Published : 25/11/2022 12:34 IST

లవ్ ఎఫైర్లు ఉన్నాయా.. అని అడుగుతున్నాడు!

నాకు పెళ్లై మూడు నెలలవుతోంది. నా భర్త మంచివాడే. అయితే ఆయన పదే పదే ‘నీకు గతంలో ఏవైనా లవ్‌ ఎఫైర్లు ఉన్నాయా? ఉంటే చెప్పు. నేను ఏమనుకోను’ అని సతాయిస్తున్నారు. ఏమీ లేవని ఎంతగా చెప్పినా నమ్మడం లేదు. ఆ విషయాన్ని వదలడం లేదు. తనకు ఈ విషయంలో నమ్మకం కలిగేలా చేయాలంటే ఏం చేయాలి? నాకు నిజంగానే అలాంటివేమీ లేవు. ఈ అంశం గురించి తనతో ఎలా మాట్లాడాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. ఈమధ్య కాలంలో కొత్తగా పెళ్లైన దంపతుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి సామాజిక మాధ్యమాలు కూడా కొంతవరకు కారణమవుతున్నాయి. మీ భర్త కూడా వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాలను చూసి మీకు కూడా అలాంటివి ఉన్నాయేమోనని భావిస్తుండవచ్చు.

అదేవిధంగా అతను అలా భావించడానికి మీ వైపు నుంచి కారణాలేమైనా దోహదం చేస్తున్నాయేమో కూడా చెక్ చేసుకోండి. పెళ్లైన కొత్తలో కొంతమంది దంపతులు ఎక్కువగా మాట్లాడుకోకుండా ముభావంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కూడా భాగస్వామికి తనంటే ఇష్టం లేదేమో అనుకోవచ్చు. దంపతులిద్దరి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అందుకే సాధ్యమైనంతవరకు ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఎలాంటి సంకోచాలు లేకుండా అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలి. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకుని, ఇద్దరి మధ్య తగినంత సాన్నిహితం పెరిగితే  ఇలాంటి సమస్యలు దాదాపుగా వాటంతటవే పరిష్కారమవుతాయి.

ఈ క్రమంలో- ఇద్దరూ కలిసి సాధ్యమైనంత సరదాగా గడపడానికి ప్రయత్నించండి. నవ్వుతూ మాట్లాడుకోండి. అలాగే అతను చేసే చిన్న చిన్న పనులను కూడా ప్రశంసించండి. ఒకవేళ అతను ఒంటరితనం ఫీలవుతుంటే దానిని దూరం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఇలా చేయడం ద్వారా కొంతకాలానికి అతనిలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగి సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఒకవేళ అతని స్నేహితులను కలిసినా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా కొన్ని నెలల పాటు ప్రయత్నించి చూడండి. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే మంచి సైకాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్‌ ఇప్పించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని