పెళ్లైన తర్వాత కూడా కొలీగ్స్‌తో చనువుగా ఉంటానంటోంది..!

మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. ఎంబీయే చదువుకుని ఉద్యోగం చేస్తోంది. తనకు మొదట్నుంచి స్నేహితులు ఎక్కువ. ఇప్పుడు తన సహోద్యోగులతో చాలా చనువుగా ఉంటోంది.

Updated : 19 Aug 2023 20:02 IST

మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. ఎంబీయే చదువుకుని ఉద్యోగం చేస్తోంది. తనకు మొదట్నుంచి స్నేహితులు ఎక్కువ. ఇప్పుడు తన సహోద్యోగులతో చాలా చనువుగా ఉంటోంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుంటుంది. అందులో అబ్బాయిలు కూడా ఉన్నారు. ‘రేపు పెళ్లైన తర్వాత కూడా ఇలాగే ఉంటావా?’ అంటే.. ‘అవును, నాకు నచ్చినట్టుగా నేనుంటా’నంటూ వితండవాదం చేస్తోంది. మేము చెప్పే మంచి విషయాలు తను అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి ప్రవర్తన వల్ల పెళ్లైన తర్వాత ఇబ్బందులు వస్తాయనిపిస్తోంది. మా అమ్మాయిలో మార్పు రావాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ అమ్మాయి ఎంబీయే చదివి ఉద్యోగం చేస్తోందని అంటున్నారు. అలాగే తన సహోద్యోగులతో చనువుగా ఉండడంతో పాటు ఇంటికొచ్చిన తర్వాత కూడా వారితో గంటల కొద్దీ ఫోన్‌లో మాట్లాడుతోందని చెబుతున్నారు. అయితే మీ అమ్మాయి అలా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా మనం ఎవరితో అయితే సంతోషంగా ఉంటామో వారితోనే ఎక్కువగా మాట్లాడుతుంటాం. అలాగే మీ అమ్మాయి కూడా తన సహోద్యోగులతో మాట్లాడుతోందేమో ఆలోచించండి. మీ అమ్మాయి ఉద్యోగం చేస్తోంది. ఈ వయసులో తనకంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలను ఏర్పర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే తన వ్యక్తిగత జీవితంలో మీరు అనవసరంగా కలగజేసుకుంటున్నారన్న భావన తనలో ఉందేమో ఆలోచించండి. అందువల్లే పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటానని చెబుతోందేమో. సాధారణంగా పెళ్లి కాకముందు స్నేహితులతో ఎక్కువ సమయం మాట్లాడ్డం, గడపడం మామూలుగా జరిగేదే. అయితే మీరు దానిని తప్పుగా భావించి, ఈ విషయంలో ఆంక్షలు పెట్టినట్లయితే తనకు అనవసరమైన ఆలోచనలు కలగచేసినట్లవుతుందేమో కూడా ఆలోచించాలి.

సాధారణంగా మనమంతా జీవితంలో వివిధ దశలను దాటుకుని ముందుకు వెడుతుంటాం.  అవసరాలు, అనుభవాలను బట్టి ఎప్పటికప్పుడు మన ప్రాధాన్యాలను మార్చుకుంటాం. ఈ క్రమంలో మీ అమ్మాయి పెళ్లైన తర్వాత కూడా ఇలాగే ఉంటానని చెప్పినప్పటికీ- వాస్తవానికి అప్పటి పరిస్థితులు, ఆలోచనలు వేరుగా ఉండచ్చు. స్నేహితులతో మాట్లాడే సమయం కూడా తనకు దొరక్కపోవచ్చు. కాబట్టి, ఈ విషయంలో మీరు అతిగా ఆందోళన చెందడం అనవసరమేమో. పెళ్లైన తర్వాత కూడా ఇలాగే ఉన్నట్లయితే వచ్చే నష్టాల గురించి అప్పుడప్పుడు సూచనప్రాయంగా చెప్పడం మాత్రం తల్లిగా మీ బాధ్యత. అలా చెప్పేటప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మీరు అనవసరంగా కలగజేసుకుంటున్నారన్న భావన కలగకుండా జాగ్రత్తపడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని