్టుకుంటే సరిపోతుంది.

* కీరా తొక్కలు ఇంట్లో చీమల బెడదను తగ్గిస్తాయి. ఇందుకోసం.. చీమలు ఉండే చోట ఈ తొక్కల్ని ఉంచాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్