ఆమె ఫోన్ చేస్తే పరుగున వెళ్తున్నాడు.. ఎఫైర్ ఉందేమో అనిపిస్తోంది!

నా వయసు 32 సంవత్సరాలు. ఈ మధ్య నా భర్త ఇంట్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకున్నప్పుడల్లా ఆఫీస్ పని ఉందని చెప్పి చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేస్తున్నాడు. తనకు ఆఫీసులో మహిళా మేనేజర్‌తో....

Published : 03 May 2023 13:13 IST

నా వయసు 32 సంవత్సరాలు. ఈ మధ్య నా భర్త ఇంట్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకున్నప్పుడల్లా ఆఫీస్ పని ఉందని చెప్పి చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేస్తున్నాడు. తనకు ఆఫీసులో మహిళా మేనేజర్‌తో ఎఫైర్‌ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆమె ఫోన్‌ చేస్తే పరుగున ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఆమెకు విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటోంది. ఈ విషయం నన్ను ఇంకా బాధపెడుతోంది. ఆమె వల్ల మేము విడిపోతామేమోనని భయంగా ఉంది. ఈ విషయంలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ భర్త మరొక మహిళకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని అంటున్నారు. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సాధారణంగా అవతలి వ్యక్తికి బాధ కలగడం సహజం. అయితే ఈ విషయంలో ఒక్కసారిగా అతనితో గొడవ పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ముందుగా అసలు విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మీ భర్త గురించిన మీ అనుమానం నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం అతనితోనే చర్చించండి. మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మరొక వ్యక్తితో ఉన్న సంబంధం గురించి చర్చించడం ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగే ఇది సున్నితమైన విషయం కాబట్టి, అవతలి వ్యక్తి చెప్పే విషయాలు కోపాన్ని తెప్పించే అవకాశం కూడా ఉంటుంది. అయినా అతనితో గొడవ పడకుండా, అడ్డు చెప్పకుండా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో అనవసరమైన విషయాల గురించి ప్రస్తావించకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

ఒక్కసారి అసలు నిజాలు తెలిసిన తర్వాత మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో తన తప్పుకి  మీ ప్రవర్తనే కారణమని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితి ఎదురైతే- ఆ విషయం ఎంతవరకు కరెక్టన్నది సునిశితంగా విశ్లేషించుకోండి.. అయితే దాంపత్య బంధం సజావుగా సాగాలంటే అందులో ఇద్దరి బాధ్యత ఉంటుంది. ఒకరిలో ఏవైనా లోపాలున్నంత మాత్రాన ఆ సంబంధాన్ని నిర్లక్ష్యం చేసి, వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని లేదు. ఇదే విషయాన్ని అతనికి స్పష్టంగా తెలియచేయండి. ఏదేమైనా ఈ పరిస్థితులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొన్నాళ్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదేమో ఆలోచించండి. ఈ క్రమంలో మీ భర్త నుంచి ఎలాంటి ప్రేమను ఆశిస్తున్నారో స్పష్టంగా తెలియజేయండి. అలాగే అతను మీవైపు నుంచి ఏవైనా తప్పులు ఎత్తిచూపితే, ఒకవేళ అవి నిజమే అయితే వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చో ఆలోచించండి. అప్పటికీ మీ మధ్య సానుకూల వాతావరణం లేకపోయినా, ఇద్దరూ కలిసి మాట్లాడలేనంత పరిస్థితులు ఉన్నా రిలేషన్‌షిప్‌ నిపుణులను సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్