Published : 10/12/2022 20:34 IST

మొటిమల మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి?

మేడం.. మా పాప వయసు 14 ఏళ్లు.. ఈ మధ్య ముఖం మీద మొటిమలు వచ్చాయి. మొదట్లో మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత అవి నల్లటి మచ్చలుగా మారుతున్నాయి. తన ముఖంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో నల్లగా అలుముకుంటున్నట్లు ఉంది. మచ్చల సంఖ్య కూడా చాలా ఎక్కువైంది. అవి తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఓ సోదరి

జ. అమ్మాయిలకు టీనేజ్‌లో మొటిమలు రావడం అన్నది సర్వసాధారణమైన విషయం. శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు కూడా వాటికి కారణం కావచ్చు. అయితే అధిక మొత్తంలో నీళ్లు తాగడం, చర్మం జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడడం ద్వారా ఇలాంటి సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందచ్చు. మీ అమ్మాయి విషయంలో ముందుగా మొటిమలను నివారించి, ఆ తర్వాత మచ్చలపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది.

మొటిమలు తగ్గేందుకు ప్యాక్:

చెంచా ముల్తానీ మట్టి తీసుకొని అందులో జీలకర్ర పొడి, దాల్చినచెక్క పొడి, లవంగం పొడి చిటికెడు చొప్పున వేసి తగినంత రోజ్‌వాటర్ జత చేస్తూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్త్లె చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చొప్పున రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి.

నల్లని మచ్చలు తగ్గేందుకు..

ఓట్స్ పౌడర్, బార్లీ పౌడర్ అరచెంచా చొప్పున తీసుకొని అందులో రోజ్‌వాటర్ వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని నల్లని మచ్చలు ఉన్న చోట అప్త్లె చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చొప్పున నెల రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా నల్లని మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. అయితే ఈ ప్యాక్‌ని మొటిమలు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది.

గమనిక:

ఈ ప్యాక్‌లలో పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.. దానివల్ల చర్మం తిరిగి జిడ్డుగా మారి, మొటిమల సమస్య పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి దానికి బదులుగా రోజ్‌వాటర్‌ని ఉపయోగించడం శ్రేయస్కరం.

ఈ ప్యాక్‌లను వేసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో నూనె, మసాలా సంబంధిత పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా పండ్ల రసాలు, నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని