అయిదేళ్ల ప్రేమ.. పెళ్లి మాత్రం ‘ఇప్పుడే కాదం’టాడు..!

నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. కుటుంబ పరిస్థితులు సరిగా లేక ఓ షోరూంలో సేల్స్‌ గర్ల్‌గా పని చేస్తున్నాను. మా నాన్నకు కుటుంబం పట్ల బాధ్యత లేదు. అమ్మ అనారోగ్యంతో ఉంది. ఆమె నా పెళ్లి గురించి చాలా దిగులు పడుతోంది.

Published : 09 Sep 2023 12:18 IST

నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. కుటుంబ పరిస్థితులు సరిగా లేక ఓ షోరూంలో సేల్స్‌ గర్ల్‌గా పని చేస్తున్నాను. మా నాన్నకు కుటుంబం పట్ల బాధ్యత లేదు. అమ్మ అనారోగ్యంతో ఉంది. ఆమె నా పెళ్లి గురించి చాలా దిగులు పడుతోంది. నేను అయిదేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతను ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. సంపాదన బాగానే ఉంది. కానీ, ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ‘ఇప్పుడు కాదం’టూ వాయిదా వేస్తున్నాడు. అసలు అతనికి నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో? లేదో? కూడా తెలియడం లేదు. తనకు కుటుంబ బాధ్యతలు కూడా ఏమీ లేవు. ఒకవేళ గట్టిగా అడిగితే కోపగించుకుంటున్నాడు. తన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ తండ్రికి కుటుంబ బాధ్యత లేదని చెబుతున్నారు. తల్లి అనారోగ్యంతో ఉందన్నారు. ఈ పరిస్థితుల కంటే మీరు ప్రేమిస్తోన్న వ్యక్తి చాలా ప్రమాదకరమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ప్రేమించేటప్పుడు ‘నువ్వు లేక నేను లేను’ అనే సినిమా డైలాగులు చెప్పి తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దాటవేయడం, కోపగించుకోవడం వంటివి చేసే వ్యక్తులను నమ్మడం మంచిది కాదు. అతను మీ పరిస్థితిని అవకాశంగా మల్చుకుని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడేమో ఆలోచించండి. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ పరిస్థితులు, మీకున్న ఇబ్బందుల కారణంగా అతను మీకు ఎడారిలో ఎండమావి లాగా కనిపించవచ్చు. కానీ, మీకు మీరుగా విశ్లేషించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయిదేళ్లుగా ప్రేమలో ఉన్నా, పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ‘ఇప్పుడు కాదం’టూ వాయిదా వేస్తున్నాడంటే- అతనిలో తప్పించుకుని తిరిగే మనస్తత్వం కనిపిస్తోంది. కాబట్టి, మీరు అతన్ని మార్చడం ఎలా? అసలు అతని మనసులో ఏముంది? వంటి విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇరువైపుల నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేనప్పుడు నిజమైన ప్రేమ.. పెళ్లికి దారి తీయడం సహజం. కానీ ‘ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకుందాం’ అని ఒకరినొకరు అడుక్కునే పరిస్థితి రాకూడదు. కాబట్టి, మీరు సరైన వ్యక్తిని ఎంచుకున్నారా? లేదా? అన్న విషయాన్ని ఆలోచించుకోండి. దానిని బట్టి ఒక నిర్ణయానికి రండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని