శరీరంపై అవాంఛిత రోమాలున్నాయని నా భర్త విడిచిపెట్టాడు..!

నమస్తే మేడమ్‌.. నా శరీరంపై వెంట్రుకలు అధికంగా ఉంటాయి. ఈ కారణం చూపెడుతూ నా భర్త నన్ను విడిచిపెట్టాడు. ఇది నా ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపించింది. నా సమస్యను పరిష్కరించుకోవడానికి శరీరం మొత్తం.....

Published : 21 May 2023 10:34 IST

నమస్తే మేడమ్‌.. నా శరీరంపై వెంట్రుకలు అధికంగా ఉంటాయి. ఈ కారణం చూపెడుతూ నా భర్త నన్ను విడిచిపెట్టాడు. ఇది నా ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపించింది. నా సమస్యను పరిష్కరించుకోవడానికి శరీరం మొత్తం లేజర్‌ చికిత్స చేయించుకున్నాను. అయినా, మరో వ్యక్తితో కలిసి జీవించాలంటే చాలా భయంగా ఉంది. అతను కూడా నాలో ఏదైనా తప్పును వెతుకుతాడేమోనని అనిపిస్తోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. - ఓ సోదరి

జ. మీ భర్త ఆలోచనా విధానం, అతను చేసిన పని మిమ్మల్ని తీవ్రంగా బాధించాయని అర్థమవుతోంది. దానివల్ల మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారని తెలుస్తోంది. మీ భర్త నిర్ణయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయచ్చు. అంతమాత్రాన మీరు అవే విషయాలను తలచుకుంటూ కుంగిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే మీరు మరొక బంధంలోకి అడుగుపెట్టాలంటే మిమ్మల్ని మీరు మానసికంగా దృఢపరచుకోవడం ఎంతో అవసరమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే గత అనుభవాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయన్న విషయం అర్థమవుతోంది. కానీ, మీరు దానికంటూ ఒక పరిష్కార మార్గాన్ని (లేజర్ చికిత్స చేయించుకోవడం) వెతికారు. అలాగే ఇలాంటి సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు. సమాజంలో చాలామందిని ఇలాంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే అవి క్లిష్టమైనవే అయినప్పటికీ తప్పకుండా తగిన పరిష్కారం లభిస్తుంది.

మీ సమస్యను వాస్తవ దృక్పథంతో ఆలోచించడానికి ప్రయత్నించండి. మనుషులుగా మనలో చాలా లోపాలు ఉంటాయి. అయితే ఎవరి సమస్య వారికి భిన్నంగా అనిపించవచ్చు. కానీ సమస్యను అంగీకరించి దానికి తగిన పరిష్కారాన్ని వెతకడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మన సమస్యలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. సమాజంలో అందం గురించి ఇప్పటికీ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉంటుంటాయి. అయితే అందరి విషయంలో ఇవి సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రాన దిగులు చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడతారో అప్పుడు అవతలి వ్యక్తి నుంచి ప్రేమను ఆశించే అవకాశం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

మీ భర్త పాత కాలపు అభిప్రాయాల నుంచి బయటకు రాకపోవడం విచారకరం. అయితే ఎవరి అభిప్రాయాలు వారికి ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, వాటిని కారణంగా చూపెడుతూ జీవిత భాగస్వామిని దూరం పెట్టడం మంచిది కాదు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని మీతో సున్నితంగా చర్చించి, ఒక నిర్ణయానికి రావాల్సింది. ఏది ఏమైనా ఇప్పుడు అతను మీతో కలిసి లేడు. కాబట్టి, మీకు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. అయితే ఈ సమయంలో గత అనుభవాల గురించి ఆలోచించకుండా మీ అత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి.

సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఒకరి అభిప్రాయం మరొకరితో సరిపడకపోవచ్చు. అయితే ఇద్దరూ కలిసి చర్చించుకుంటే ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దంపతులు కూడా తమ జీవితభాగస్వామి లోపాలను ఇతరులతో పోల్చుతూ కించపరచకూడదు. దీనివల్ల అవతలి వ్యక్తి ఆత్మాభిమానం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయభేదాలను చర్చించుకుని పరిష్కరించుకోవడం మంచిది. అయితే అందరూ మీ భర్త లాగా ఉంటారనుకోవడం అవివేకమే అవుతుంది. మిమ్మల్ని మీరుగా ఇష్టపడే వ్యక్తి మీకు తారసపడే అవకాశం లేకపోలేదు. కాబట్టి, అప్పటివరకు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ పాత జ్ఞాపకాలు ఇబ్బంది పెడుతుంటే సాధ్యమైనంత వరకు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం స్నేహితులతో గడపడం, యోగా చేయడం, నచ్చిన వ్యాపకంపై దృష్టి పెట్టడం వంటి మార్గాలను పరిశీలించండి. అప్పటికీ మీ ఆలోచనల్లో మార్పు రాకపోతే మానసిక నిపుణుల సహాయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్