Published : 16/10/2022 10:01 IST

అప్పటి నుంచి లిఫ్ట్ ఎక్కడం మానేసింది.. ఆ భయం ఎలా పోతుంది?

మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. ఉద్యోగం చేస్తోంది. ఆరు నెలల క్రితం తను ఎక్కిన లిఫ్ట్‌లో సమస్య వచ్చి ఆగిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకుండానే బయటపడింది. ఆ సంఘటనతో తను తీవ్ర భయానికి లోనైంది. అప్పటి నుంచి లిఫ్ట్‌ అంటేనే భయపడుతోంది. ఎక్కడికి వెళ్లినా లిఫ్ట్‌ని ఉపయోగించడం లేదు. తలుపులు మూసేస్తారని సినిమాకు కూడా వెళ్లడం లేదు. తనకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేస్తే ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నాం. మా అమ్మాయిలో ఈ భయం పోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. కొంతమందిలో ఎప్పుడైనా అనుకోని సంఘటన/ప్రమాదం జరిగినప్పుడు, చూసినప్పుడు అది ఫోబియా లాగా మారుతుంది. నీళ్లలో దిగినప్పుడు, చీకటిలో నడుస్తున్నప్పుడు, రైలు బ్రిడ్జ్‌పై నుండి వెడుతున్నప్పుడు కొంతమంది ఇలానే భయపడుతుంటారు. కానీ, ఇలాంటి సమస్యలను చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి పరిష్కరించవచ్చు. వీటిని ‘సైకో సైబర్‌నెటిక్స్’ అంటారు. అంటే మీ అమ్మాయిని కళ్లు మూసుకోమని చెప్పి లిఫ్ట్‌ ఎక్కుతున్నట్టు భావించమనండి. కొద్దిసేపటి తర్వాత లిఫ్ట్‌ నుంచి క్షేమంగా నవ్వుతూ బయటకు వచ్చినట్లు ఊహించుకోమనండి. ఇలా అనేకసార్లు విజువలైజేషన్ చేయిస్తే మీ అమ్మాయిలో ఉన్న భయం క్రమంగా పోతుంది. ‘మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేస్తే ఇబ్బందులు వస్తాయేమో’ అంటున్నారు. అయితే సత్వర పరిష్కారం కోసం మంచి సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు ‘న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్’ (NLP) ద్వారా మీ అమ్మాయిలోని భయాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కంగారు పడకండి. ఈ సమస్య అంత తీవ్రమైనది కాదు. తొందర్లోనే మీ అమ్మాయి సాధారణ స్థితికి చేరుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని