Salary Hike : జీతం పెరిగిందా? అయితే ఇలా చేయండి!

కొత్త ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచడం సహజమే! అయితే ఈ పెరిగిన జీతాన్ని ఎక్కడ పొదుపు చేయాలో కంటే.. ఎలా ఖర్చు పెట్టాలో అన్న ఆలోచనే చాలామందిలో ఉంటుంది. ఇలా చేస్తే శాలరీ పెరిగినా, పెరగకపోయినా.....

Published : 24 Apr 2022 13:18 IST

కొత్త ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచడం సహజమే! అయితే ఈ పెరిగిన జీతాన్ని ఎక్కడ పొదుపు చేయాలో కంటే.. ఎలా ఖర్చు పెట్టాలో అన్న ఆలోచనే చాలామందిలో ఉంటుంది. ఇలా చేస్తే శాలరీ పెరిగినా, పెరగకపోయినా ఒక్కటే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ పొరపాటు చేయకుండా పెరిగిన మొత్తాన్ని కొన్ని భవిష్యత్‌ అవసరాలకు వినియోగిస్తే ఆర్థికంగా మరింత నిలదొక్కుకోవచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..!

‘రుణం’ తీర్చేయండి!

బైక్‌, కారు, సొంతింటి కోసం.. ఇలా చాలామందికి ఏదో ఒక దీర్ఘకాలిక రుణం ఉండనే ఉంటుంది. అయితే అవకాశం వచ్చినప్పుడు వాటిని ఎంత త్వరగా తీర్చేస్తే.. మనపై భారం అంతగా తగ్గుతుంది. కాబట్టి పెరిగిన జీతంలో నుంచి ఎక్కువ మొత్తాన్ని లోన్‌ కోసం వినియోగించండి. ఉదాహరణకు.. నెలనెలా మీరు 10,000 రుణం కడుతున్నారనుకోండి.. మీ జీతం మరో 10,000 పెరిగిందనుకోండి.. అలాంటప్పుడు మీ రుణాన్ని 10-15 వేలకు పెంచండి.. తద్వారా పెట్టుకున్న గడువు కంటే ముందే రుణం తీర్చేసుకోవచ్చు. అలాగే దీనిపై పడే వడ్డీ కూడా తగ్గుతుంది. అంటే.. ఇదీ ఓ రకంగా డబ్బులు పొదుపు చేసుకున్నట్లే లెక్క! పైగా దీనివల్ల పరోక్షంగా మీ సిబిల్‌ స్కోర్‌ కూడా పెరుగుతుంది. ఫలితంగా భవిష్యత్తులో తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుల పైనా రాయితీలు లభిస్తాయి.

అత్యవసర నిధి ఉందా?

ఇది వరకు మీకు వచ్చిన జీతాన్ని బట్టే పొదుపుగా ఖర్చులు చేసి ఉంటారు. మరి, ఇప్పుడు జీతం పెరిగింది కదా.. స్వేచ్ఛగా ఖర్చు పెట్టచ్చన్న ఆలోచన మానుకొని.. డబ్బు విషయంలో ఇది వరకు ఎలాగైతే వ్యవహరించే వారో ఇప్పుడూ అలాగే నడుచుకోవడం మంచిది. ఇక పెరిగిన జీతం అంటారా? అత్యవసరమైన అవసరాలేవీ లేకపోతే.. ఆ మొత్తాన్ని లాభదాయకమైన పథకాల్లో పొదుపు చేయండి. తద్వారా కొన్నేళ్లకు బోలెడంత డబ్బు పోగవుతుంది. అయితే ఇలా పొదుపు చేసే పథకాలు అవసరమైనప్పుడు వెంటనే తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉండాలి. దీన్ని అవసరం వచ్చినప్పుడు అత్యవసర నిధిగా వాడుకోవచ్చు. అలా కాదు.. రుణాలు, ఇతర ఖర్చులు ఉన్నాయనుకుంటే.. పెరిగిన జీతంలో నుంచి కొంత మొత్తాన్నైనా అత్యవసర నిధి కింద దాచుకోవడం మంచిది.

ఈ బీమాతో రెండు ప్రయోజనాలు!

వయసు పెరిగే కొద్దీ ఖర్చులూ పెరుగుతాయి. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, రిటైర్మెంట్‌ పొదుపు.. ఇవన్నీ ముఖ్యమే! అలాగే అత్యవసర సమయాల్లో అధిక డబ్బు ఖర్చవకుండా బీమా మనల్ని కాపాడుతుంది. ఈ రెండూ సమన్వయం చేసుకోవాలంటే యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్ ప్లాన్‌ (ULIP) తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. మీరు తీసుకున్న ప్రీమియంలోని ఒక భాగం మీకు జీవిత బీమా కవరేజీని అందిస్తే.. మరో భాగం వివిధ ఫండ్ల ద్వారా మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇలాంటి యూలిప్‌ ప్లాన్‌ ఇదివరకే తీసుకున్నట్లయితే.. పెరిగిన జీతంలో నుంచి మరికొంత డబ్బును దీనికి కలుపుకొని టాప్‌-అప్‌ చేసుకోవచ్చు. టాప్‌-అప్‌ ప్రీమియంలు కూడా పన్ను ప్రయోజనాలు అందిస్తాయి.

సరదాలూ మిస్సవ్వద్దు!

కొంతమంది ఉన్న జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ.. ఈసారి పెరిగినప్పుడు బ్రాండెడ్‌ దుస్తులు, చెప్పులు, ఇతర యాక్సెసరీస్‌, ఆభరణాలు.. వంటివి కొనుక్కోవాలని అనుకుంటారు. నిజానికి ఇలాంటి సరదాలకు, అదీ అత్యవసరమైతే కొంత మొత్తం వెచ్చించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ఇలా మనకు నచ్చినట్లుగా తయారవడం వల్ల స్వీయ ప్రేమ పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు చేసే పనిపై ఏకాగ్రత, ఉత్సాహం పెరిగేలా చేస్తుంది. ఇదనే కాదు.. వెకేషన్స్‌కి వెళ్లాలనుకున్న వారు సైతం పెరిగిన జీతంలో నుంచి నెలనెలా కొంత డబ్బును పక్కన పెట్టుకొని.. అవసరమైన డబ్బు సమకూరాక దీనికోసం ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇలాంటి సరదాల వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్నతి సాధించచ్చు.. మీ పనితనంతో మరో ప్రమోషన్‌ లేదా శాలరీ హైక్‌.. వంటివీ త్వరలోనే పొందే వీలుంటుంది.

మరి, పెరిగిన జీతంతో మీరేం చేస్తున్నారు? ఎలా పొదుపు చేస్తున్నారు? Contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్