PCOS Survivor : అతివల ఆరోగ్యమే ఆమె వ్యాపార మంత్రం!

అనుభవమే ఆలోచనను సృష్టిస్తుందంటారు.. ముంబయికి చెందిన 27 ఏళ్ల కరీనా కోహ్లీ విషయంలో ఇది నిజమైంది. టీనేజ్‌లోనే పీసీఓఎస్‌ను ఎదుర్కొన్న ఆమె.. ఆ సమయంలో వచ్చిన శారీరక మార్పుల్ని జీర్ణించుకోలేకపోయింది. దీనికి తోడు ఇలాంటి ఆరోగ్య సమస్యల గురించి సమాజంలో....

Updated : 07 Sep 2022 20:16 IST

(Photos: Instagram)

అనుభవమే ఆలోచనను సృష్టిస్తుందంటారు.. ముంబయికి చెందిన 27 ఏళ్ల కరీనా కోహ్లీ విషయంలో ఇది నిజమైంది. టీనేజ్‌లోనే పీసీఓఎస్‌ను ఎదుర్కొన్న ఆమె.. ఆ సమయంలో వచ్చిన శారీరక మార్పుల్ని జీర్ణించుకోలేకపోయింది. దీనికి తోడు ఇలాంటి ఆరోగ్య సమస్యల గురించి సమాజంలో నెలకొన్న మూసధోరణుల కారణంగా పలు ఇబ్బందుల్నీ ఎదుర్కొంది. అప్పుడర్థమైందామెకు.. ఇది తన ఒక్కదాని సమస్యే కాదు.. మహిళలందరిదీ అని! అందుకే ఇలాంటి ఆరోగ్య సమస్యలు, వీటిపై సమాజంలో నెలకొన్న మూసధోరణులపై అవగాహన కల్పించడమే తన కెరీర్‌గా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ డిజిటల్‌ వేదికను ఏర్పాటుచేసి ఎంతోమంది మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచుతోంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీయ నమ్మకమే మనల్ని విజయ తీరాలకు చేర్చుతుందని చెబుతోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి..

కరీనా కోహ్లీది వ్యాపార నేపథ్య కుటుంబం. ఆమె తల్లిదండ్రులిద్దరూ బిజినెస్‌లో రాణించారు. వాళ్లను చూస్తూ పెరిగిన తానూ వ్యాపారంపై ఇష్టాన్ని పెంచుకుంది. తన చదువునూ ఈ దిశగానే కొనసాగించింది. స్కాట్లాండ్‌లోని సెయింట్‌ ఆండ్రూస్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేసిన ఆమె.. ఓ టెక్స్‌టైల్‌ సంస్థలో ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, సేల్స్‌.. విభాగాల్లో కొన్నేళ్ల పాటు పనిచేసింది. మరోవైపు సెలవులు, ఖాళీ సమయాల్లో తన తల్లిదండ్రుల వ్యాపారంలోనూ భాగమయ్యేది. ఇలా వ్యాపారానికి సంబంధించిన పలు నైపుణ్యాలను ఒంటబట్టించుకుందామె.

పీసీఓఎస్‌ దారి చూపించింది!

చిన్న వయసు నుంచే వ్యాపారంపై మక్కువైతే పెంచుకుంది కానీ.. ఎలాంటి బిజినెస్‌ చేయాలన్న విషయంలో స్పష్టత వచ్చింది మాత్రం తాను పీసీఓఎస్‌ బారిన పడ్డాకే అంటోంది కరీనా. ‘నాకు 13 ఏళ్లున్నప్పుడు పీసీఓఎస్‌ నిర్ధారణ అయింది. దీంతో నా శారీరక మార్పులు నాకు సవాలుగా మారాయి. వీటికి తోడు సమాజం నుంచీ పలు మూసధోరణులు, నిరుత్సాహపూరిత మాటలు భరించాల్సి వచ్చింది. ఈ సమస్య వల్ల చాలామంది సంతానలేమి సమస్యలు, అవాంఛిత రోమాలు వస్తాయని చెప్పేవారు. ఇవి నన్ను మరింతగా కుంగదీసేవి. డాక్టర్‌ను సంప్రదించాక అర్థమైంది.. ఇది దీర్ఘకాలిక సమస్య అని! అయినా అదుపులోకి తెచ్చుకోవచ్చని! ఇప్పటికీ ఏమరపాటుగా ఉంటే అవాంఛిత రోమాలు, అధిక బరువు సమస్యలు అప్పుడప్పుడూ నన్ను ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా నేనొక్కదాన్నే కాదు.. ఈ సమాజంలో చాలామంది మహిళలు ఆరోగ్యం విషయంలో సమాజం నుంచి ఇలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని అర్థమైంది. దీన్ని దూరం చేయాలంటే.. ముందుగా అందరిలో ఆరోగ్య స్పృహ పెంచడం ముఖ్యమనిపించింది. ఈ ఆలోచనే 2020 మార్చిలో ‘బేబీ స్పేస్‌’ అనే డిజిటల్‌ వేదికకు బీజం వేసింది..’ అంటూ తన వ్యాపార నేపథ్యం గురించి చెప్పుకొచ్చిందామె.

కరోనా తోడవడంతో..!

కరీనా వ్యాపారం ప్రారంభించిన సమయంలోనే కరోనా మన దేశంలోకి అడుగుపెట్టింది. దీంతో ఆరోగ్య సదుపాయాల్లేక చాలామంది గర్భిణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ గమనించిన ఆమె.. తల్లీబిడ్డల సంరక్షణకు ఉపయోగపడే సమాచారాన్నీ తన వేదిక ద్వారా అందించాలని నిర్ణయించుకుంది. ‘మొదట్లో సంతానలేమి సమస్యలు, వీటి గురించి సమాచారాన్ని మహిళలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కానీ కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయాల్లేక గర్భిణులు, తల్లైన మహిళలు ఎదుర్కొన్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని.. మా సేవల్ని మరింత విస్తరించాలనుకున్నా. ఈ క్రమంలోనే ఆయా సమస్యలపై చిన్న పాటి పరిశోధనలు చేసి.. వందలాది మంది తల్లులు, నిపుణుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని ఓ చిన్న బృందంతో మా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాం. సంతానలేమి సమస్యలు, గర్భం దాల్చడం, ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్‌ఫీడింగ్‌, లైంగికాసక్తి పెంచుకోవడం, సరోగసీ, పిల్లల్ని దత్తత తీసుకోవడం, ఐవీఎఫ్‌.. ఇలా ఎన్నో విషయాల గురించిన సమగ్ర సమాచారం మా డిజిటల్‌ కమ్యూనిటీ ద్వారా అందించడం మొదలుపెట్టాం. దీనికి మంచి స్పందన రావడంతో మా సేవల్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నాం..’ అంటూ చెప్పుకొచ్చింది కరీనా.

‘HUMM’గా మారిందలా!

మొదట వెబ్‌సైట్‌గా ప్రారంభమైన బేబీ స్పేస్‌.. ఏడాది తిరిగే సరికల్లా యాప్‌ రూపంలో అందుబాటులోకొచ్చింది. దీంతో మరింతమందికి చేరువైంది. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో తాము ఎదుర్కొన్న అతి పెద్ద సవాలేదైనా ఉందంటే.. అది సమాజంలో నెలకొన్న మూసధోరణుల్ని బద్దలుకొట్టడమే అంటోంది కరీనా.

‘మా వెబ్‌సైట్‌కు మంచి స్పందన రావడంతో ఏడాది తిరక్కముందే యాప్‌నూ అభివృద్ధి చేశాం.. ఈ క్రమంలో మహిళలు, కొత్తగా తల్లైన వారి సమస్యలు-సందేహాలు తెలుసుకోవడం, నిపుణులచే కౌన్సెలింగ్‌ ఇప్పించడం, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి కొన్ని సర్వేలూ చేశాం. అయితే ఈ క్రమంలో మరికొన్ని మహిళా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రసవానంతర ఒత్తిడి, బ్రెస్ట్‌ఫీడింగ్‌ విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, బిడ్డ పుట్టాక లైంగిక ఆరోగ్యం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌, తల్లయ్యాక తిరిగి విధుల్లో చేరడం.. ఇలాంటి విషయాల్లో చాలామంది అవగాహన లోపంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమాజం నుంచీ పలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని మాకు అర్థమైంది. అందుకే వీటిపై అవగాహన కల్పించే ఉద్దేశంతోనే మా సేవల్ని మరింత విస్తరించాం. ఈ క్రమంలోనే ‘బేబీ స్పేస్‌’గా ఉన్న మా డిజిటల్‌ వేదిక పేరును ‘HUMM’గా మార్పు చేశాం.. HUMM అంటే మనం అని అర్థం!’ అంటోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌.

ప్రస్తుతం 500లకు పైగా డాక్టర్లు, నిపుణులతో వేలాది మంది మహిళల్లో, కుటుంబాల్లో ఆరోగ్య స్పృహ పెంచుతోన్న కరీనా.. త్వరలోనే పలు ఆరోగ్య సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకొని తన సేవల్ని మరింత మందికి చేరువ చేసే పనిలో ఉన్నానంటోంది. మరోవైపు.. ‘ఎన్ని సవాళ్లు ఎదురైనా మనల్ని మనం నమ్ముకుంటే ఏ శక్తీ మనల్ని విజయం సాధించకుండా ఆపలేదం’టూ తన మాటలతోనూ ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపుతోందీ బిజినెస్‌ లేడీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని