నా భర్తకు నేనంటే ఇష్టం లేదు..!

నా భర్త ఏ మాత్రం ప్రేమ చూపించకపోయినా భరిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు ఇంకా ఆ బాధను తట్టుకునే శక్తి నాలో లేదు. అతని నుంచి విడిపోవాలని ఉంది. కానీ, తను లేకుండా ఒంటరిగా బతకగలనా? అనే భయం కూడా వేస్తోంది.

Published : 05 Sep 2023 12:33 IST

నాకు పెళ్లై ఏడేళ్లవుతోంది. మొదట్నుంచి నా భర్తకు నేనంటే ఇష్టం లేదు. అతను నా పట్ల ఎలాంటి ప్రేమను చూపించడు. కానీ, నాకు మంచి కుటుంబ జీవితం, సమాజంలో గౌరవం పొందాలనే ఆశ ఉంది. అందుకే నా భర్త ఏ మాత్రం ప్రేమ చూపించకపోయినా భరిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు ఇంకా ఆ బాధను తట్టుకునే శక్తి నాలో లేదు. అతని నుంచి విడిపోవాలని ఉంది. కానీ, తను లేకుండా ఒంటరిగా బతకగలనా? అనే భయం కూడా వేస్తోంది. ఎటూ నిర్ణయించుకోలేక ఇబ్బంది పడుతున్నాను. నా మనసులోని భయాలు పోవాలంటే నేనేం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు పెళ్లై ఏడేళ్లవుతోందని అంటున్నారు. అంటే మీ వివాహ బంధంపై ఒక సరైన అవగాహనకు, నిర్ణయానికి రావడానికి ఈ ఏడేళ్ల సమయం ఒక రకంగా ఎక్కువే అని చెప్పుకోవాలి. మీరు మంచి కుటుంబ జీవితం, సమాజంలో గౌరవం పొందాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మీ భర్త ప్రేమ చూపించకపోయినా ఇన్నేళ్లుగా భరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ బాధను తట్టుకునే శక్తి లేక విడిపోవాలనుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయానికి వచ్చే ముందు మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించారో లేదో ఆలోచించండి. ఈ క్రమంలో మీ భర్తకు మీరంటే అసలు ఎందుకు ఇష్టం లేదో, అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ భర్త కావాలనే మీతో ఇలా ప్రవర్తిస్తున్నాడా? లేదంటే అతని వ్యక్తిత్వమే అలాంటిదా అనేది తెలుసుకోండి.

మీ భర్త మీపై ప్రేమ చూపించడం లేదని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు నాలుగు రకాలుగా ఉంటారు. కొంతమంది తమ భార్యతో కావాలనే సరిగా ఉండరు. వీరు ఇతర మహిళలతో ప్రవర్తించే విధానం కూడా ఆమోదయోగ్యంగా ఉండదు. మరి కొంతమంది తమ ప్రేమను సరిగా వ్యక్తం చేయలేరు. దీనివల్ల అవతలి వ్యక్తి బాధపడుతున్నారన్న విషయం వారికి తెలిస్తే.. తమను తాము మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకొంతమంది మేము అందరితో ఈవిధంగానే ప్రవర్తిస్తుంటాం. అలాగే నా భార్యతోనూ ఉంటున్నాను. ఆమాత్రం అర్థం చేసుకోలేదా? సర్దుకుపోతే తప్పేంటి? అనే అభిప్రాయంతో ఉంటారు. ఇక చివరి రకం వ్యక్తులు భార్యంటే అణిగిమణిగి ఉండాలి. నేను అన్ని వసతులు కల్పిస్తున్నాను. సుఖసంతోషాలు ఇస్తున్నాను. ప్రేమను ఇంకెలా చూపించాలి..? అదెలాగో మాకు తెలీదు.. అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఇందులో మీ భర్త ఏ కేటగిరీకి చెందుతాడో ఒక నిర్ణయానికి రండి. దానిని బట్టి మీలో ఉన్న భయాలను తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఏదిఏమైనా మీరిద్దరూ ఒకసారి రిలేషన్‌షిప్‌ నిపుణులను సంప్రదించండి. వారు మీ సమస్యను అర్థం చేసుకుని తగిన పరిష్కారాన్ని సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని